Archive for the ‘ ముకుందమాల ’ Category

శ్రీమతే రామానుజాయ నమః

“తృష్ణాతోయే మదన పవనోద్ధూతమోహోర్మిమాలే
దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ |
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ ||”  

“ఓ త్రిధాముడా! తృష్ణ అనే ఉదకములు(ఆశ అనే జలములు) కలది,అటువంటి ఆశలు మన్మథుడు అనే గాలిచేత కదులుతూ,సకల మోహములలో పడి,సంసారం అనే ఉచ్చులో పడి ఇందులో దాటే ఉపాయం లేక మునిగిపోతున్న మాకు ఓ వరదా!నీ పాదభక్తి అనే నౌకను మాకు అనుగ్రహించి దరిచేర్చండి. “
భక్తి అనేది కలగడానికి ప్రధానమైనది మనస్సు,అది చంచలమైనది, ఇంద్రియములకు అధిపతి అయినవాడు ‘హృషీకేశుడు’ – హృషీకాణాం ఈశః ఇంద్రియములకు ఈశుడు.శరీరములందు క్షేత్రజ్ఞ (జీవ) రూపమున నుండి ఇంద్రియములను తమ తమ విషయములయందు ప్రవర్తిల్ల జేయువాడు.

“నమో నమోऽనిరుద్ధాయ హృషీకేశేన్ద్రియాత్మనే ।
నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే ॥ “
లేదా ఎవరి ఇంద్రియములు అందరి జీవులకువలె తమ తమ విషయములందు ప్రవర్తించకుండా తన వశము నందుండునో అట్టి పరమాత్ముడు హృషీకేశుడు.

“సూర్య రశ్మిర్హరికేశాః పురస్తాత్ సూర్యుని కిరణము హరికి సంబంధించు కేశమే అను శ్రుతి వచనము “
సూర్య చంద్రులును కేశములుగా (కిరణములు) గల విష్ణువు హృషీకేశుడని చెప్పబడును.
అలాంటి పరమాత్మ యొక్క పాదపద్మములయందు మన భక్తిని సమర్పిస్తే సంసారసాగరమనే ఈ అగాధం నుండి దాటడానికి నావని ప్రసాదిస్తాడు.నావ అంటే తన యొక్క సాన్నిధ్యాన్ని పొందింపచేసే పరమాత్మ అనుగ్రహమే మనకు నావ.

సంసారవృక్ష చ్ఛేదనమునకు భగవంతుడి యందు సంగము,మిగిలినవాటి యందు అసంగము అనే శస్త్రము కావాలంటే అది భగవంతుడే ప్రసాదించాలి అని శరణాగతి చేసినచో భగవంతుడే దానిని కృప చేయును.
ఈ రీతిగా ఆశ మితీరిన పక్షంలో అనర్ధములకు మూలమవుతుంది. ఆ ఆశాజలముల వల్ల గాలి అలలు కలిగి స్వాధీనము తప్పి,మన్మథవికారములు కలుగుతాయి.భార్య అను బంధము వల్ల ఏర్పడ్డ మరిన్ని బంధములు పిల్లలు బంధువులు ఇలా సహజన్ములయొక్క భాధ కలుగుతుంది. అటువంటి బాధను తొలగించుకోడానికి పరమాత్మ యొక్క పాదభక్తి ఒక్కటే శరణ్యము అంటూ మన కులశేఖరాళ్వార్లు ఉపాయమును తెలియజేస్తున్నారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.

 

శ్రీమతే రామానుజాయ నమః

“భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం
కధమహమితి చేతో మాస్మగా: కాతరత్వం |
సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా
నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యం ||”

ఓ మనసా! దాటటానికి దుస్సాధ్యమై అగాధమైన ఈ సంసార సాగరాన్ని నేను ఎలా దాటగలను అని కంగారుపడకు. శ్రీహరి పాద పద్మాలమీద స్థిరమైన భక్తిని అలవరచుకుంటే ఆ భక్తి ఒక్కటే నరక యాతనల నుంచి, సంసార సాగరం నుంచి రక్షిస్తుంది.
మనసా! పరమాత్మ పరమ కారుణికుడు కాబట్టే మన ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తన యందు లయం చేసుకోవాలనే తలంపుతోటి ఆ స్వామీ నిన్ను నాకు దయ చేసాడు.మనస్సును సాధనంగా చేసుకుని తరించమని పరమాత్మ యొక్క అభిప్రాయం.

‘ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః || ‘
మనస్సును బంధువుగా చేసుకుని సుఖపడాలి అనే తలంపు తోనే నిన్ను ఆ పరమాత్మ కరుణించెను.కాబట్టి నిన్ను సమర్పిస్తే పరమాత్మ నన్ను సంసారసాగరమును దాటిస్తాడు.

‘భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం’- సంసారసాగరమనే ఈ సముద్రం చాలా గంభీరమైన అగాధం,మనమే దాటగలం అనే యోచన కూడా చేయశక్యం కానిది.
‘కధమహమితి’ ఇలాంటి కష్టతరమైన భవసాగరాన్ని ఎలా దాటుతానో అని
‘చేతః’- మనసా, ‘కాతరత్వం’-పిరికితనాన్ని, ‘మా స్మగా:పొందకు,అధైర్యం చెందకు.
‘సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా ‘ తామరపుష్పముల యొక్క రేకులవలె ఉండే కోటి సూర్య ప్రకాశితమైన నేత్రాల యొక్క దివ్య సౌందర్యమును చూసినా చాలు, అంతేనా చరాచర ప్రపంచానికి జ్ఞానమును ప్రసాదించి మోక్షమనే లీలను ఇవ్వగలిగినవాడు,బ్రహ్మాదిదేవతలకు శరణు ఇచ్చిన వాడు, నరకాంతకుడు,అలాంటి వాడిని శరణు పొందిన తరవాత పాప భీతి ఇక ఉండదు.భక్తి ఒక్కటే చాలు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.

శ్రీమతే రామానుజాయ నమః

“భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం
సుతదుహితృకళత్ర త్రాణభారార్దితానాం |
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతే నరాణాం ||”

సంసారమనే సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి,పుత్రకళత్రాదుల రక్షణభారమని బరువును మోస్తూ, విషయసుఖాలనే నీళ్ళలో మునిగి లేస్తూ,నావ లేకుండా నానా యాతనలకు గురి అవుతున్న నరులకు శ్రీమన్నారాయణుడు అనే నావ ఒక్కటే శరణ్యము.

ఓ మనసా!’భవజలధిగతానాం’ భవ అంటే సంసారం,జలధి అంటే సముద్రం ప్రయాసతో కూడినది,గతానాం అంటే పడుట,సంసారమనే అగాధంలో తెలియక దిగాము,తిరిగి గట్టు ఎక్కుదామని ప్రయత్నిస్తుండగా ‘ ద్వంద్వవాతాహతానాం’శీతలము ఉష్ణములనే అనే సుఖదుఃఖములు అను జంట గాలులు కొట్టడం ప్రారంభంచేశాయి.
మరి వివాహ సమయమున తెలియలేదా అంటావేమో? మేళతాళములు,విందుభోజనములు,బంధుదర్శనములు మొదలైన సంబరములలో పడి ఇందులో ఉన్న లోతులు తెలియలేదు.అలా మొదలైన తరవాత సుఖదుఃఖములనే గాలులు మొదలైతే కూడా గట్టు ఎక్కడానికి శ్రమ అయినా సహించి ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా, నేనే ఎక్కలేకపోతుంటే నామీద మరింత భారము పడింది ‘సుతదుహితృకళత్ర’ భార్యాపుత్రాదులను కాపాడటం అనే భారము తలమీద ఉంచుకోడం వల్ల శ్రమపెరిగి నడవవలసి వచ్చింది. ఆ భారము ఉంచుకుని నిలబడడానికి వీలులేదు.
మునిగితే మాత్రం ఏమిటి అంటావేమో మనసా?
‘గ్రహణ సమయంలో సముద్రస్నానం చేయలేదా అంటే నేను అలాంటి స్థలములో మునగలేదు ఉచితమైన స్థలములలో మునిగితే భయము లేదు,నేను దిగినది పూడుకుపోయే స్థలము.’   
“విషమవిషయతోయే మజ్జతామప్లవానాం” విషకరమైన విషయములు అంటే ఇంద్రియాది సుఖములు అనే వాటిలో మునిగాను. విషయవాంఛ అనేది ఉండకూడదా అంటే ఉండవచ్చు భగవద్విషయములైతే తరించడానికి,అనుభవించడానికి ఇంద్రియములు అనుభవింపబడుటకు విషయములను పరమాత్మ దయచేసి ఉన్నాడు.

“ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యశు బుద్ధి: పర్యవతిష్ఠతే ||”
పై శ్లోకంలో వలె రాగద్వేషములను త్యజించి విషయములను అనుభవించాలి. కానీ నేను అలాంటి విషయములలో మునగలేదు విషతుల్యములైన విషయాల్లో మునిగాను.

“యతతో హ్యాపీ కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాధీవి హరంతి ప్రసభం మనః ||”
ఇంద్రియాలనేవి మంచి విషయాలందు ప్రవేశించే స్వభావము లేదు.అవి లౌకికమైన మనల్ని పాడు చేయు విషయముల యందే పోవును.

మరి ఇలాంటి సంసారమనే అగాధపు సముద్రములో దిగేటప్పుడు ఓడని ఏమైనా సహాయార్ధం చూసుకున్నావా?అంటే,
మనసా!ఈ రీతిలో అల్లాడే నరులందరికి ‘భవతు శరణమేకో విష్ణుపోతే నరాణాం’ విష్ణువు అనే నావ మాత్రమే శరణము. కాబట్టి ఓ మనసా!నువ్వు ఎల్లప్పుడూ ఆ పరమాత్మ యొక్క పాదముల వద్దనే స్మరించుతూ ఉండుము.అప్పుడు నాకు కూడా ఆ నావ లభిస్తుంది. నా యొక్క నిశ్చలమైన భక్తి కలిగిన మనస్సును కనుక అతనికి అర్పిస్తే దానినే కూలీగా తీసుకుని తన దయ చేత మనల్ని తరింపచేస్తాడు. వేరు ఏమి ఆయనకు ఇవ్వలేము ఎందుకంటే నిత్యపరిపూర్ణుడు కేవలము మనస్సును మాత్రమే ఇవ్వగలము.ఇలా సంసారసాగరమున పడి అందులో కలిగే బాధలను అనుభవించే నరులకు పరమాత్మ అయినా శ్రీమహావిష్ణువనే ఓడయే శరణమవుతుంది అంటూ వివరిస్తారు మన కులశేఖరాళ్వార్లు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.

 

శ్రీమతే రామానుజాయ నమః

“మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః
నామీ నః ప్రభవంతి పాపరిపవః స్వామీ నను శ్రీధరః |
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః ||”

ఓ మందమనసా! యమయాతనలను పలురకాలుగా భావించి భయపడకు,ఆ శత్రువులు మనల్ని ఏమి చెయ్యలేరు.శ్రీధరుడు కదా మనకు స్వామీ! భక్తసులభుడు అగు శ్రీమన్నారాయణుడిని ఆలస్యము చేయకుండా ధ్యానించుము.లోకములో ఉండే సమస్త వ్యసనములను పోగొట్టువాడు దాసుడిని సరిదిద్దలేడా?
“కులశేఖరాళ్వార్లు నిరంతరం పరమాత్మను స్మరించమని వారి దివ్య పాదముల వద్దు వదులుతున్నాను అని అక్కడ రక్షణ,సౌఖ్యము అన్ని కలుగుతాయని చెప్పగా  మనస్సుకు కొంత ధైర్యం కలిగింది కానీ సంపూర్ణ నమ్మకం కలగలేదు.”

అలా చేరిన మనస్సుకు కలిగిన భయములేంటంటే’బహుధా యామీశ్చిరం యాతనాః’ ఓ కులశేఖరా నేను దుష్టుడను,నన్ను నమ్మితే నువ్వు కుంభీపాకం అనే దాని పడతావు,చెడిపోయిన నాకు సుఖము లేదు,అంతేకాక నన్ను నమ్మిన నిన్ను నరకం లో పడేస్తే నీతో పాటు నేను రావలసిందే అంటూ భయము కలుగుతోందట.
కులశేఖరాళ్వార్లు ‘మాభీర్మందమనో విచింత్య’ కొంచెము కూడా జ్ఞానం లేని మనసా! నువ్వు అవన్నీ తలుచుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయకు,అసలు నాకు నరకం అనేది వస్తే కదా నువ్వు నాతో నరకానికి వచ్చేది. నేను వెళ్లే స్థలము అత్యంత ఆనందదాయకమైనది కాబట్టి నువ్వు కూడా సుఖపడతావు. నేను చెప్పేది ని హితముకై అని భావించవచ్చు కదా! నిన్ను వెళ్ళమంటున్నది నీవు జన్మించిన స్థానముకే నిన్ను నియమించిన పరమాత్మ అయినా ప్రభువు వద్దకే కదా!. దేని మీద ని అనుమానము?
‘నామీ నః ప్రభవంతి పాపరిపవః’ పాపములు అనే శత్రువులు నేను హరి స్మరణలో ఉంటే మల్లి నన్ను మార్చి నరకములో పడేయడానికి(కామక్రోధలోభమోహమదమాశ్చర్యాలు అనే శత్రువులు) ప్రయత్నిస్తారు,నన్ను అలా తిరిగి లౌకిక వాంఛలవైపు ఈడుస్తే ఎలా?
ఓ అదా నీ భయం ‘స్వామీ నను శ్రీధరః’ – మనసా! మన వెంట ఉన్నవాడు సామాన్యమైన వాడనుకుంటున్నావేమో! శ్రీధరుడు మన అందరికి తల్లి అయినా అలాగే మన పాపములను దాచి మనల్ని మార్చి పురుషకారం వహించే లక్ష్మి దేవిని తన యొక్క వక్షస్థలములో కలిగినటువంటి పరమాత్మ,కాబట్టి అక్కడ అంటా సుఖమే ఉందును భయములకు తావులేదు.
పరమాత్మకు మనము ఏమి ఇవ్వాలని అంటావేమో ‘ఎప్పుడైనా పెద్దల వద్దకు వెళ్తుంటే వట్టి చేతులతో వెళ్ళకూడదు అనే నియామయున్నది అలా అని ఏదిపడితే అదికాకుండా వారికి ప్రియమైనది ఇస్తే వారు అనుగ్రహం మనయందు ఉంటుంది. మరి పరమాత్మకు ప్రీతి కలిగేది ఏముంటుంది అంటే మన యొక్క నిస్వార్థమైన భక్తి దాని ఇస్తే చాలుట పరమ ప్రీతితో దగ్గరకు తీసుకుంటాడు’.

“ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం” ఇంకా ఆలస్యం చేయకుండా ఇతరమైన విషయములను విడిచి పరమాత్మ యొక్క గుణములను స్మరించు చక్కటి జ్ఞానం కలుగుతుంది.
మనము ఇతరములను త్యజిస్తే మనము వెళ్లనవసరము కూడా లేకుండా ఆయననే మన హృదయాంతరముల యందు ప్రవేశించి వసించును.భక్తులకు ఎలాంటి శ్రమలు కలిగించడానికి ఇష్టపడడు అతడే శ్రీమన్నారాయణుడు. అంతటా వ్యాపించి,వహించి,ప్రకాశింపచేయువాడు కాబటి నారాయణుడు.

“గామావిశ్య చ భూతాని ధారయా మ్యహమోజసా |
పుష్ణామి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వారసాత్మకః ||” అన్నట్లు పురుషోత్తముడు ఆయనే.
అటువంటి పరమాత్మా వద్ద  ‘లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః ‘ మేము నీ దాసుడిని అని వారి దివ్యపాదములపై పడితే చాలు ఏమి చూడకుండా కాపాడడానికి సిద్ధముగా ఉండేవాడు.అంటూ కులశేఖరాళ్వార్లు మనస్సును సిద్దము చేసుకోవలసిన రీతిని చెబుతూనే నెపంగా ఉంచి పరమాత్మ యొక్క వాత్సల్య గుణాలను ప్రకాశింపచేస్తున్నారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్

శ్రీమతే రామానుజయ నమః

“సరసిజనయనే సశంఖచక్రే
మురభిది మా విరమస్వ చిత్తరంతుం |
సుఖతరమపరం న జాతు జానే
హరిచరణ స్మరణామృతేన తుల్యం ||”

ఓ మనస్సా! శ్వేత తామరలలాంటి నయనాలు కలిగి శంఖ చక్రాలను ధరించి దివ్య మంగళ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు. ఎప్పటికీ ఆయన స్మరణ మానవద్దు. శ్రీహరి పాదపద్మాలను స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు కదా!
అంతిమస్మరణ కలగడానికి నిరంతరం పరమాత్మనే తలవమని కులశేఖరాళ్వార్లకు చెప్పగా “చింతయామి హరిమేవ సంతతం – హరినే సదా తలుస్తాను”అని 8వ శ్లోకంలో చెప్పారు.
ధ్యానం అనేది మనస్సుచేత చేయవలసిన కార్యం శరీరముతో చేయతగినదికాదు.
“తత్త్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేఇంద్రియక్రియః” ఇత్యాది గీతా శ్లోకముల ద్వారా మనస్సును మెల్లగా వశంచేసుకుని సంకల్పజన్యవిషయములు అన్నిటిని నిస్సేషముగ మనసుచేత వదిలి ఇంద్రియ సమూహము అలానే శబ్దాది విషయములనుండి నివర్తింపజేసి మెల్లగా వివేకయుక్తమైన బుద్ధిచేత ఆత్మ యందు నిలిపి దానికంటే ఇతరమైన వాటి గురించి చింతించకుండా ఉండమని చెబుతున్నాయి.
మనస్సును అంతతేలికగా వశపరచలేము దాని లక్షణాన్ని అర్జునుడు తన సంశయాన్ని కృష్ణుడికి ఇలా చెబుతాడు.
“చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం ||”

“కృష్ణా! మనస్సు చంచలమైనది.బలాత్కారంగా హరించేది.అధికబళం కలది.దానిని త్రిప్పడం గాలిని తిప్పడంలా అసాధ్యమని చెప్తాడు.”అందులో సందేహం లేదని కృష్ణ పరమాత్మ చెప్పెను “అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం”. మరి ఇలాంటి మనస్సుతో పరమాత్మను తలవడం అవుతుందా? ఆళ్వార్లు ఏమో “చింతయామి హరిమేవ సంతతం”అంటున్నారు కదా!అంటే మనస్సుతో జరిగే కార్యము కనుక దానిని వేడుకొనుట కర్తవ్యమని తలచి ప్రార్థిస్తున్నారు. ఓ మనసా! పరమాత్మతో చెప్పాను నీవు పలుచోట్లకు తిరుగుతుంటే నాకు వేరొక గత్యంతరం లేదు.నీవు నాకు బంధువువి కూడా.

“ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః ||”

అని చెప్పినట్లు ఓ మనసా నువ్వు నాకు బంధువువి.నేను ఎక్కడికి వెళ్లినా,అలాగే నేను ఏ జన్మెత్తినా నువ్వు నా వెంటే వస్తావు,అందుకు నిన్ను నమ్మి ‘చింతయామి’అని అన్నాను.కాబట్టి నిన్ను ఆ భగవంతుడి వద్దే విడిచి పెడతాను,నువ్వు అక్కడే ఉండు.అంటూ మనస్సుకు చక్కటి బోధ చేస్తున్నారు. అలా చెప్పే సమయంలో మనస్సుకు వచ్చే సందేహాలకు ఇలా సమాధానం ఇస్తున్నారు కులశేఖరాళ్వార్లు.
ఓ మనసా! నిన్ను పరమాత్మ పాదపద్మములనే చోట ఉంచుతున్నా అక్కడ సుఖం ఉంటుందా?రక్షణ ఉంటుందా?అని అనుకుంటావేమో.
‘సరసిజనయనే’ఓ మనసా ఏమని చెప్పమంటావు పరమాత్మ యొక్క శృంగాము.వారి యొక్క దివ్య నేత్రములు తామరపుష్పములవలె అత్యంత అందముగా ఉంది ఆకర్షించును.ఇంకా నీ రక్షణార్థం అంటావా? పరమాత్మ శంఖచక్రములు ధరించి ఉంటాడు,తన యొక్క చక్రము లోకములనే కాలుస్తుంది.శంఖధ్వని వింటే పదునాలుగు లోకాలు భయపడతాయి. ‘మనస్సుకు రక్షణమేమిటంటే పరమాత్మ యందు రుచి కలిగి ప్రవేశించే సమయములో ఇంద్రియాలు తిరిగి వెనకకు లాగుతాయి అలాంటి సమయంలో నిష్ఠకు రక్షణగా మోహపరిచి అవసరమైతే పరమాత్మ నుండి వేరు చేసే దుష్టశక్తులను హతమార్చగలిగే శంఖచక్రాదులు మనకు తోడుగా ఉన్నాయని’చెబుతున్నారు.
పరమాత్మతో సమానము కానీ మించినది కానీ మరొకటి లేదు.నిరంతరం శ్రీహరి సంకీర్తనమనే అమృతాన్ని సేవిస్తూ ఆనందంగా వసిస్తూ ఉండుము.అంటూ కులశేఖరాళ్వార్లు పరమాత్మను సేవించడానికి సాధనమైన మనస్సును సిద్ధంచేసి ఉపాయాన్ని బోధించారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.

 

శ్రీమతే రామానుజాయ నమః


“కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే
శ్రమముషి భుజవీచివ్యాకులే గాధమార్గే |
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్న: ఖేదమద్యత్యజామి ||”

సంసారమనే ఈ ఎడారిలో ప్రయాణం చేసి చేసి అలిసిపోయి,ఈరోజు హరి అనే సరస్సు చేరాను.ఎంత సుందరమూ ఈ సరస్సు!ఆ హరి కరచరణములే మిలమిలాడుతున్న చేపలు.భుజములే అందు కదలాడే కెరటములు.అన్నింటి శ్రమలు హరించగలిగే సరస్సు. ఆ రేవులు అవగాహనము చేయడానికి అనుకూలంగా లోటు కలదై ఉంటుంది.అటువంటి హరి సరస్సులోకి ప్రవేశించి తేజస్సు అనే జలాన్ని తాగి నా బడాలికను తీర్చుకుంటున్నాను అని కులశేఖరాళ్వార్లు కీర్తించారు.
ఓ స్వామీ!నా పరిస్థితి ఎడారిలో చుక్క నీరులేని చోట మొలిచిన చెట్లు ఎలా వాడి మోడు అయిపోవునో అట్లున్నది.
నేను ఉండే స్థలం ఎటువంటిది అని అడుగుతావేమో?’సుఖము లవలేశమైనను లేకుండా,కష్టాలకు కొలిమి అయినటువంటి సంసారం అనే స్థలంలో ఉన్నాను.దీనిలో అత్యంత శ్రమపడి తపించిపోతున్నాను.’కాబట్టి ఎడారిలో దాహంతో తపించిపోతున్నవాడికి అదృష్టం కొలది ఒక సరస్సు కనపడితే తనయొక్క శ్రమను ఉపశమనం పొందకుండా వదులుతాడా!అలాగే ఈ సంసారమనే ఈ స్థలంలో ఏంటో అలిసిపోయిన నాకు “హరి” అనే సరస్సు కనపడింది.నేను మునగదలుచుకున్న సరస్సు నీవే స్వామీ!

ఈ సరస్సులో తామరలు ఉంటాయా?అంటే ని యొక్క దివ్య కరచరణములే సరోజములు.
చేపలుండునా?అంటే ‘కాంతిమన్నేత్రమీనే’ దివ్యమైన కాంతితో కదలాడే నీయొక్క నేత్రాలే మీనములవంటివి.
ఇతరమైన సరస్సులో మునగడం వల్ల తాత్కాలికంగా తాపము తీరుతుంది.కానీ హరి సరస్సు అటువంటిది కాదు ‘శ్రమముషి’ ఒక్కసారి మునిగిన సకలసాంసారిక దుఃఖములుగా కలిగిన తాపము క్షణంలో మటుమాయమవుతాయి.
సాధారణమైన సరస్సులకు పరిమాణముంటుంది ప్రయత్నంచేస్తే లోతుని తెలుసుకోవచ్చును.
‘హరి’అనే ఈ సరస్సుకు ముగింపు తెలియదు.పరమప్రామాణికమైన వేదం కూడా పరమాత్మలో ఉండే కళ్యాణ గుణములలో ఒకటైన ఆనందం  అనేది లోతు ఎంత ఉన్నది అని చెప్పడానికి ప్రయత్నం చేసి కొంత వరకు చెప్పి ఇక చెప్పలేక కనీసం ఉహించడానికి కూడా సాధ్యంకాదు అని  “‘యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా”” అంటూ అవాంగ్మనసగోచరము అని వెనుతిరిగింది.అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణగుణములనే “తేజోజలౌఘం” తేజోజలములు కలిగిన సరస్సులో తెలిసిపడినా తెలియకపడినా తరిస్తాము.

“ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి: పర్యవతిష్ఠతి ||”అని గీతలో తెలిపినట్లు

ఆ జలములు త్రాగిన తరవాత సంసారమనే ఈ స్థలమును నుండి విముక్తి పొంది నిత్యముక్తులతో కూడి పరమాత్మ ఆనందమును ఆనందించవచ్చు. అంటూ కులశేఖరాళ్వార్లు “ఖేదమద్యత్యజామి” ఇప్పుడే ఈ సంసారంలో పొందిన బడలికను పరమాత్మ యొక్క దివ్యమైన గుణములను గానం చేస్తూ దాని ద్వారా తాపాన్ని పోగొట్టుకుంటున్నాను అని పరమాత్మ గుణవైభవాన్ని గుర్తించి మనందరం తరించాలని ఆళ్వార్ల ఉద్దేశ్యము.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్

 

శ్రీమతే రామానుజాయ నమః 

“చిన్తయామి హరిమేవ సంతతం
మందమంద హసితాననామ్బుజం |
నందగోప తనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితం ||”  

మందస్మితముతో కూడిన ముఖపద్మము కలవాడు,నందగోపుడి కుమారుడు,పరాత్పరుడు,నారదాది ముని సమూహాల చేత సేవించబడేవాడు,అయినా శ్రీహరిని సదా ధ్యానించెదను.
ఈ శ్లోకంలో మన కులశేఖరాళ్వార్లు “నందగోపతనయం” అంటూ కీర్తిస్తున్నారు. పరమసాత్వికము అలాగే పరాక్రమము కలిగిన నందగోపుడి కుమారుడా!అని స్మరిస్తున్నారు.ఇలాగే మనగ గోదామ్మవారు కూడా “”కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్” పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ అంటూ పాడతారు.అటువంటి కన్నయ్య ఎలాంటివాడు? పరాత్పరుడు అంటున్నారు.ఏమిటి పరాత్పరః అంటే,

“మత్త: పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనంజయ |
మయి పర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ||”

అన్నిటికన్నా పెద్దవాడు. పరము,పరతరము కూడా పరమాత్మే.తనకంటే ఇంకా పై వారు ఎవరు లేరు కాబట్టి పరాత్పరుడు అన్నారు.ఐతే మరి అంత పెద్దవాడు ఐతే చిన్నవారిని పట్టించుకోకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఉండదు. కానీ పరమాత్మ అలాంటివాడు కాదు అయన ఎంతటి పరాత్పరుడో అంతటి సులభుడు కూడా! శ్రీమన్నారాయణుడు,వైకుంఠధాముడు అయినా పరాత్పరుడు తన సౌలభ్యమును చూపించడానికి నందగోపుడి కుమారుడిలా  వచ్చి అందరిచేత లభ్యం అయ్యే విధంగా ఉన్నాడు.కడితే కట్టించుకున్నాడు,కొడితే కొట్టించుకున్నాడు. ఇంతటి సౌలభ్యం ఎక్కడైనా ఉండునా.కాబట్టి పరత్వసౌలభ్యముల యందు నిన్ను మించినవాడు లేరు అని కీర్తిస్తున్నారు.
అటువంటి పరమాత్మ మోముని వర్ణిస్తారు “మందమంద హసితాననామ్బుజం” పద్మమువంటి ముఖముకలిగి అత్యంత సుందరమైన స్వల్పమైన చిరుమందహాసముతో ప్రకాశించేవాడా!అటువంటి నిన్ను నిద్రలేచిన సమయమునుండి తిరిగి నిద్రకు వెళ్లెవరకూ సదా నిన్ను స్మరించేలా అనుగ్రహించుము.
ఇలా మందహాసముతో అనడానికి ఇంకొక సంప్రదాయ రహస్యం ఏమిటంటే ఎవరైనా సరే అత్యన్తాశ్చర్య సమయంలోకాని,అత్యంత కోపము సమయంలో మనము ఏమి చెప్పినా కూడా చెవికి సరిగ్గా ఎక్కదు అదే మందహాసముతో ఉండి మనఃప్రసాద కాలము అత్యంత సంతోష కాలం కాబట్టి పెరుమాళ్ అలావుండే సమయం చూసి చెప్తున్నారు.
అటువంటి నీ కృష్ణరూపమును దర్శించి మహర్షులు సేవించుకున్నారు.నారదుడు తరుచు వచ్చి సేవించి స్తోత్రము చేస్తారు.ఇంద్రుడు కామధేనువుతో వచ్చి దానియొక్క క్షీరముతో అభిషేకముచేసి ప్రార్ధించారు కదా నీ యొక్క పరత్వమును.
“పరాత్పరం నారదాది మునిబృంద వందితం” అనడం చేత పరమాత్మ యొక్క పరత్వమునకు నారాదాది మునిబృందములు సాక్షులు అని తెలుపుతున్నారు.
“చిన్తయామి హరిమేవ సంతతం”అటువంటి నిన్ను స్మరించినంత మాత్రాన నాలో ఉండే పాపపంకిలమైన మనస్సునందు శుద్ధత ఏర్పడి తిమిరాంధకారములో ఉన్న నా మనస్సు నీ యొక్క నామ స్మరణ చేత పునీతమై జ్ఞానజ్యోతి ప్రకాశించి   మనస్సుయందు సుస్థిరమై సదా నీ ధ్యానములో ఉండేలా అనుగ్రహించుగాక! పాపపంకిలమైన మనస్సును స్వప్రయత్నంచేత శుద్ధతకలుగదు.చీకటిని పోగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన అంధకారం పోదు,అగ్ని భగవానుడే వచ్చి పోగొట్టవలసిందే. అలాగే  అజ్ఞానాంధకారాన్ని నువ్వు మాత్రమే పోగొట్టే వాడివి కనుకనే “హరిః” అటువంటి ఓ శ్రీహరి నిన్ను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండేలా కటాక్షింపుడు అని నమస్కరిస్తున్నారు మన కులశేఖరాళ్వార్లు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.

 

శ్రీమతే రామానుజాయ నమః


“కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్యైవ మే విశతు మానస రాజహంసః |
ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తై:
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే ||”

ఓ కృష్ణా! నీ పాదకమలం అనే గూటి మధ్యమున నామనస్సు అనే రాజహంసను ఇప్పుడే ప్రవేశించనిమ్ము.
ప్రాణప్రయాణ సమయం నందు కఫవాతపిత్తములు ఏర్పడితే నిన్ను స్మరించునో లేదో?.
మరణకాలము నందు స్మరణ కలగటం అనేది మిక్కిలి నాజూకైన కాలం కనుక మన ప్రయత్నం చేత కలగదు పరమాత్మ అనుగ్రహం ఉంటే తప్ప.కాబట్టి శరీరావస్థ బాగునప్పుడే నీ యొక్క స్మరణ నాకు నిరంతరం కలిగించండి అని ప్రార్ధిస్తూ.ఆళ్వార్ల యొక్క మనస్సును అసాధారణంగా కనిపించే హంసతో పోల్చడానికి గల కారణం ఏమిటి?అంటే.
ఏ చిలుకో ఇంకో పక్షి తినకూడదా అంటే,తదితరమైన పక్షులు రజోతమోగుణములను కలిగి ఉంటాయి.హంస సాత్వికగుణము కలిగినది,శుద్ధశ్వేతవర్ణం కలది. కాబట్టి నా మనస్సనెడు రాజహంస నీ పాదములనే పంజరమున ప్రవేశించేలా చేయుము అంటే నా మనస్సు రాగద్వేషములను విడిచి శుద్దసాత్వికమైన నీ చరణములను ఆశ్రయించేలా చేయండి అని ప్రార్ధించారు.
నా మనోహంస వెళ్లకూడని వైపులకు వెళుతోంది కాబట్టి ఈనాడే నీ అనుగ్రహంచేత నీ పాదద్వయం మధ్య బందించుము. నది ప్రయాణంలో దిగడానికి రేవు ఎలా ఐతే కావాలో,శేషభూతుడైన ఆత్మ స్వామివద్ద చేరడానికి వారి దివ్యపాదములే రేవుగా ఉన్నాయి. అలా మరణకాలం అందు నీయొక్క స్మరణ చేయడానికి గొంతు సహకరిస్తుందో లేదో కాబట్టి ఇప్పటినుండే ప్రధమసోపానం అయినా నీ చరణారవిందాన్ని స్మరిస్తే ఆ సమయాన నీ అనుగ్రహంచేత కలుగును. ఇదే విషయాన్ని

పెరియాళ్వార్ తిరుమొళి లో “తుప్పుడయారై” అనే పాశురం లో ‘అప్పోదు కిప్పోదే శోల్లివైత్తేన్’ అంటూ మరణకాల సమయం అప్పటి గురించి ఇప్పుడే చెబుతున్నాను అని అంటారు. “తస్మాత్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్య చ” అన్నట్లు కులశేఖరాళ్వార్లు శరీరము దృఢముగా ఉన్నప్పుడే పరమాత్మ స్మరణ చేయమని హెచ్చరిస్తున్నారు.అంత్యకాలమున ఏర్పడే పరిస్థితులు పరమాత్మ యందు మనస్సు ఉండునో లేదో అని ఇప్పట్టి నుండే ప్రార్ధించమని తేలుతున్నారు మన ఆళ్వార్లు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్

 

శ్రీమతే రామానుజాయ నమః

“దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామం |
అవధీరిత శారదారవిందౌ
చరణౌ తే మరణేపి చింతయామి ||”

నరకాసురుడిని సంహరించినవాడా! అని కీర్తిస్తూ నిన్నటి శ్లోకంలో వీటి యందు ఫలాపేక్షలేదని తెలియజేసారు. ఈ శ్లోకంలో స్వర్గమందుకాని,భూమియందుకాని,చివరకు నరకమందు నివాసము వచ్చిన చింతలేదు.శరత్కాల కమలములు తిరస్కరించునట్టి నీ యొక్క దివ్య పాదములనే మరణకాలమునందు కూడా స్మరించాలని అంటున్నారు మన కులశేఖరాళ్వార్లు.

క్రిందటి శ్లోకంలో ధర్మార్ధకామములను కూడా వద్దన్నారు కదా? మరి ధర్మము చేయకపోతే స్వర్గాదులు లభించవు,అప్పుడు భూమిమీదనే నివాసం కలుగుతుంది,అలాగే ధనలోపం వల్ల చేసే పాపాల వలన నరకవాసము కలుగుతుంది కదా? అనే ప్రశ్నలకు సమాధానంగా ఆళ్వార్లు ఇలా చెప్పారు “దివి వా భువి వా మమాస్తు వాసో” నాకు ఈ లోకమా,ఆ లోకమా అనే వ్యవస్థ ఉంటే కదా?అన్ని ప్రదేశాలు సమానమే పరమాత్మ దివ్యచరణారవింద ద్వయమే పరమ పావన ప్రదేశము.
నరకాదుల గురించి నాకు చింత లేదు స్వామీ!ఎందుకు అంటావేమో?
‘నరకే వా నరకాంతక ప్రకామం’ బ్రహ్మాదులు ప్రార్ధించారు అని రావణుని చంపావు.ఇంద్రాదులు ప్రార్ధించారని నరకాసురిడిని సంహరించావు. ఆ సంగతులన్నీ నాకు ముఖ్యంకావు. నేను జీవాత్మను,హీనుడను,ఏ స్థలంలో వసించిన అందువల్ల నాకు గౌరవం,అగౌరవం అనేవి పెరగవు తగ్గవు.నేను అధమాదముడిని.నిన్నే నమ్మి జీవించేవాడిని కనుక నేను నరకంలో పడితే నరకనాశకుడు అని బిరుదు కలిగిన నువ్వు సహించలేవు. కాబట్టి నా గురించి చింత నీకు తప్ప నాకు లేదు అని ఆళ్వార్ల అర్ధం.

‘ఆళవందార్లు  తమ స్తోత్రరత్నంలో చాలా అందంగా సత్ ని వివరిస్తారు.
“అభూతపూర్వం మమ భావి కిం వా
సర్వం సహే మే సహజం హి దుఃఖం |
కింతు త్వదగ్రే శరణాగతానాం
పరాభవో నాథ న తే నురూపః ||”
నాథా! నేను గతంలో అనేక హీనజన్మలు పొంది ఉన్నాను.నాకు కొత్తకాదు సహజమే.అనన్యభావముతో తెలుస్తున్న నన్ను రక్షింపకపోతే శరణాగత వత్సలుడు,దీనబంధుడు,పరమదయాళుడు అనే నీ పేర్లకు కళంకం వస్తుందేమో అని దుఃఖిస్తున్నాను.అంతేకాని నన్ను రక్షించమని కోరడంలేదు అంటారు.
‘పరమాత్మే రక్షకుడు అని నిశ్చల భక్తిశ్రద్దలతో భజిస్తే ఆ భక్తులు యమదూతలు చూడరు,కలలోనైనా చూడరు అని భాగవతం తెలియచేస్తోంది.’
శ్రీమన్నారాయణుడి దివ్య చరణములే రక్షకము,వాటిని వర్ణించే శక్తి నాకు లేదంటూ,
“అవధీరిత శరదారవిందౌ” అని స్వామి పాదముయొక్క కార్యము తెలుపుతున్నారు.
శారద – అనేక సంవత్సరములుగా ఉండే,అ – అధికమైన,రవిందం – అంధకారమును, అవధీరిత – పోగొడతాయి. అందువల్లనే నీ దివ్య పాదముల చింతను అడుగుతున్నాను. స్వామి!నీ వ్రేలి నఖమే కోటిసూర్యోదయ ప్రకాశముగా ఉండును. ఇంక రెండు పాదాల పదినఖముల కాంతి చేరితే ఎలాంటి అజ్ఞానాంధకారమైన పోవలసిందే. అలాంటి సదాధ్యానమును కలిగించుము,లేదంటే కనీసం మరణకాలమునందైన కలిగించండి చాలు. ‘అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం’ అని గీతలో తెలియజేసినట్లు అంతిమస్మరణ యందు ఐన పాద ద్వయాన్ని స్మరించమని, ఆళ్వార్లు స్వామీ పాదారవిందంలో దాగి ఉన్న అమృతాన్ని అనుభవింపచేస్తున్నారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.

 

శ్రీమతే రామానుజాయ నమః

“నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్ భవ్యం భవతు భగవ పూర్వకర్మానురూపం |
ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్మాన్తరేపి
త్వత్వాదాంభోరుహ యుగగతా నిశ్చలా భక్తిరస్తు ||”

స్వామీ! ధర్మము,నిక్షిప్తధనము మీద నాకు ఆపేక్షలేదు. కామానుభవము మీద ఆశలేదు. పూర్వకర్మానుసారముగా ఏది నాకు కలుగుతుందో అది అంతా నాకు కలుగుగాక. అయినా సరే జన్మజన్మాంతరముల యందు నీ పాదారవిందద్వయమునందు భక్తి సుస్థిరంగా ఉండాలి అదే నాకు కావలసినది.    
దానములు చేయడం ద్వారా ఏర్పడిన ధర్మము వల్ల ఆర్జించిన పుణ్యంచేత కుంభీపాకాది నరకములు తొలగించుకోవాలని కోరికలేదు అంటూ ఈ  శ్లోకంలో కులశేఖరాళ్వార్లు మొదటి పాదంలో “వసుని అనకుండా వసునిచయే అన్నారు” అంటే తనకు ధనము నందు ఆశలేదని చెప్పకుండా ధనరాశియందు ఆశలేదు అని చెప్పారు. ధనరాశి మీద ఆశలేదు అంటే ధనము వద్దని కాదు అర్ధం.శరీరయాత్ర జరగడానికి స్వల్పధనములేనిదే ఎలా?

“నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ద్యే దకర్మణః ||”

“నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్నోతి కిల్బిషమ్ ||”
అంటే శరీర పోషణార్ధమై ధనార్జనకై పాటుపడడం దోషము కాదని చెబుతోంది గీత.ధర్మసాధనము అన్ని చెప్పడంచేత శరీరయాత్రకు సరిపడ ధనము ఆర్జించడం తగినదే.
“ఆశాపాశశతైర్బద్ధా: కామక్రోధపారాయణాః |
ఈహంతే కామభోగార్ధ మాన్యాయేనార్ధ సంచయాన్ ||”
అలాగని ద్రవ్యమునందు అధిక ఆశకలవారు అసుర స్వభావులని చెప్పబడింది.ఇలాంటి కారణాల వల్ల ఆళ్వార్లు ధనమునందు అనకుండా ధనరాశియందు లేదు అని చెప్పారు..

మరి కామోపభోగసుఖములు అనుభవించకూడదా?అంటే  
‘నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే’ కులశేఖరులు ధర్మకామములకు మధ్యలో ధనాన్ని చెప్పడం చేత, ధనసాధనమైన ధర్మమందు,ధనసాధనమైన కామముయందు ఇచ్ఛలేదు అని అర్ధం సూచిస్తోంది. జ్ఞానులైనవారు ఇష్టప్రాప్తిని,అనిష్టనివారణాని కోరుకోరు,సుఖమో దుఃఖమో భగవంతుడే ఇవ్వాలీ అనే అంటారు. శాశించేవాడే ఇవ్వాలి లేదంటే అడిగిన ప్రయోజనం ఉండదు.అనుకు కులశేఖరాళ్వార్లు ఏమి కోరలేదు.
సర్వ శక్తిమంతుడైన పరమాత్మను ఆశ్రయించిన వారు వ్యర్థులుగా అవ్వకూడదు అంటావేమో?
  ఆలా ఐతే నేను కోరేది ఇవ్వండి “మమ బహుమతం జన్మజన్మాన్తరేపి
త్వత్వాదాంభోరుహ యుగగతా నిశ్చలా భక్తిరస్తు” భగవంతుడిని ఆశ్రయించి ఏదైనా కోరుకుంటే అది ఎలా ఉండాలంటే అన్ని ఫలాలకి సరిపోయేదిలా ఉండాలి.కాబట్టి ఏ జన్మ ఇచ్చినా కూడా నీ పాదపద్మములయందు మాత్రం నిశ్చలమైన భక్తి నాకు ఎల్లప్పుడూ ఉండేలా కటాక్షించుము చాలు.ఏమి కోరుకోని యెడల “అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే” అన్నట్లే యోగక్షేమములు పరమాత్మ తలమీద పడతాయి అని కులశేఖరాళ్వార్లు తెలియజేస్తున్నారు.

నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.