శ్రీమతే రామానుజాయ నమః


“కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే
శ్రమముషి భుజవీచివ్యాకులే గాధమార్గే |
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్న: ఖేదమద్యత్యజామి ||”

సంసారమనే ఈ ఎడారిలో ప్రయాణం చేసి చేసి అలిసిపోయి,ఈరోజు హరి అనే సరస్సు చేరాను.ఎంత సుందరమూ ఈ సరస్సు!ఆ హరి కరచరణములే మిలమిలాడుతున్న చేపలు.భుజములే అందు కదలాడే కెరటములు.అన్నింటి శ్రమలు హరించగలిగే సరస్సు. ఆ రేవులు అవగాహనము చేయడానికి అనుకూలంగా లోటు కలదై ఉంటుంది.అటువంటి హరి సరస్సులోకి ప్రవేశించి తేజస్సు అనే జలాన్ని తాగి నా బడాలికను తీర్చుకుంటున్నాను అని కులశేఖరాళ్వార్లు కీర్తించారు.
ఓ స్వామీ!నా పరిస్థితి ఎడారిలో చుక్క నీరులేని చోట మొలిచిన చెట్లు ఎలా వాడి మోడు అయిపోవునో అట్లున్నది.
నేను ఉండే స్థలం ఎటువంటిది అని అడుగుతావేమో?’సుఖము లవలేశమైనను లేకుండా,కష్టాలకు కొలిమి అయినటువంటి సంసారం అనే స్థలంలో ఉన్నాను.దీనిలో అత్యంత శ్రమపడి తపించిపోతున్నాను.’కాబట్టి ఎడారిలో దాహంతో తపించిపోతున్నవాడికి అదృష్టం కొలది ఒక సరస్సు కనపడితే తనయొక్క శ్రమను ఉపశమనం పొందకుండా వదులుతాడా!అలాగే ఈ సంసారమనే ఈ స్థలంలో ఏంటో అలిసిపోయిన నాకు “హరి” అనే సరస్సు కనపడింది.నేను మునగదలుచుకున్న సరస్సు నీవే స్వామీ!

ఈ సరస్సులో తామరలు ఉంటాయా?అంటే ని యొక్క దివ్య కరచరణములే సరోజములు.
చేపలుండునా?అంటే ‘కాంతిమన్నేత్రమీనే’ దివ్యమైన కాంతితో కదలాడే నీయొక్క నేత్రాలే మీనములవంటివి.
ఇతరమైన సరస్సులో మునగడం వల్ల తాత్కాలికంగా తాపము తీరుతుంది.కానీ హరి సరస్సు అటువంటిది కాదు ‘శ్రమముషి’ ఒక్కసారి మునిగిన సకలసాంసారిక దుఃఖములుగా కలిగిన తాపము క్షణంలో మటుమాయమవుతాయి.
సాధారణమైన సరస్సులకు పరిమాణముంటుంది ప్రయత్నంచేస్తే లోతుని తెలుసుకోవచ్చును.
‘హరి’అనే ఈ సరస్సుకు ముగింపు తెలియదు.పరమప్రామాణికమైన వేదం కూడా పరమాత్మలో ఉండే కళ్యాణ గుణములలో ఒకటైన ఆనందం  అనేది లోతు ఎంత ఉన్నది అని చెప్పడానికి ప్రయత్నం చేసి కొంత వరకు చెప్పి ఇక చెప్పలేక కనీసం ఉహించడానికి కూడా సాధ్యంకాదు అని  “‘యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా”” అంటూ అవాంగ్మనసగోచరము అని వెనుతిరిగింది.అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణగుణములనే “తేజోజలౌఘం” తేజోజలములు కలిగిన సరస్సులో తెలిసిపడినా తెలియకపడినా తరిస్తాము.

“ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి: పర్యవతిష్ఠతి ||”అని గీతలో తెలిపినట్లు

ఆ జలములు త్రాగిన తరవాత సంసారమనే ఈ స్థలమును నుండి విముక్తి పొంది నిత్యముక్తులతో కూడి పరమాత్మ ఆనందమును ఆనందించవచ్చు. అంటూ కులశేఖరాళ్వార్లు “ఖేదమద్యత్యజామి” ఇప్పుడే ఈ సంసారంలో పొందిన బడలికను పరమాత్మ యొక్క దివ్యమైన గుణములను గానం చేస్తూ దాని ద్వారా తాపాన్ని పోగొట్టుకుంటున్నాను అని పరమాత్మ గుణవైభవాన్ని గుర్తించి మనందరం తరించాలని ఆళ్వార్ల ఉద్దేశ్యము.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్