వాల్మీకి రామాయణం 212 వ భాగం, కిష్కిందకాండ
తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, ఆయనకి నమస్కరించి ” మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, 100 శిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి, సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతం ఉంది, అది 100 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. దానిమీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనాల ఎత్తయిన వజ్ర పర్వతం కనపడుతుంది. సముద్రంలో నాలుగోవంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు, అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.
అక్కడినుంచి ముందుకి వెళితే మీకు ప్రాక్ జ్యోతిషపురం అనే ప్రాంత కనపడుతుంది, దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తరువాత సర్వ సౌవర్ణ అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అదికూడా దాటిపోతే మేఘనం అనే పర్వతం కనపడుతుంది, ఈ పర్వతం మీదనే ఇంద్రుడు పాకశాసనుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ తరువాత 60,000 బంగారు పర్వతాలు కనపడతాయి, వాటి మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఏ వస్తువైనా బంగారంలా మెరిసిపోతుంది. ఈ మేరు పర్వతం నుండి అస్తమయ పర్వతం 10,000 యోజనాల దూరంలో ఉంది, ఇంత దూరాన్ని సూర్య భగవానుడు అర ముహూర్తంలో దాటి వెళ్ళిపోతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడ్డ భవనంలో పాశము పట్టుకొని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడినుంచి ముందుకి వెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరు సావర్ణి అనే మహర్షి కనపడతారు, ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. ఇక అక్కడినుండి ముందుకి వెళ్ళడం కష్టం. కావున మీరందరూ అక్కడిదాకా వెతికి రండి ” అన్నాడు.