శ్రీమతే రామానుజాయ నమః

“తృష్ణాతోయే మదన పవనోద్ధూతమోహోర్మిమాలే
దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ |
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ ||”  

“ఓ త్రిధాముడా! తృష్ణ అనే ఉదకములు(ఆశ అనే జలములు) కలది,అటువంటి ఆశలు మన్మథుడు అనే గాలిచేత కదులుతూ,సకల మోహములలో పడి,సంసారం అనే ఉచ్చులో పడి ఇందులో దాటే ఉపాయం లేక మునిగిపోతున్న మాకు ఓ వరదా!నీ పాదభక్తి అనే నౌకను మాకు అనుగ్రహించి దరిచేర్చండి. “
భక్తి అనేది కలగడానికి ప్రధానమైనది మనస్సు,అది చంచలమైనది, ఇంద్రియములకు అధిపతి అయినవాడు ‘హృషీకేశుడు’ – హృషీకాణాం ఈశః ఇంద్రియములకు ఈశుడు.శరీరములందు క్షేత్రజ్ఞ (జీవ) రూపమున నుండి ఇంద్రియములను తమ తమ విషయములయందు ప్రవర్తిల్ల జేయువాడు.

“నమో నమోऽనిరుద్ధాయ హృషీకేశేన్ద్రియాత్మనే ।
నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే ॥ “
లేదా ఎవరి ఇంద్రియములు అందరి జీవులకువలె తమ తమ విషయములందు ప్రవర్తించకుండా తన వశము నందుండునో అట్టి పరమాత్ముడు హృషీకేశుడు.

“సూర్య రశ్మిర్హరికేశాః పురస్తాత్ సూర్యుని కిరణము హరికి సంబంధించు కేశమే అను శ్రుతి వచనము “
సూర్య చంద్రులును కేశములుగా (కిరణములు) గల విష్ణువు హృషీకేశుడని చెప్పబడును.
అలాంటి పరమాత్మ యొక్క పాదపద్మములయందు మన భక్తిని సమర్పిస్తే సంసారసాగరమనే ఈ అగాధం నుండి దాటడానికి నావని ప్రసాదిస్తాడు.నావ అంటే తన యొక్క సాన్నిధ్యాన్ని పొందింపచేసే పరమాత్మ అనుగ్రహమే మనకు నావ.

సంసారవృక్ష చ్ఛేదనమునకు భగవంతుడి యందు సంగము,మిగిలినవాటి యందు అసంగము అనే శస్త్రము కావాలంటే అది భగవంతుడే ప్రసాదించాలి అని శరణాగతి చేసినచో భగవంతుడే దానిని కృప చేయును.
ఈ రీతిగా ఆశ మితీరిన పక్షంలో అనర్ధములకు మూలమవుతుంది. ఆ ఆశాజలముల వల్ల గాలి అలలు కలిగి స్వాధీనము తప్పి,మన్మథవికారములు కలుగుతాయి.భార్య అను బంధము వల్ల ఏర్పడ్డ మరిన్ని బంధములు పిల్లలు బంధువులు ఇలా సహజన్ములయొక్క భాధ కలుగుతుంది. అటువంటి బాధను తొలగించుకోడానికి పరమాత్మ యొక్క పాదభక్తి ఒక్కటే శరణ్యము అంటూ మన కులశేఖరాళ్వార్లు ఉపాయమును తెలియజేస్తున్నారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.