శ్రీమతే రామానుజాయ నమః


“కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్యైవ మే విశతు మానస రాజహంసః |
ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తై:
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే ||”

ఓ కృష్ణా! నీ పాదకమలం అనే గూటి మధ్యమున నామనస్సు అనే రాజహంసను ఇప్పుడే ప్రవేశించనిమ్ము.
ప్రాణప్రయాణ సమయం నందు కఫవాతపిత్తములు ఏర్పడితే నిన్ను స్మరించునో లేదో?.
మరణకాలము నందు స్మరణ కలగటం అనేది మిక్కిలి నాజూకైన కాలం కనుక మన ప్రయత్నం చేత కలగదు పరమాత్మ అనుగ్రహం ఉంటే తప్ప.కాబట్టి శరీరావస్థ బాగునప్పుడే నీ యొక్క స్మరణ నాకు నిరంతరం కలిగించండి అని ప్రార్ధిస్తూ.ఆళ్వార్ల యొక్క మనస్సును అసాధారణంగా కనిపించే హంసతో పోల్చడానికి గల కారణం ఏమిటి?అంటే.
ఏ చిలుకో ఇంకో పక్షి తినకూడదా అంటే,తదితరమైన పక్షులు రజోతమోగుణములను కలిగి ఉంటాయి.హంస సాత్వికగుణము కలిగినది,శుద్ధశ్వేతవర్ణం కలది. కాబట్టి నా మనస్సనెడు రాజహంస నీ పాదములనే పంజరమున ప్రవేశించేలా చేయుము అంటే నా మనస్సు రాగద్వేషములను విడిచి శుద్దసాత్వికమైన నీ చరణములను ఆశ్రయించేలా చేయండి అని ప్రార్ధించారు.
నా మనోహంస వెళ్లకూడని వైపులకు వెళుతోంది కాబట్టి ఈనాడే నీ అనుగ్రహంచేత నీ పాదద్వయం మధ్య బందించుము. నది ప్రయాణంలో దిగడానికి రేవు ఎలా ఐతే కావాలో,శేషభూతుడైన ఆత్మ స్వామివద్ద చేరడానికి వారి దివ్యపాదములే రేవుగా ఉన్నాయి. అలా మరణకాలం అందు నీయొక్క స్మరణ చేయడానికి గొంతు సహకరిస్తుందో లేదో కాబట్టి ఇప్పటినుండే ప్రధమసోపానం అయినా నీ చరణారవిందాన్ని స్మరిస్తే ఆ సమయాన నీ అనుగ్రహంచేత కలుగును. ఇదే విషయాన్ని

పెరియాళ్వార్ తిరుమొళి లో “తుప్పుడయారై” అనే పాశురం లో ‘అప్పోదు కిప్పోదే శోల్లివైత్తేన్’ అంటూ మరణకాల సమయం అప్పటి గురించి ఇప్పుడే చెబుతున్నాను అని అంటారు. “తస్మాత్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్య చ” అన్నట్లు కులశేఖరాళ్వార్లు శరీరము దృఢముగా ఉన్నప్పుడే పరమాత్మ స్మరణ చేయమని హెచ్చరిస్తున్నారు.అంత్యకాలమున ఏర్పడే పరిస్థితులు పరమాత్మ యందు మనస్సు ఉండునో లేదో అని ఇప్పట్టి నుండే ప్రార్ధించమని తేలుతున్నారు మన ఆళ్వార్లు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్