ముకుందమాల 10 శ్లోకం
Posted by adminJan 23
శ్రీమతే రామానుజయ నమః
“సరసిజనయనే సశంఖచక్రే
మురభిది మా విరమస్వ చిత్తరంతుం |
సుఖతరమపరం న జాతు జానే
హరిచరణ స్మరణామృతేన తుల్యం ||”
ఓ మనస్సా! శ్వేత తామరలలాంటి నయనాలు కలిగి శంఖ చక్రాలను ధరించి దివ్య మంగళ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు. ఎప్పటికీ ఆయన స్మరణ మానవద్దు. శ్రీహరి పాదపద్మాలను స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు కదా!
అంతిమస్మరణ కలగడానికి నిరంతరం పరమాత్మనే తలవమని కులశేఖరాళ్వార్లకు చెప్పగా “చింతయామి హరిమేవ సంతతం – హరినే సదా తలుస్తాను”అని 8వ శ్లోకంలో చెప్పారు.
ధ్యానం అనేది మనస్సుచేత చేయవలసిన కార్యం శరీరముతో చేయతగినదికాదు.
“తత్త్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేఇంద్రియక్రియః” ఇత్యాది గీతా శ్లోకముల ద్వారా మనస్సును మెల్లగా వశంచేసుకుని సంకల్పజన్యవిషయములు అన్నిటిని నిస్సేషముగ మనసుచేత వదిలి ఇంద్రియ సమూహము అలానే శబ్దాది విషయములనుండి నివర్తింపజేసి మెల్లగా వివేకయుక్తమైన బుద్ధిచేత ఆత్మ యందు నిలిపి దానికంటే ఇతరమైన వాటి గురించి చింతించకుండా ఉండమని చెబుతున్నాయి.
మనస్సును అంతతేలికగా వశపరచలేము దాని లక్షణాన్ని అర్జునుడు తన సంశయాన్ని కృష్ణుడికి ఇలా చెబుతాడు.
“చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం ||”
“కృష్ణా! మనస్సు చంచలమైనది.బలాత్కారంగా హరించేది.అధికబళం కలది.దానిని త్రిప్పడం గాలిని తిప్పడంలా అసాధ్యమని చెప్తాడు.”అందులో సందేహం లేదని కృష్ణ పరమాత్మ చెప్పెను “అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం”. మరి ఇలాంటి మనస్సుతో పరమాత్మను తలవడం అవుతుందా? ఆళ్వార్లు ఏమో “చింతయామి హరిమేవ సంతతం”అంటున్నారు కదా!అంటే మనస్సుతో జరిగే కార్యము కనుక దానిని వేడుకొనుట కర్తవ్యమని తలచి ప్రార్థిస్తున్నారు. ఓ మనసా! పరమాత్మతో చెప్పాను నీవు పలుచోట్లకు తిరుగుతుంటే నాకు వేరొక గత్యంతరం లేదు.నీవు నాకు బంధువువి కూడా.
“ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః ||”
అని చెప్పినట్లు ఓ మనసా నువ్వు నాకు బంధువువి.నేను ఎక్కడికి వెళ్లినా,అలాగే నేను ఏ జన్మెత్తినా నువ్వు నా వెంటే వస్తావు,అందుకు నిన్ను నమ్మి ‘చింతయామి’అని అన్నాను.కాబట్టి నిన్ను ఆ భగవంతుడి వద్దే విడిచి పెడతాను,నువ్వు అక్కడే ఉండు.అంటూ మనస్సుకు చక్కటి బోధ చేస్తున్నారు. అలా చెప్పే సమయంలో మనస్సుకు వచ్చే సందేహాలకు ఇలా సమాధానం ఇస్తున్నారు కులశేఖరాళ్వార్లు.
ఓ మనసా! నిన్ను పరమాత్మ పాదపద్మములనే చోట ఉంచుతున్నా అక్కడ సుఖం ఉంటుందా?రక్షణ ఉంటుందా?అని అనుకుంటావేమో.
‘సరసిజనయనే’ఓ మనసా ఏమని చెప్పమంటావు పరమాత్మ యొక్క శృంగాము.వారి యొక్క దివ్య నేత్రములు తామరపుష్పములవలె అత్యంత అందముగా ఉంది ఆకర్షించును.ఇంకా నీ రక్షణార్థం అంటావా? పరమాత్మ శంఖచక్రములు ధరించి ఉంటాడు,తన యొక్క చక్రము లోకములనే కాలుస్తుంది.శంఖధ్వని వింటే పదునాలుగు లోకాలు భయపడతాయి. ‘మనస్సుకు రక్షణమేమిటంటే పరమాత్మ యందు రుచి కలిగి ప్రవేశించే సమయములో ఇంద్రియాలు తిరిగి వెనకకు లాగుతాయి అలాంటి సమయంలో నిష్ఠకు రక్షణగా మోహపరిచి అవసరమైతే పరమాత్మ నుండి వేరు చేసే దుష్టశక్తులను హతమార్చగలిగే శంఖచక్రాదులు మనకు తోడుగా ఉన్నాయని’చెబుతున్నారు.
పరమాత్మతో సమానము కానీ మించినది కానీ మరొకటి లేదు.నిరంతరం శ్రీహరి సంకీర్తనమనే అమృతాన్ని సేవిస్తూ ఆనందంగా వసిస్తూ ఉండుము.అంటూ కులశేఖరాళ్వార్లు పరమాత్మను సేవించడానికి సాధనమైన మనస్సును సిద్ధంచేసి ఉపాయాన్ని బోధించారు.
నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.