ద్వయమంత్రం అత్యంత పరిమళ భరితం
Posted by adminNov 21
ద్వయమంత్రం అత్యంత పరిమళ భరితం
శ్రీమతే రామానుజాయ నమః 🙏🏻
కొన్ని మంత్రాలు మంచి రుచి, చక్కని పరిమళం కలిగి ఉంటాయి. అయితే రుచి పరిమళాన్ని మనం వాస్తవికంగా గుర్తించగలగాలి. అది ఎలా ? రుచి అంటే మనం ఎన్ని సార్లు రుచి చూసినా విసుగు లేకుండా పదే పదే రుచి చూడాలని అనిపించాలి. మంచి వాసన అంటే ఆస్వాదిస్తుంటే అన్నింటినీ మరచిపోవాలి. ఇది ప్రాపంచిక విషయాల్లో కొంత హద్దు ఉంటుంది. మిఠాయి తింటామనుకోండి, ఎంత తినగలం ? కొంత తినగానే దానిపై ఇష్టం తగ్గిపోతుంది. అసలైన రుచి అంటే తిన్నప్పుడల్లా తృప్తి కలగాలి, దానిపై ఇష్టం ఎప్పుడూ తగ్గకూడదు. అలాంటి రుచి పరిమళం కలిగి ఉండటం అనేది మంత్రానికి సాధ్యం తప్ప ప్రాపంచిక విషయాలకు కాదు.
ద్వయ మంత్రపు పరిమళం గురించి ఒక అందమైన సన్నివేశం ఉంది. కూరేశులు రామానుజులవారి శిష్యులు, వారి వెంటే శ్రీరంగంలో ఉంటుండేవారు. శ్రీరంగనాథుని కృపవల్ల కూరేశులవారికి కవల పిల్లలు జన్మించారు. భగవంతుని కృపవల్ల జన్మించిన ఆ పిల్లలని చూడాలని ఉందని, ఆపిల్లలు పుట్టిన పదకొండు రోజులు కాగానే వారిని తీసుకు రమ్మని రామానుజులవారు తమ శిష్యులైన గోవింద బట్టర్ వారిని పంపారు. గోవింద బట్టర్ ఆ పిల్లలని తీసుకు వస్తు వచ్చే దారిలో వారు వీరు చూస్తారు, ఆ పిల్లలకి ఎలాంటి దృష్టి దోషాలు కలగ కూడదు అని ద్వయమంత్రాన్ని పదే పదే చదువుతూ తీసుకువచ్చారు. రామానుజులవారి వద్దకు రాగానే ఆ పిల్లలని దగ్గరికి తీసుకొని చూసి, “ఆహా! చక్కటి పరిమళం, ఎక్కడి నుండి వచ్చింది” అని అడిగారు. “స్వామీ! ఆ పిల్లలకు ఎట్లాంటి హాని కలగ కూడదు అని వచ్చేప్పుడు ద్వయమంత్రాన్ని చదువుతూ తీసుకు వచ్చాను, అది ద్వయమంత్రపు పరిమళం” అని గోవింద బట్టర్ సమాధానం ఇచ్చారు. అయితే నీవే ఆపిల్లల గురువు అని చెప్పి పరాశర , వేదవ్యాస అని నామకరణం చేసారు రామానుజులవారు. ఆ పిల్లలే పరాశర బట్టర్ మరియూ వేదవ్యాస బట్టర్. రామానుజులవారి తరువాత గోవింద బాట్టర్, ఆయన తరువాత పరాశర బట్టర్ మన పూర్వాచార్య పరంపరలో ఉన్నవారు.
అతి చిన్న వయసులోనే ద్వయమంత్రపు పరిమళాన్ని ఆస్వాదించిన పరాశర బట్టర్ల వారు ఆ లోన కలిగిన దివ్య అనుభవాన్ని ద్వయమంత్రపు తాత్పర్యంగా సులభంగా అర్థం చేసుకొనేట్టుగా రెండు శ్లోకాలు ప్రసాదించారు అష్టశ్లోకిలో. అష్టశ్లోకి అంటే ఎనిమిది శ్లోకాలు అందులో నాలుగు శ్లోకాలు అష్టాక్షరిని, రెండు శ్లోకాలు ద్వయమంత్రాన్ని, రెండు శ్లోకాలు చరమశ్లోకాన్ని వివరిస్తాయి. పరాశర బట్టర్ల వారి తరువాత ఆచార్య పరంపరలో నంజీయరు, శ్రీకృష్ణపాదులు ఈ ద్వయమంత్రపు పరిమళాన్ని ఆస్వాదించినవారే. ఆ తరువాత వచ్చిన పిళ్ళై లోకాచార్య స్వామి పరమ కారుణికులు కనుక పరాశర బట్టర్లవారి శ్లోకాలని 72 సూత్రాలతో ద్వయమంత్రాన్ని వివరించారు. ద్వయమంత్రమే కాక అష్టాక్షరి, చరమ శ్లోకానికి ఇచ్చిన సూత్రాలని అన్నింటిని కలిపి ముముక్షుపడి అని గ్రంథం వెలువడింది. వారి ప్రశిష్యులైన మణవాళ మహామునులు పిళ్ళై లోకాచార్య స్వామి అందించిన గ్రంథానికి వ్యాఖ్యానాలు చేసారు.
🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻