ముకుందమాల 4వ శ్లోకం
Posted by adminJan 17
శ్రీమతే రామానుజాయ నమః
“నాహం వందే తవ చరణయోర్ద్వంద్వం మద్వంద్వ హేతో:
కుంభిపాకం గురుమపి హరే నారకం నాపనేతుం |
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుమ్
భావే భావే హృదయభవనే భావయేయం భవంతం ||”
ఓ కృష్ణా! ద్వంద్వాతీతమైనస్థితిని అందుకోవాలని కానీ, కుంభీపాకం అనే నరకంలో విధించే శిక్షనుండి తప్పించుకోవాలనో,లావణ్యవతులగు అప్సరసలను స్వర్గములో అనుభవించాలని కానీ, నేను నీ పాదపద్మములకు నమస్కరించడంలేదు.నాకు ఎలాంటి దేహము ఇచ్చిన అభ్యంతరం లేదు.కానీ సర్వదా నా మనస్సులో నిన్నే స్మరించేటట్లు ఉండాలని నీకు నమస్కరిస్తున్నాను.
కులశేఖరాళ్వార్లు పరమాత్మతో ఇలా సంభాషిస్తున్నారు.
కులశేఖరులు: ఆద్వంద్వహేతో స్వామీ!
“త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రై గుణయో భవార్జున” అని గీతలో వివరించినట్లు ప్రకృతిగుణములను,శీతోష్ణాది ద్వంద్వములను తొలగించుకొని జ్ఞానియై మోక్షమును పొందాలని కానీ,’నాహం వందే తవ చరణయోర్ద్వంద్వం’ – నేను నీ పాదయుగళమును సేవించుట లేదు.
స్వామి: మరి నరకభయము కలగకుండా అడుగుతున్నావా?మంచి కోరకుండా ఉన్నా చెడు కలగకూడదని కోరావా?
కులశేఖరులు:’కుంభీపాకం గురుం నారకం’- ఓ హరి! కుంభీపాకం అనే ఘోరనరకమును ఒకవేళ కలిగిన పోగొట్టుకోడం కోసం నిన్ను సేవించట్లేదు.
స్వామి: నరకం కోసం కాదంటున్నావు,మోక్షం కోసం కాదంటున్నావు,ఇవి కానప్పుడు మరేంకావాలి? ఐహిక సౌఖ్యం కంటే ఎక్కువైనా స్వర్గలోక సుఖము కావాలా?
కులశేఖరులు:రమ్యా: ‘మృదుతనులతా: రామాఃనందనే రంతుమపి నాహం వందే’ – స్వర్గలోకములలో ఉండేటువంటి భోగములు,ఉద్యానవనములలో క్రీడించే సుఖముల వంటి వాటికోసం నేను నిన్ను సేవించట్లేదు.
స్వామి: ఐహికాముష్మికములను రెండింటిని వద్దంటున్నావు.ఇంకేమి అడగనంటున్నావు.మరి నీకు కావల్సిందేమిటి?
కులశేఖరులు: ‘భావే భావే హృదయభవనే భావయేయం భవంతం.’ప్రతిజన్మలో కూడా హృదయాకాశమున నిన్ను నిరంతరం ధ్యానించాలి.అలా నిన్ను ధ్యానించుట సుఖము. ఈ దారపుత్రాదులతో కూడిన ఇంటి సుఖాలను కూడా నేను కోరలేదు. శరీరమనే ఈ ఇల్లు కొంతకాలం ఉంటుంది తరవాత పోతుంది.
“మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః |
మనష్షష్టా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||”
“శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్కామతీశ్వరః |
గృహిత్వైతాని సంయాతి వాయుర్గందానివాశయాత్ ||”
అన్నట్లు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు శరీరాన్నివదిలిన తరువాత ఆత్మతోటి ప్రయాణమవుతాయి. ఎలాగైతే ఒక ఇంట్లో నివాసమున్నవాడు ఇల్లుమారేటప్పుపుడు గోడకు ఉన్న మేకులను తీసుకునివెళ్తాడో, అలాగే ఒక శరీరాన్ని విడిచి మరో శరీరానికి వెళ్ళేటప్పుడు ఇంద్రియాదులతో వెళ్తాడు.అలా ఐతే హృదయభవనము వెంట వస్తుంది.తిరిగి ఆ భవనంలో సుఖపడటానికి ఆలోచిస్తాము.అశాశ్వతమైన ఈ ఇంటి సుఖములు నిజంగా కొరతగినవా?అంటే కాదు.ఓ పరమాత్మ!నువ్వు వచ్చి ఆ హృదయమును అలంకరిస్తే అనాదిగా కాపురముంటున్న కామక్రోధాదులు లేచి వెళ్లిపోవును.అందువల్ల నాకు కలిగే జన్మల యందు అన్నింటిలో నీ యొక్క ధ్యానాన్ని మాత్రమే ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను. అంటూ మన కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో జీవుడు తరించడానికి భగవన్నామద్ధ్యానమే పరమోపాయము అని తెలియజేస్తున్నారు..
నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.