ముకుందమాల 11వ శ్లోకం
Posted by adminJan 24
శ్రీమతే రామానుజాయ నమః
“మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః
నామీ నః ప్రభవంతి పాపరిపవః స్వామీ నను శ్రీధరః |
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః ||”
ఓ మందమనసా! యమయాతనలను పలురకాలుగా భావించి భయపడకు,ఆ శత్రువులు మనల్ని ఏమి చెయ్యలేరు.శ్రీధరుడు కదా మనకు స్వామీ! భక్తసులభుడు అగు శ్రీమన్నారాయణుడిని ఆలస్యము చేయకుండా ధ్యానించుము.లోకములో ఉండే సమస్త వ్యసనములను పోగొట్టువాడు దాసుడిని సరిదిద్దలేడా?
“కులశేఖరాళ్వార్లు నిరంతరం పరమాత్మను స్మరించమని వారి దివ్య పాదముల వద్దు వదులుతున్నాను అని అక్కడ రక్షణ,సౌఖ్యము అన్ని కలుగుతాయని చెప్పగా మనస్సుకు కొంత ధైర్యం కలిగింది కానీ సంపూర్ణ నమ్మకం కలగలేదు.”
అలా చేరిన మనస్సుకు కలిగిన భయములేంటంటే’బహుధా యామీశ్చిరం యాతనాః’ ఓ కులశేఖరా నేను దుష్టుడను,నన్ను నమ్మితే నువ్వు కుంభీపాకం అనే దాని పడతావు,చెడిపోయిన నాకు సుఖము లేదు,అంతేకాక నన్ను నమ్మిన నిన్ను నరకం లో పడేస్తే నీతో పాటు నేను రావలసిందే అంటూ భయము కలుగుతోందట.
కులశేఖరాళ్వార్లు ‘మాభీర్మందమనో విచింత్య’ కొంచెము కూడా జ్ఞానం లేని మనసా! నువ్వు అవన్నీ తలుచుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయకు,అసలు నాకు నరకం అనేది వస్తే కదా నువ్వు నాతో నరకానికి వచ్చేది. నేను వెళ్లే స్థలము అత్యంత ఆనందదాయకమైనది కాబట్టి నువ్వు కూడా సుఖపడతావు. నేను చెప్పేది ని హితముకై అని భావించవచ్చు కదా! నిన్ను వెళ్ళమంటున్నది నీవు జన్మించిన స్థానముకే నిన్ను నియమించిన పరమాత్మ అయినా ప్రభువు వద్దకే కదా!. దేని మీద ని అనుమానము?
‘నామీ నః ప్రభవంతి పాపరిపవః’ పాపములు అనే శత్రువులు నేను హరి స్మరణలో ఉంటే మల్లి నన్ను మార్చి నరకములో పడేయడానికి(కామక్రోధలోభమోహమదమాశ్చర్యాలు అనే శత్రువులు) ప్రయత్నిస్తారు,నన్ను అలా తిరిగి లౌకిక వాంఛలవైపు ఈడుస్తే ఎలా?
ఓ అదా నీ భయం ‘స్వామీ నను శ్రీధరః’ – మనసా! మన వెంట ఉన్నవాడు సామాన్యమైన వాడనుకుంటున్నావేమో! శ్రీధరుడు మన అందరికి తల్లి అయినా అలాగే మన పాపములను దాచి మనల్ని మార్చి పురుషకారం వహించే లక్ష్మి దేవిని తన యొక్క వక్షస్థలములో కలిగినటువంటి పరమాత్మ,కాబట్టి అక్కడ అంటా సుఖమే ఉందును భయములకు తావులేదు.
పరమాత్మకు మనము ఏమి ఇవ్వాలని అంటావేమో ‘ఎప్పుడైనా పెద్దల వద్దకు వెళ్తుంటే వట్టి చేతులతో వెళ్ళకూడదు అనే నియామయున్నది అలా అని ఏదిపడితే అదికాకుండా వారికి ప్రియమైనది ఇస్తే వారు అనుగ్రహం మనయందు ఉంటుంది. మరి పరమాత్మకు ప్రీతి కలిగేది ఏముంటుంది అంటే మన యొక్క నిస్వార్థమైన భక్తి దాని ఇస్తే చాలుట పరమ ప్రీతితో దగ్గరకు తీసుకుంటాడు’.
“ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం” ఇంకా ఆలస్యం చేయకుండా ఇతరమైన విషయములను విడిచి పరమాత్మ యొక్క గుణములను స్మరించు చక్కటి జ్ఞానం కలుగుతుంది.
మనము ఇతరములను త్యజిస్తే మనము వెళ్లనవసరము కూడా లేకుండా ఆయననే మన హృదయాంతరముల యందు ప్రవేశించి వసించును.భక్తులకు ఎలాంటి శ్రమలు కలిగించడానికి ఇష్టపడడు అతడే శ్రీమన్నారాయణుడు. అంతటా వ్యాపించి,వహించి,ప్రకాశింపచేయువాడు కాబటి నారాయణుడు.
“గామావిశ్య చ భూతాని ధారయా మ్యహమోజసా |
పుష్ణామి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వారసాత్మకః ||” అన్నట్లు పురుషోత్తముడు ఆయనే.
అటువంటి పరమాత్మా వద్ద ‘లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః ‘ మేము నీ దాసుడిని అని వారి దివ్యపాదములపై పడితే చాలు ఏమి చూడకుండా కాపాడడానికి సిద్ధముగా ఉండేవాడు.అంటూ కులశేఖరాళ్వార్లు మనస్సును సిద్దము చేసుకోవలసిన రీతిని చెబుతూనే నెపంగా ఉంచి పరమాత్మ యొక్క వాత్సల్య గుణాలను ప్రకాశింపచేస్తున్నారు.
నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్