శ్రీమతే రామానుజాయ నమః

“ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంత మియంతమర్దం |
అవిస్మృతి స్త్వచ్చరణారవిందే
భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ ||”

ఓ ముకుందా! నా శిరస్సు వంచి సాష్టాంగము సమర్పించి చిన్న కోరిక యాచిస్తున్నాను. నాకు కలిగే ప్రతిజన్మలో ని దివ్యానుగ్రహం చేత నీ పాదపద్మములను మరిచిపోకుండా సదా స్మరించేలా కటాక్షించుము.
ఓ ముకుందా!మోక్షాన్ని ప్రసాదించేవాడవు నువ్వేనని నీ నామమే చెబుతోంది. సంసారంలో చిక్కుకుని ఉన్న ప్రకృతిబంధాన్ని విడిపించేవాడవు నువ్వే. ఏ విషయంలోనైన అధికుడి వద్దకుడు అల్పులు ఆశ్రయిస్తే తనవద్ద ఉండే భాగ్యమును అడగడానికి వచ్చారు అనుకుంటాడు.అలా కులశేఖరాళ్వార్లు పరమాత్మను అంటున్నారు,”స్వామి నిన్ను యాచిస్తున్నది మోక్షం కోసం అడుగుతున్నా అనుకోకు.”స్వామి నువ్వు అనుకుంటే నన్ను ముక్తజీవులతో సమానముగా చేయగల సమర్థుడవు నీకు ఆ శక్తి ఉన్నది. కానీ,అలాంటి ప్రయోజనం అడగడానికి నాకు యోగ్యత లేదు. కాబట్టి శిరస్సు వంచి వేడుకుంటున్నాను. ఎలా అంటావేమో? విసుగుతో కాకుండా భక్తిశ్రద్దాపురస్సరముగా, గీతలో ఇలా వివరిస్తారు.
“తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం” – అన్న రీతిలో సాష్టాంగనమస్కారము చేసి వేడుకుంటున్నాను.కర్మజ్ఞానభక్తులు లేనివాడను.నిన్ను యాచించుటకు కూడా యోగ్యత లేనివాడను,  
స్వామి ఇలా అంటున్నారు : కొంచెం కూడా యోగ్యత లేనివాడివి నావద్దకు ఎలా వచ్చావు?
కులశేఖరులు: అధికారముకలవారి వాలే కాకుండా వినయపూర్వకముగా యాచిస్తున్నాను.
ఆళ్వార్లు కూడా బ్రహ్మగారివలె పరమాత్మను వేడుకుంటున్నారు. “భాగవతంలో ఒక ఐతిహ్యం ఉన్నది. బ్రహ్మ శ్రీకృష్ణమూర్తిని ఉద్దేశించి “స్వామీ! నేను ప్రకృతిబద్ధుడను,అపచారపడ్డాను.ఈ అపరాధముకు శిక్షగా ఏ  జన్మ ఇచ్చినా పర్లేదు. “
ఈ జన్మలో గొప్ప అధికారమున్నను దోషిని అయ్యాను.నాకు హీన జన్మ వచ్చినా నీ భక్త కోటిలో అధమ భక్తుడనైన నిన్ను మరిచిపోకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించుము అని బ్రహ్మదేవుడు అడిగిన ప్రకారం కులశేఖరాళ్వార్లు అడిగారు.
“అబ్రహ్మభువనా ల్లొకాః పునరావర్తినోర్జున |
మా ముపేత్య టు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ||”
అని గీతలో తెలిపినట్లు ఏ జన్మమును ఏ అవస్థను పొందినా కూడా పరమాత్మను మారకూడదు మరిచిపోతే అసలు ప్రయోజనమే లేదు.అందువల్లనే కులశేఖరాళ్వార్లు ‘అవిస్మృతి’ — భగవంతుడిని మరవని స్మ్రుతి అడిగారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.