శ్రీమతే రామానుజాయ నమః

“జయతు జయతు దేవోదేవకీనందనో యం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః,
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద:”

దేవకీ పుత్రుడగు కన్నయ్యకు మరల మరల జయము కలుగుగాక!వృష్ణివంశమునకు ప్రకాశకుడైన శ్రీకృష్ణ పరమాత్మకు పునః పునః జయశాలి అగుగాక!వర్షాకాలపు మేఘమువలె నల్లనివాడై,కోమలములగు నవయవములు గల శ్రీకృష్ణునకు జయశాలి అగుగాక! భూభారమును పోగొట్టేవాడైన ముకుందుడు ఎల్లపుడు జయించుగాక!

కులశేఖరాళ్వార్లు మహాజ్ఞాని అగుటచేత “శ్రీవల్లభేతి” అను శ్లోకముయొక్క అర్థమును తలచుకుని శ్లోకార్థభూతుడగు భగవంతుని యొక్క కళ్యాణ గుణములను అనుభవించి పరమాత్మకు ఎలాంటి కీడు కలుగుతుందో అని భయపడి వారు క్షేమంగా ఉండాలని కోరి రెండవ శ్లోకం జయతు జయతు అని ప్రారంభించి మనగళాశాశనములు చేశారు.

ఈ రెండవ శ్లోకంలో  “దేవః, దేవకీనందనః,కృష్ణ:, వృష్ణివంశ ప్రదీపః,మేఘశ్యామలః, కోమలాంగ:, పృధ్వీభారనాశ:, ముకుంద:” అనే ఎనిమిది భగవన్నామములను ప్రయోగించి మంగళమగుగాక అని అంటున్నారు.

“దేవః అంటే సృష్టి స్థితి లయములను లీలగా చేసేవాడని అర్ధం.జ్ఞానాన్ని ఇచ్చేవాడని అర్ధం.’దివ్’ ఈ పదానికి 19 అర్ధాలున్నాయి. ఆ వస్తువు నిత్యం శుభంగా ఉండాలి అని అంటారు. ఈ రీతిగా నిత్యవిభూతిని తలుచుకుని పరమాత్మ ఎంతటి మహాత్మ్యం కలవాడని ఆశ్చర్యపడి అంతలో అతని సౌలభ్యం ఇలా అనుభవించారట.నిత్యసూరులు ఎల్లప్పుడూ స్వామికి పుష్ప ధూప దీపాదులను స్వీకరించమని కోరుతుంటే,స్వామీ వాటిని తిరస్కరించి బద్దాత్మలను కాపాడటమే ముఖ్యమని సంకల్పించి లోకమునందు అవతరించాడు.ఎలాంటి పరత్వం ఎలాంటి సౌలభ్యం కలవాడు అని ఆనందిస్తున్నారు కులశేఖరాళ్వార్లు.”

అలాంటి వాడిని కన్న దేవకీదేవి గుర్తుకొచ్చి ‘దేవకీనందనః’అన్నారు. రామాయణమునందు ‘కౌసల్యానందవర్ధనః’ అని రాముని గురించి చెప్పారు.అలాగే మన ఆండాళమ్మవారు ‘తాయైక్కుడల్ విళక్కు శెయ్ ద దామోదరనై’ అనగా తన అవతారంచేత తన తల్లియొక్క గర్భసమానము వేరొక గర్భము కాదని పట్టముకట్టెను. అందరిని బంధమోచనము చేయగల స్వామీ తల్లి పాశముచేత కట్టబడిని అని తెలియజేసెను.ఇలా “దేవః, దేవకీనందనః అనే రెండు నామములచేత పరమాత్మయొక్క పరత్వ సౌలభ్యములను తెలియచేసెను.”  
కృష్ణ: అంటే పరిపూర్ణానంద స్వరూపుడు.అవాప్త సమస్తకాముడు అని కదా అంటారు.
వృష్ణవంశప్రదీపః — తల్లిని సుఖపెట్టడమే కాక వృష్ణివంశమును మొత్తానికి సుఖమును కలిగించాడు. అందుకే మన గోదాదేవి తిరుప్పావైలో “మణివిళక్కై” అని మంగళకరమైన దీపమువంటివాడు అని స్వామియొక్క సంగతిని తెలియజేస్తారు.

“ప్రదీపః – గొప్పదీపము. వృష్ణివంశమునకు స్వామీ గోపదీపమువలె ఉన్నటువంటివాడు.”ఇలా శ్లోకం యొక్క రెండు పాదములలో చెప్పబడినటువంటి పదార్ధం గొప్పదని,దానిని తప్పక ప్రతీ ఒక్కరు అనుభవించవలెనని తెలుస్తున్నది.  

“మేఘశ్యామలః – మేఘమువంటి వర్ణం కలవాడు. ముఘమని చెప్పడంలో స్వామియొక్క అందాన్ని ప్రయోజనాన్ని వివరిస్తున్నారు.మేఘమువల్ల వర్షము,దానివల్ల పంటలుపండి అన్నము వృద్ధి చెంది ప్రజావృధి కలుగును.అలాగే మేఘము తాపాన్ని నివారిస్తుంది.గ్రీష్మకాలంలో తపించేవారికి వర్షాకాలపు మేఘము ఎలా హాయినిచ్చునో శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఆశ్రయం కూడా మనలో ఉండే షడూర్ములనే వాటి తాపాన్ని కృష్ణ మేఘము నివారిస్తుంది.”

“కోమలాంగ: – నీరు లేని మేఘాన్ని ఆశ్రయిస్తే ఫలమేమి? కోమలాంగుడు అనటంలో అర్ధం నీటిని కలిగిఉన్న మేఘమువంటి అందం కలవాడు అని అర్ధం. శ్రీకృష్ణపరమాత్మ అవతరించగానే వసుదేవుడు’తమద్భుతం బాలకం’అని స్వామీ అందాన్ని వర్ణిస్తారు. ‘మణివణ్ణన్’ ఇంద్రనీలమణివంటి తిరుమేని కాంతికలవాడు. ఆధ్యాత్మిక,దైవిక అనే రెండు తాపములను హరించే పురుషమోహనుడు.”ఇలా శ్లోకము యొక్క మూడవ పాదమునందు స్వామీ సౌందర్యం వర్ణించారు.అతడిని ఆశ్రయించవలసిందే కానీ మనం పిలిస్తే వస్తాడా?

“పృధ్వీభారనాశః –
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని పరమాత్మ చెప్పినట్లు
భక్తుల క్షేమార్థమే కదా అయన అవతారాలు ఏర్పడ్డాయి.స్వామికి పరోపకారమే ఘనకార్యము. పృధ్వీభారనాశకుడు కనుక పిలిస్తే వస్తాడు.అడిగిన వరాలను ఇచ్చేవాడు.అతడు ఇచ్చే సుఖములు ఇహలోకంలో ఉపయోగపడతాయి,మోక్షాన్ని కోరుకుంటే అనుగ్రహిస్తాడా? అందుకే “ముకుంద: – అతడు ఇహలోకపు కోరికలే కాదు,మోక్షాన్ని సైతం ఇచ్చే సమర్ధత కలిగినవాడు.” ఇలాంటి పరమాత్మ ఎల్లప్పుడూ సుఖముగా ఉండాలని మనఃపూర్వకముగా కోరుతూ,పరమభోగ్యవస్తువు అయిన పరమాత్మ యందు ప్రీతిచేత కులశేఖరాళ్వార్లు జయతు జయతు అని అనేకసార్లు మనగళాశాశనములు చేశారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్