శ్రీమతే రామానుజాయ నమః

“భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం
సుతదుహితృకళత్ర త్రాణభారార్దితానాం |
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతే నరాణాం ||”

సంసారమనే సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి,పుత్రకళత్రాదుల రక్షణభారమని బరువును మోస్తూ, విషయసుఖాలనే నీళ్ళలో మునిగి లేస్తూ,నావ లేకుండా నానా యాతనలకు గురి అవుతున్న నరులకు శ్రీమన్నారాయణుడు అనే నావ ఒక్కటే శరణ్యము.

ఓ మనసా!’భవజలధిగతానాం’ భవ అంటే సంసారం,జలధి అంటే సముద్రం ప్రయాసతో కూడినది,గతానాం అంటే పడుట,సంసారమనే అగాధంలో తెలియక దిగాము,తిరిగి గట్టు ఎక్కుదామని ప్రయత్నిస్తుండగా ‘ ద్వంద్వవాతాహతానాం’శీతలము ఉష్ణములనే అనే సుఖదుఃఖములు అను జంట గాలులు కొట్టడం ప్రారంభంచేశాయి.
మరి వివాహ సమయమున తెలియలేదా అంటావేమో? మేళతాళములు,విందుభోజనములు,బంధుదర్శనములు మొదలైన సంబరములలో పడి ఇందులో ఉన్న లోతులు తెలియలేదు.అలా మొదలైన తరవాత సుఖదుఃఖములనే గాలులు మొదలైతే కూడా గట్టు ఎక్కడానికి శ్రమ అయినా సహించి ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా, నేనే ఎక్కలేకపోతుంటే నామీద మరింత భారము పడింది ‘సుతదుహితృకళత్ర’ భార్యాపుత్రాదులను కాపాడటం అనే భారము తలమీద ఉంచుకోడం వల్ల శ్రమపెరిగి నడవవలసి వచ్చింది. ఆ భారము ఉంచుకుని నిలబడడానికి వీలులేదు.
మునిగితే మాత్రం ఏమిటి అంటావేమో మనసా?
‘గ్రహణ సమయంలో సముద్రస్నానం చేయలేదా అంటే నేను అలాంటి స్థలములో మునగలేదు ఉచితమైన స్థలములలో మునిగితే భయము లేదు,నేను దిగినది పూడుకుపోయే స్థలము.’   
“విషమవిషయతోయే మజ్జతామప్లవానాం” విషకరమైన విషయములు అంటే ఇంద్రియాది సుఖములు అనే వాటిలో మునిగాను. విషయవాంఛ అనేది ఉండకూడదా అంటే ఉండవచ్చు భగవద్విషయములైతే తరించడానికి,అనుభవించడానికి ఇంద్రియములు అనుభవింపబడుటకు విషయములను పరమాత్మ దయచేసి ఉన్నాడు.

“ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యశు బుద్ధి: పర్యవతిష్ఠతే ||”
పై శ్లోకంలో వలె రాగద్వేషములను త్యజించి విషయములను అనుభవించాలి. కానీ నేను అలాంటి విషయములలో మునగలేదు విషతుల్యములైన విషయాల్లో మునిగాను.

“యతతో హ్యాపీ కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాధీవి హరంతి ప్రసభం మనః ||”
ఇంద్రియాలనేవి మంచి విషయాలందు ప్రవేశించే స్వభావము లేదు.అవి లౌకికమైన మనల్ని పాడు చేయు విషయముల యందే పోవును.

మరి ఇలాంటి సంసారమనే అగాధపు సముద్రములో దిగేటప్పుడు ఓడని ఏమైనా సహాయార్ధం చూసుకున్నావా?అంటే,
మనసా!ఈ రీతిలో అల్లాడే నరులందరికి ‘భవతు శరణమేకో విష్ణుపోతే నరాణాం’ విష్ణువు అనే నావ మాత్రమే శరణము. కాబట్టి ఓ మనసా!నువ్వు ఎల్లప్పుడూ ఆ పరమాత్మ యొక్క పాదముల వద్దనే స్మరించుతూ ఉండుము.అప్పుడు నాకు కూడా ఆ నావ లభిస్తుంది. నా యొక్క నిశ్చలమైన భక్తి కలిగిన మనస్సును కనుక అతనికి అర్పిస్తే దానినే కూలీగా తీసుకుని తన దయ చేత మనల్ని తరింపచేస్తాడు. వేరు ఏమి ఆయనకు ఇవ్వలేము ఎందుకంటే నిత్యపరిపూర్ణుడు కేవలము మనస్సును మాత్రమే ఇవ్వగలము.ఇలా సంసారసాగరమున పడి అందులో కలిగే బాధలను అనుభవించే నరులకు పరమాత్మ అయినా శ్రీమహావిష్ణువనే ఓడయే శరణమవుతుంది అంటూ వివరిస్తారు మన కులశేఖరాళ్వార్లు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.