శ్రీమతే రామానుజాయ -నమః

“శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి
భక్తప్రియేతి భవలుంఠవకోవిదేతి,
వాధేతి వాగశయనేతి జగన్నివాసే
త్యాలపనం ప్రతిపదం కురుమే ముకుంద.”

ఓ ముకుందా! శ్రీవల్లభాయని, వరదాయని, దయాపరాయని, భక్తప్రియాయని, సంసారమును దాటించుటయందు సమర్థుడాయని, నాధుడాయని, శేషశయనాయని, జగత్తంతటా వ్యాపించి నివసించేవాడాయని, ఎల్లప్పుడూ నీయొక్క నామములని నేను కీర్తించేటట్లు చేయి స్వామీ..
(విపులంగా తెలుసుకుందాము):

ఇహపర లోకములయందు కలిగిన కోరికలను తీర్చగల సర్వశక్తిమంతుడైన ఓ ముకుందా! నిన్ను శ్రీవల్లభా అని పిలిచేటట్లు చేయుము, శ్రీవల్లభుడు అనడంలో విశేషమేమిటంటే పరమాత్మ పరమ వాత్సల్య స్వభావం కలిగినవాడగుట వల్ల పాపపంకిలమైన ఆత్మలను ఎలా ఐన తరింపచేయాలని పాపాన్ని తొలగించుటకు తనయొక్క స్వామిత్వ గుణంతో సిద్ధపడతాడు దండిస్తాడు. కానీ జగత్తుకు తల్లి అయినటువంటి లక్ష్మీదేవికి మాత్రం అనుగ్రహించడం మాత్రమే తెలుసు నిగ్రహించడం తెలియదు.కాబట్టి అమ్మ స్వామికి చేతనులకు పురుషాకారరూపిణిగా వ్యవహరిస్తుంది. ద్వయమంత్ర ప్రకరణము 13వ వాక్యమును బట్టి పిరాట్టికి చేతనులతో మాతృత్వ సంబంధం కలిగి ఉండడంచేత చేతనుల యొక్క దుఃఖమును చూసి సహించలేక వీరికి చేయవలసిన కార్యములు తాను చేసి,పరమాత్మతో పత్నీత్వసంబంధం కలిగి ఆయనకు అత్యంత ప్రియురాలై ఉండడంచేత ఆయనను వశపరుచుకొని ఆయనలో దయ,వాత్సల్య గుణాలను పైకి తీసుకువచ్చి చేతనులను ఉద్ధరిస్తుంది అమ్మ. అంతేకాక “శ్రీ” అనేమాటకు భక్తుల ఆర్తధ్వని విని,వారి యొక్క కామక్రోధాది దోస్శములను పరిహరింపచేసి జ్ఞానభక్త్యాది సద్గుణములను కలిగించి,మోక్షయోగ్యులూహ చేసేది అని కూడా ఒక అర్ధం.శ్రీవల్లభా అంటే పరమాత్మ మీద ప్రభావం తీసుకువచ్చేదిగా అంటే ప్రభావ సంపన్నురాలగు లక్ష్మీదేవికి వల్లభుడా అని అర్ధం.లక్ష్మి దేవిని వల్లభగా గలవాడా అని అర్ధం..శ్రీకి ప్రీతిపాత్రుడని,అధిపతి అనికూడా అర్ధము. అమ్మ భగవంతుడికి సిఫారసు చేసి మనకు పూర్ణఫలమును కలిగించే శక్తికలిగినటువంటిది.సిఫారసు చేసేవారికి వాత్సల్యము,వాల్లభ్యము అనే రెండుగుణములు ఉండాలి.అమ్మకు ప్రాణికోటియందు వాత్సల్యము,పరమాత్మకు వల్లభగా ఉండుటచేత వాల్లభ్యము రెండు ఉన్నాయి. పిల్లవాడు ఎంత తప్పు చేసిన సరే తండ్రిపక్కన తల్లి ఉంటే భయమేమీ?కాబట్టే  మన కులశేఖరాళ్వార్లు మంగళాచరణముకై శ్రీ అను అక్షరమును ముందు ప్రయోగం చేశారు. దీనివల్ల సంపత్తి కలుగును,దురితహారమగును.
తరవాత వరదా! అని అనిపించమని అంటున్నారు.వరదుడనగా ‘వరం దదాతి ఇతి వరద:’ ఎవరికీ ఏది కావాలో దానిని ఇచ్చేవాడు.భక్తులకు కావలసినది ఇచ్చేవాడు, ఆ భక్తులను ఖండించువాడు కూడా.
ఓ ముకుందా! నాచేత దయాపరా అని అనిపించుము. దయాపరుడు అంటే కృపకు ఆధీనుడు. సృష్టి స్థితి లయములను దయాకార్యములంటారు.చరాచర ప్రపంచము యొక్క సృష్టిస్థితిలయములకు కర్తగా ఉంది భువన సంరక్షణ కోసం కృపా అనే గుణమును గొప్ప సాధనంగా కలిగినవాడు అని అర్ధం.
ఓ ముకుందా! భక్తప్రియా అని నాతోటి అనిపించుము. భక్తప్రియుడంటే భగవద్గీత లో ఇలా వివరిస్తారు
“సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యో స్తి న ప్రియః,
ఏ భజన్తి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహమ్.”
పరమాత్మ సర్వులకు సౌలభ్యం కలిగినవాడు.భక్తితో విశ్వసిస్తే కులశీలాదులను చూడక ఆశ్రయం ఇస్తాడు.సుగ్రీవుడు,విభీషణుడు స్వామిని ఆశ్రయించి రక్షణ పొందారు.వాలి,రావణాసురుడు వంటి వారు తిరస్కరించి చెడ్డారు.
ఓ ముకుందా! భవలుంఠనకోవిదా అని అనిపించుము. భవలుంఠన కోవిదుడు అనగా జనన మరణరూప సంసారమును ఛేదించుటయందు సమర్ధత కలిగినవాడు.”జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రవం”అని గీత లో చెప్పినట్టు పుట్టడం,గిట్టడం అను కార్యాలను పరమాత్మ ఆధీనంలో ఉంటాయి.
ఓ ముకుందా!నాధా అని నాచేత అనిపించు. నాధుడనగా ఆయనకు మించినది లేదు.పరము,పరతరము కూడా అతడే.ఇంద్రాది దేవతలు నాథులు కారా అంటే మనకు కోరికలు ఏ రీతిలో ఉంటాయో అలానే వారు స్వాతంత్య్రము లేనివారు.పరమాత్మ ఒక్కడే సర్వ స్వతంత్రుడు సమర్థుడు.
ఓ ముకుందా!నిన్ను నాగశయనా అని కీర్తించేటట్లు చేయుము. ఈ నామము ఇతరులకు ఎవ్వరికి లేని అసాధారణ వైభవమును తెలుపుతుంది.ఆ పరమాత్ముడు సహస్రఫణియగు ఆదిశేషుని మీద స్వస్థముగ పవళించి ఉన్నవాడు. ఎందుకు అంటే ఆశ్రితులయొక్క విరోధి నిరసనమునకై స్వామి అలా విషజ్వాలలు గల సర్పముపైన పవళించి ఉన్నాడు.
ఓ ముకుందా!జగన్నివాసా అని అనిపించుము. జగన్నివాసుడనగా సృష్టించిన దానిలోపల ప్రవేశించి ఉండేవాడు అని అర్ధం.దారమునందు ముత్యంలాగా భగవతునియందు సకలము గుచ్చబడి ఉన్నది.ఆదికూర్మరూపముతో ధరించి కాపాడుతున్నాడు పరమాత్మ. ఒక్కొక్క భగవన్నామంకు మోక్షాన్ని ఇప్పించేంతటి శక్తి కలిగినవి కాబట్టి కులశేఖరాళ్వార్లు నారాయణా అని నిరంతరం ప్రాందించేట్టుగా పరమాత్మ యొక్క అనేక కళ్యాణ గుణములను భగవన్నామాల ద్వారా ఉదహరించారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్