వాల్మీకి రామాయణం 243 వ భాగం, సుందరకాండ
అప్పుడాయన అనుకున్నాడు ” ఇంత లంకా పట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండ నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రము లేని స్త్రీలని ఎందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను, అందువలన నాయందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మని, ఆమె ఒక స్త్రి. అందువలన ఆమెని వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కాని, నా మనసునందు ఎటువంటి వికారము కలగలేదు, నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రముగానే ఉన్నాను ” అని హనుమంతుడు తన మనస్సులో భావన చేసి, ” నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను ‘ సీతమ్మ దర్శనం చేశావా? ‘ అని అడుగుతారు. ‘ నాకు సీతమ్మ జాడ తెలియలేదు ‘ అని చెప్తాను. సీతమ్మ జాడ తెలీకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే, మిత్రుడైన రాముడికి సహాయం చెయ్యలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణము వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానరకాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరు మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకి చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు, తరవాత అయోధ్యలొ అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వల్ల ఇంత మంది మరణిస్తారు. ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత వెళ్ళకపోతె ఎంత.
బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు, ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది, కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరడంలేదని, రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసుంటాడు, కాదు కాదు, కాముకుడైనవాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతె రాక్షసులు సీతమ్మని తినేసుంటారు, కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి పది తలలు గిల్లేసి, వాడి మృతకళేబరాన్ని రాముడి పాదాల దెగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెల్లఘించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు, అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను ” అనుకున్నాడు.
కాని ఆయన వెంటనే ” ఛి! మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహా పాపం. మళ్ళి ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను ” అనుకొని,
నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, |
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ||
(దీనిని రామాయణానికి ప్రార్ధనా శ్లోకంగా చెబుతారు)
” లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరు కాటాక్షించెదరుగాక ” అని నమస్కారం చేశాడు.