శ్రీమతే రామానుజాయ నమః

“నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్ భవ్యం భవతు భగవ పూర్వకర్మానురూపం |
ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్మాన్తరేపి
త్వత్వాదాంభోరుహ యుగగతా నిశ్చలా భక్తిరస్తు ||”

స్వామీ! ధర్మము,నిక్షిప్తధనము మీద నాకు ఆపేక్షలేదు. కామానుభవము మీద ఆశలేదు. పూర్వకర్మానుసారముగా ఏది నాకు కలుగుతుందో అది అంతా నాకు కలుగుగాక. అయినా సరే జన్మజన్మాంతరముల యందు నీ పాదారవిందద్వయమునందు భక్తి సుస్థిరంగా ఉండాలి అదే నాకు కావలసినది.    
దానములు చేయడం ద్వారా ఏర్పడిన ధర్మము వల్ల ఆర్జించిన పుణ్యంచేత కుంభీపాకాది నరకములు తొలగించుకోవాలని కోరికలేదు అంటూ ఈ  శ్లోకంలో కులశేఖరాళ్వార్లు మొదటి పాదంలో “వసుని అనకుండా వసునిచయే అన్నారు” అంటే తనకు ధనము నందు ఆశలేదని చెప్పకుండా ధనరాశియందు ఆశలేదు అని చెప్పారు. ధనరాశి మీద ఆశలేదు అంటే ధనము వద్దని కాదు అర్ధం.శరీరయాత్ర జరగడానికి స్వల్పధనములేనిదే ఎలా?

“నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ద్యే దకర్మణః ||”

“నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్నోతి కిల్బిషమ్ ||”
అంటే శరీర పోషణార్ధమై ధనార్జనకై పాటుపడడం దోషము కాదని చెబుతోంది గీత.ధర్మసాధనము అన్ని చెప్పడంచేత శరీరయాత్రకు సరిపడ ధనము ఆర్జించడం తగినదే.
“ఆశాపాశశతైర్బద్ధా: కామక్రోధపారాయణాః |
ఈహంతే కామభోగార్ధ మాన్యాయేనార్ధ సంచయాన్ ||”
అలాగని ద్రవ్యమునందు అధిక ఆశకలవారు అసుర స్వభావులని చెప్పబడింది.ఇలాంటి కారణాల వల్ల ఆళ్వార్లు ధనమునందు అనకుండా ధనరాశియందు లేదు అని చెప్పారు..

మరి కామోపభోగసుఖములు అనుభవించకూడదా?అంటే  
‘నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే’ కులశేఖరులు ధర్మకామములకు మధ్యలో ధనాన్ని చెప్పడం చేత, ధనసాధనమైన ధర్మమందు,ధనసాధనమైన కామముయందు ఇచ్ఛలేదు అని అర్ధం సూచిస్తోంది. జ్ఞానులైనవారు ఇష్టప్రాప్తిని,అనిష్టనివారణాని కోరుకోరు,సుఖమో దుఃఖమో భగవంతుడే ఇవ్వాలీ అనే అంటారు. శాశించేవాడే ఇవ్వాలి లేదంటే అడిగిన ప్రయోజనం ఉండదు.అనుకు కులశేఖరాళ్వార్లు ఏమి కోరలేదు.
సర్వ శక్తిమంతుడైన పరమాత్మను ఆశ్రయించిన వారు వ్యర్థులుగా అవ్వకూడదు అంటావేమో?
  ఆలా ఐతే నేను కోరేది ఇవ్వండి “మమ బహుమతం జన్మజన్మాన్తరేపి
త్వత్వాదాంభోరుహ యుగగతా నిశ్చలా భక్తిరస్తు” భగవంతుడిని ఆశ్రయించి ఏదైనా కోరుకుంటే అది ఎలా ఉండాలంటే అన్ని ఫలాలకి సరిపోయేదిలా ఉండాలి.కాబట్టి ఏ జన్మ ఇచ్చినా కూడా నీ పాదపద్మములయందు మాత్రం నిశ్చలమైన భక్తి నాకు ఎల్లప్పుడూ ఉండేలా కటాక్షించుము చాలు.ఏమి కోరుకోని యెడల “అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే” అన్నట్లే యోగక్షేమములు పరమాత్మ తలమీద పడతాయి అని కులశేఖరాళ్వార్లు తెలియజేస్తున్నారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.