వాల్మీకి రామాయణం 59 వ భాగం, అయోధ్య కాండ
కోశాధికారిని పిలిచి తన దెగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు, తన వస్త్రములని, ఆభరణములని వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు. గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. అప్పటివరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళని గట్టిగా పట్టుకొని ” నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేను అన్నయ్య, ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో, వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు. నువ్వు కాని నన్ను తీసుకెళితే, మీ ఇద్దరూ హాయిగా సరోవరాల్లో, పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే, నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను, ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరూ అవి తింటూ ఉంటె నాకు పరమ ఆనందంగా ఉంటుంది ” అన్నాడు.
అప్పుడు రాముడు ” నిన్ను కూడా తీసుకెళితే కౌసల్యని, సుమిత్రని, కైకేయని ఎవరు చూసుకుంటారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు ” అన్నాడు.
” నేను కౌసల్యని, సుమిత్రని చూడడమేమిటి అన్నయ్యా, కౌసల్యకి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళని లక్ష మందిని ఆవిడ పోషించగలదు. ఇంక నాకు ఇలాంటి సాకులు చెప్పద్దు, నేను సమాధానం చెప్పలేను. వచ్చెయ్ లక్ష్మణా, అని ఒక్క మాట అను, నేను గబగబా వచ్చేస్తాను ” అన్నాడు లక్ష్మణుడు.
నీలాంటి వాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని, లక్ష్మణుడిని రాముడు వచ్చెయ్యమన్నాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి, తన వస్తువులని కూడా దానం చేశాడు. అలా సీతారామలక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసమని ఆయన అంతఃపురానికి బయలుదేరారు.