భగవంతుని పై నమ్మకం

త్రిలోక సంచారి అయిన నారదమహర్షికి ఒక రోజు భూలోకంలో సంచరిస్తుండగా,  ఒకబ్రహ్మణోత్తముడు నిత్యానుష్టానం చేసుకుంటూ అగ్నిహోత్రం ముందు కనిపించాడు.  కుశల ప్రశ్నల అనంతరం, నారదమహర్షిని ఆ బ్రాహ్మణుడు, ‘ స్వామీ ! నిత్య నైమిత్తిక కర్మలతో, నారాయణ స్మరణతో జీవితం యెంతో భక్తిగా గడుపుతున్నాను.  అలిసిపోయాను. తమరు వైకుంఠంలో ఆ శ్రీమన్నారాయణుని దర్శించినప్పుడు, నా దేహంలో వున్న జీవుడు కడతేరి, ఆ నారాయణుని పాదపద్మాలవద్దకు యెప్పుడు చేరుతుందో తెలుసుకుని చెప్పండి. ‘  అని ప్రాధేయపడ్డాడు.

‘ సరే ‘ అని నారదమహర్షి నారాయణ స్మరణ చేసుకుంటూ   ఊరి వైపు వెళుతుండగా, ఒక మర్రిచెట్టు క్రింద చెప్పులుకుట్టే వృత్తిలో జీవించే చర్మకారుడు, తన పని తాను చేసుకుంటూ,  నారదుని చూసి, భక్తితో నమస్కరించి, అనుకోకుండా, బ్రాహ్మణోత్తముడు అడిగిన విషయాన్నే ప్రస్తావించి, అడుగుతూ, ‘ బతుకుబాటలో  అలిసిపోయాను సామీ ! ఆ నారాయణుని నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నాను. వైకుంఠం నుండి తిరిగి వచ్చేటప్పుడు ననెప్పుడు పిలిపించుకుంటాడో, కొద్దిగా అడిగిరా సామీ ! ‘ అని ప్రాధేయ పడ్డాడు.  

ఇరువురూ ఒకే విధమైన కోరిక కోరినందుకు నారదుడు యెంతో సంతోషించి,  వైకుంఠంలో నారాయణుని దర్శించినప్పుడు, సత్సంగంతో, సత్కాలక్షేపం అయిన తరువాత, తిరిగి వచ్చేముందు,  ఆ బ్రాహ్మణుని కోరిక, చర్మకారుని యిచ్ఛా విన్నవించు కున్నాడు, శ్రీహరికి.

శ్రీహరి యెంతో నిదానంగా,  అలోచించి, చిరునవ్వుతో తలపంకిస్తూ,  ‘ నారదా ! ఆ బ్రాహ్మణోత్తమునికి ఇంకా కొద్దిజన్మలు పడుతుందని చెప్పు, నన్ను చేరడానికి.  అయితే, చర్మకారుడు మాత్రం తొందరలోనే నన్ను చేరుకుంటాడు. ‘ అని సమాధానం యిచ్చాడు. ఆ మాటలకు నారదుడు  ఆశ్చర్యపోయి, అదేమీ స్వామీ ! నిత్యాగ్నిహోత్రుడు, వేద వేదాంగ పారాయణుడు, అయిన ఆ బ్రాహ్మణునికి నీవాకిలి యింకా జన్మజన్మల దూరముండడమేమిటీ !  ఏ దైవ చింతనా లేకుండా, అపరిశుభ్రంగా అందరి పాద రక్షలు ఒళ్ళో పెట్టుకుని వాటిని కుట్టుకుంటూ, జీవించేవాడికి, త్వరలో, నీ సాంగత్యమా ! నా ఊహకు అందడంలేదు, మీ నిర్ణయం.  శ్రీహరి పొరబడలేదు కదా ! ‘ అని మనసులో సంశయం బయట పెట్టాడు, నారదుడు.

శ్రీమన్నారాయణుడు,   యేమాత్రం కోపగించుకోకుండా అదే చిరునవ్వుతో, ‘ నారదా !  నీ సంశయం నాకు బోధపడింది. నా గురించి వారు అడిగినప్పుడు,  నేను, అత్యవసరంగా సూది బెజ్జంలో ఏనుగును యెక్కిస్తున్నాను అనిచెప్పు.  ఆ యిద్దరి సమాధానం విను, నీకే అర్ధమౌతుంది. ‘ అని ఊరుకున్నాడు.

‘నారాయణ ! నారాయణ ! ‘ అనుకుంటూ నారదుడు, అన్ని లోకాలు తిరుగుతూ, మళ్ళీ భూలోకానికి వచ్చి, మొదటగా,  బ్రాహ్మణోత్తముని కలిసాడు. ఆ బ్రాహ్మణుడు మాటలలో, “నారద మహర్షి తమరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు, శ్రీహరి యేమి చేస్తున్నాడు” అని అడుగగా,  ‘ ఆ యేముందీ ! ఏదో అత్యవసరమైన పనిమీద, ఒక ఏనుగును సూది బెజ్జంలో ఎక్కిస్తున్నాడు. నాకైతే యేమీ అర్ధం కాలేదు ఆయన చేష్టకు. ‘ అని అంటూ బ్రాహ్మణుని ప్రతిస్పందన  కోసం ఎదురు చూసాడు. వెంటనే, ఆ బ్రాహ్మణుడు, ‘ అదేమీ నారదా ! మహావిష్ణువు ఏనుగును సూది బెజ్జంలో యెక్కించడమేమిటీ, నీవు చూడడమేమిటీ, నాకు చెప్పడమేమిటీ ? మార్గాయాసమున తమకు మతిస్థిమితం తప్పలేదు కదా !  కొద్దిగా మంచి తీర్ధం పుచ్చుకుంటారా ? ‘ అని హేళనగా అన్నాడు. ‘ లేదు లేదు నేను చెప్పినది నిజమే అని నారదుడు చెప్పగా నేను నమ్మను, నా హరి యే నాటికీ అలాంటి పిచ్చి చేష్టలు చెయ్యడు. ‘ అంటూ తాను భగవానుని అడగమన్న విషయం కూడా అడగడం మర్చిపోయాడు, బ్రాహ్మణుడు.
నారదుడు   చల్లగా, అక్కడనుంచి లేచి,  బయటకు వచ్చేసాడు.

‘నారాయణా !  నాకు భలే పని వప్పజెప్పవయ్యా !  నువ్వు చెప్పమన్న మాట చెబితే ఎవరైనా నమ్ముతారటయ్యా ! ‘  అని అనుకుంటూ, మర్రి చెట్టు క్రింద చెప్పులు కుట్టుకుంటున్న చర్మకారుని  సమీపించి, అతను కూడా, నారాయణుడు యేమి చేస్తున్నాడు అని అడుగగా, నారదుడు,  ఆ బ్రాహ్మణునికి చెప్పినట్లే, ‘ నారాయణుడు సూది బెజ్జంలోనికి ఏనుగును అత్యవసరంగా పంపే ప్రయత్నం చేస్తున్నాడు ‘ అని   చెప్పుతూ… ఎందుకు చేస్తాడో శ్రీహరి యిలాంటి పనులు .’ అని నిర్లిప్తంగా అన్నాడు.

ఆ మాటలు వినీ వినడంతోనే,  ‘ అలా అనకండి సాములూ ! చిన్న విత్తనం లోనుంచి ఇంత పెద్ద మర్రి చెట్టు సృష్టించాడు, మాకందరికీ నీడనిచ్చాడు.  ఆయన యే పనిచేసినా యేదో పరమార్ధం ఉంటుంది. ‘ అంటూ, చటుక్కున లేచి నిలబడి, ఆ చర్మకారుడు, భక్తితో ఆకాశం వైపు చూస్తూ, అంజలి ఘటించి, ‘ తండ్రీ !  నువ్వు యెప్పుడో, అనేక అవతారాలు యెత్తి యెంతమంది పాపులనో చంపివేశావని విన్నాను. చిన్న పిల్లవాడు కోరితే, స్తంభంలోనుంచి వచ్చి రాక్షసుడిని చంపావని విన్నాను.  కోతుల సాయంతో పది తలల రావణుడిని మదమడిచావని విన్నాను. నీ మూడు అడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి బలిని పాతాళానికి తొక్కేసావని విన్నాను. అట్లాంటి సామివి, యిప్పుడు యే గొప్పపని చేయడానికో ఏనుగుని సూది బెజ్జంలోకి పంపే యేర్పాటు చేస్తున్నావా తండ్రీ !  ‘ అంటూ పరిపరి విధాలా శ్రీహరిని స్తుతిస్తూ, కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

ఆ చర్మకారుని స్పందనకి నారదుడు చలించిపోయాడు.  ఆయన కూడా చర్మకారునితో పాటు తలపైకెత్తి చూసాడు.  తనకొక్కడికే కనబడుతూ నారాయణుడు, అదే మందహాసంతో, ‘   చూసావా నారదా ! ఇరువురికీ నా లీలలపై ఉన్న విశ్వాసం బేరీజు వేసావా !  అందుకే శీఘ్ర జన్మ సాయుజ్యం యీ చర్మకారునికి. నామీద యింకా బాగా విశ్వాసం కుదిరిన తరువాత, ఆ బ్రాహ్మణోత్తమునికీ  ‘ అని చెప్పినట్లు అనిపించింది నారదమహర్షికి.

పరమాత్ముని విజ్ఞతకి, చేతులు జోడించి అంజలి ఘటించాడు, నారద మహర్షి కూడా, ఆకాశం వైపు చూస్తూనే.

          స్వస్తి
  శుభం భూయాత్

సేకరణ:
పైడి నాగ సుబ్బయ్య
బద్వేలు.