శ్రీమతే రామానుజాయ నమః

“భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం
కధమహమితి చేతో మాస్మగా: కాతరత్వం |
సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా
నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యం ||”

ఓ మనసా! దాటటానికి దుస్సాధ్యమై అగాధమైన ఈ సంసార సాగరాన్ని నేను ఎలా దాటగలను అని కంగారుపడకు. శ్రీహరి పాద పద్మాలమీద స్థిరమైన భక్తిని అలవరచుకుంటే ఆ భక్తి ఒక్కటే నరక యాతనల నుంచి, సంసార సాగరం నుంచి రక్షిస్తుంది.
మనసా! పరమాత్మ పరమ కారుణికుడు కాబట్టే మన ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తన యందు లయం చేసుకోవాలనే తలంపుతోటి ఆ స్వామీ నిన్ను నాకు దయ చేసాడు.మనస్సును సాధనంగా చేసుకుని తరించమని పరమాత్మ యొక్క అభిప్రాయం.

‘ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః || ‘
మనస్సును బంధువుగా చేసుకుని సుఖపడాలి అనే తలంపు తోనే నిన్ను ఆ పరమాత్మ కరుణించెను.కాబట్టి నిన్ను సమర్పిస్తే పరమాత్మ నన్ను సంసారసాగరమును దాటిస్తాడు.

‘భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం’- సంసారసాగరమనే ఈ సముద్రం చాలా గంభీరమైన అగాధం,మనమే దాటగలం అనే యోచన కూడా చేయశక్యం కానిది.
‘కధమహమితి’ ఇలాంటి కష్టతరమైన భవసాగరాన్ని ఎలా దాటుతానో అని
‘చేతః’- మనసా, ‘కాతరత్వం’-పిరికితనాన్ని, ‘మా స్మగా:పొందకు,అధైర్యం చెందకు.
‘సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా ‘ తామరపుష్పముల యొక్క రేకులవలె ఉండే కోటి సూర్య ప్రకాశితమైన నేత్రాల యొక్క దివ్య సౌందర్యమును చూసినా చాలు, అంతేనా చరాచర ప్రపంచానికి జ్ఞానమును ప్రసాదించి మోక్షమనే లీలను ఇవ్వగలిగినవాడు,బ్రహ్మాదిదేవతలకు శరణు ఇచ్చిన వాడు, నరకాంతకుడు,అలాంటి వాడిని శరణు పొందిన తరవాత పాప భీతి ఇక ఉండదు.భక్తి ఒక్కటే చాలు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.