శ్రీమతే రామానుజాయ నమః

“దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామం |
అవధీరిత శారదారవిందౌ
చరణౌ తే మరణేపి చింతయామి ||”

నరకాసురుడిని సంహరించినవాడా! అని కీర్తిస్తూ నిన్నటి శ్లోకంలో వీటి యందు ఫలాపేక్షలేదని తెలియజేసారు. ఈ శ్లోకంలో స్వర్గమందుకాని,భూమియందుకాని,చివరకు నరకమందు నివాసము వచ్చిన చింతలేదు.శరత్కాల కమలములు తిరస్కరించునట్టి నీ యొక్క దివ్య పాదములనే మరణకాలమునందు కూడా స్మరించాలని అంటున్నారు మన కులశేఖరాళ్వార్లు.

క్రిందటి శ్లోకంలో ధర్మార్ధకామములను కూడా వద్దన్నారు కదా? మరి ధర్మము చేయకపోతే స్వర్గాదులు లభించవు,అప్పుడు భూమిమీదనే నివాసం కలుగుతుంది,అలాగే ధనలోపం వల్ల చేసే పాపాల వలన నరకవాసము కలుగుతుంది కదా? అనే ప్రశ్నలకు సమాధానంగా ఆళ్వార్లు ఇలా చెప్పారు “దివి వా భువి వా మమాస్తు వాసో” నాకు ఈ లోకమా,ఆ లోకమా అనే వ్యవస్థ ఉంటే కదా?అన్ని ప్రదేశాలు సమానమే పరమాత్మ దివ్యచరణారవింద ద్వయమే పరమ పావన ప్రదేశము.
నరకాదుల గురించి నాకు చింత లేదు స్వామీ!ఎందుకు అంటావేమో?
‘నరకే వా నరకాంతక ప్రకామం’ బ్రహ్మాదులు ప్రార్ధించారు అని రావణుని చంపావు.ఇంద్రాదులు ప్రార్ధించారని నరకాసురిడిని సంహరించావు. ఆ సంగతులన్నీ నాకు ముఖ్యంకావు. నేను జీవాత్మను,హీనుడను,ఏ స్థలంలో వసించిన అందువల్ల నాకు గౌరవం,అగౌరవం అనేవి పెరగవు తగ్గవు.నేను అధమాదముడిని.నిన్నే నమ్మి జీవించేవాడిని కనుక నేను నరకంలో పడితే నరకనాశకుడు అని బిరుదు కలిగిన నువ్వు సహించలేవు. కాబట్టి నా గురించి చింత నీకు తప్ప నాకు లేదు అని ఆళ్వార్ల అర్ధం.

‘ఆళవందార్లు  తమ స్తోత్రరత్నంలో చాలా అందంగా సత్ ని వివరిస్తారు.
“అభూతపూర్వం మమ భావి కిం వా
సర్వం సహే మే సహజం హి దుఃఖం |
కింతు త్వదగ్రే శరణాగతానాం
పరాభవో నాథ న తే నురూపః ||”
నాథా! నేను గతంలో అనేక హీనజన్మలు పొంది ఉన్నాను.నాకు కొత్తకాదు సహజమే.అనన్యభావముతో తెలుస్తున్న నన్ను రక్షింపకపోతే శరణాగత వత్సలుడు,దీనబంధుడు,పరమదయాళుడు అనే నీ పేర్లకు కళంకం వస్తుందేమో అని దుఃఖిస్తున్నాను.అంతేకాని నన్ను రక్షించమని కోరడంలేదు అంటారు.
‘పరమాత్మే రక్షకుడు అని నిశ్చల భక్తిశ్రద్దలతో భజిస్తే ఆ భక్తులు యమదూతలు చూడరు,కలలోనైనా చూడరు అని భాగవతం తెలియచేస్తోంది.’
శ్రీమన్నారాయణుడి దివ్య చరణములే రక్షకము,వాటిని వర్ణించే శక్తి నాకు లేదంటూ,
“అవధీరిత శరదారవిందౌ” అని స్వామి పాదముయొక్క కార్యము తెలుపుతున్నారు.
శారద – అనేక సంవత్సరములుగా ఉండే,అ – అధికమైన,రవిందం – అంధకారమును, అవధీరిత – పోగొడతాయి. అందువల్లనే నీ దివ్య పాదముల చింతను అడుగుతున్నాను. స్వామి!నీ వ్రేలి నఖమే కోటిసూర్యోదయ ప్రకాశముగా ఉండును. ఇంక రెండు పాదాల పదినఖముల కాంతి చేరితే ఎలాంటి అజ్ఞానాంధకారమైన పోవలసిందే. అలాంటి సదాధ్యానమును కలిగించుము,లేదంటే కనీసం మరణకాలమునందైన కలిగించండి చాలు. ‘అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం’ అని గీతలో తెలియజేసినట్లు అంతిమస్మరణ యందు ఐన పాద ద్వయాన్ని స్మరించమని, ఆళ్వార్లు స్వామీ పాదారవిందంలో దాగి ఉన్న అమృతాన్ని అనుభవింపచేస్తున్నారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.