🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻
తిలకం – పరమార్థం 

తిలక శబ్దం శ్రేష్ఠతా వాచకం. “తిలకం” అనగా “శ్రేష్టం”.
ఒక జాతి లో శ్రేష్ఠులుని ” తిలకం” గా స్తుతిస్తాము.

“గురుముఖ మనదీత్య ప్రాహవేదాన్ అశేషాన్
నరపతి పరిక్లిప్తం శుల్కమాదాతు కామ:
శ్వశురమమరవంద్యం రంగనాధస్య సాక్షాత్
ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి.”

గోదాదేవి జనకులైన విష్ణుచిత్తులనే పెరియాళ్వార్  ద్విజకుల “తిలకం” గా
అభివర్ణింపబడ్డారు.

ఒక వ్యక్తి “ధరించే” వాటిలో శ్రేష్ఠమైనది అనే అర్థంలో నుదుట ధరించే బొట్టుని “తిలకమ”ని అంటారు. హిందువులందరు తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరిస్తారు.  ఒకవ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనటానికి గుర్తు తిలక ధారణ. భగవంతుణ్ణి నమ్ముతున్నాడనటానికి కూడా బొట్టే నిదర్శనం.

బొట్టు(తిలకం)  ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. కానీ అదే దాని పరమార్థం కాదు. అది అనునిత్యం జరిపే ఒక గొప్ప సంస్కారం.  ఆచార్యులు శిష్యునికి ఉపదేశం చేసే సమయంలో బొట్టు పెట్టే నెపంతో భ్రూ మధ్య ప్రదేశాన్ని స్పృశించి ఆజ్ఞా చక్రాన్ని ప్రచోదన చేస్తారు.

తిలక ధారణ  కోసం భారతీయులు ఉపయోగించిన సామాగ్రి వారి భావ విస్తృతిని తెలియజేస్తుంది. తరచుగా వాడేది కుంకుమ. అది పసుపులో కుంకుమ రాళ్ళు వేసి చేసినది కావచ్చు, నిమ్మరసంలో పసుపు కొమ్ములను నానవేసి చేసినది కావచ్చు, ఇంకా సిందూరం, తిరుచూర్ణం , గంధం, అక్షతలు,విభూతి, చాదు [దీన్ని ఎన్నోరకాలుగా తయారు చేస్తారు]. ఇంకా శక్తి ఉంటే కస్తూరి, పునుగు,జవ్వాది, పచ్చ కర్పూరం, నవ రత్నాలు.. ఎవరి శక్తి ననుసరించి వారు తిలక సామగ్రి తయారు చేసేవారు .
      ధరించిన తిలకాన్ని బట్టి ఏ సంప్రదాయానికి చెందిన వారో సులభంగా గుర్తించవచ్చు. వైష్ణవ సంప్రదాయంలో దీనికి “స్వరూపం” ; “ఊర్ధ్వ పుండ్రం” అని పరిభాష.
ముఖాన బొట్టు ఉండటం మరెన్నో అంశాలని సూచిస్తుంది. బొట్టు లేకపోతే అది అశుచి మొహం.
ఇంకా స్నానం కాలేదని సామాన్యార్థం. శుభ కార్యాలు చేయటానికి అర్హత లేని సూతక సమయం కూడా కావచ్చు. అంటే, నుదుటనున్న తిలకం శుభ కార్యాలు చేయటానికి, నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వర్తించటానికి అర్హత ఉన్నదని సూచిస్తుంది. అందుకే స్నానం చేయగానే ముందుగా తమ తమ సంప్రదాయాల కనుగుణంగా స్వరూప ధారణ చేసి మరీ పూజాదికాలు నిర్వర్తిస్తారు.
  ముత్తైదువలైన స్త్రీలు ముఖాన బొట్టు లేకుండా ఒక్క క్షణమైనా ఉండరు. అది అయిదోతనానికి చిహ్నం. బొట్టు పెట్టుకోవటమే కాదు పెట్టటం కూడా మన సంప్రదాయంలో భాగం. బొట్టు పెట్టటం మర్యాదకి చిహ్నం. ఆహ్వానించటానికి బొట్టు పెట్టి మరీ పిలవటం ఆచారం.
      ఎవరికైనా పని అప్పచెప్పేటప్పుడు చందన మలది కుంకుమ పెట్టేవారట. పిల్లలకి బొట్టు పెడితే దిష్టి తగలదని నమ్మకం.
    మంచి రంగు పరిమళం ఉన్న కుంకుమ తయారు చేయటం ఒక కళగా భావించేవారు. తిలక (స్వరూప) ధారణ  స్త్రీ, పురుష భేదం లేక అందరు పాటించ వలసినది. మేలు కూర్చేది.
🙏🏻జై శ్రీమన్నారాయణ🙏🏻