శ్రీమతే రామానుజాయనమః🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పెరియాళ్వార్ పాసురాలద్వారా
పెరుమాళ్ళను అనుభవించి హృదయములో నిలుపుకొనే మార్గమును చూస్తున్నాము  కదా !

మొట్టమొదట వారు పరమాత్మ తిరువడిగళ్ —- ను పాడుతున్నారు.
పాదములలోని అణువణువుని సేవించుకొని పరవశము పొందుతున్నారు.

ఆ పాదాలు ఎలాంటివి? మనలను వుద్దరించేపాదాలు!

పరమపదములో ,సవ్యం పాదం ప్రసార్య — ఒక పాదము చాపి , ఒకపాదము మడిచి నిత్యసూరుల ,ముక్తాత్మల ,తనువులు పులకరించేలా దర్శన మిస్తారు కదా!

పరమపదనాథునిది హిరణ్మయమైన రూపము.
బంగారము— మనము ఈ లోకములో చూసే బంగారముకాదు! ప్రకృతి సంబంధముకలిగిన ఈ బంగారములో రజోతమోగుణములు జడరూపములో ఆశ్రయించి వుంటాయి . కాని పరమపదనాథుని హిరణ్మయరూపము పరిపూర్ణ  శుద్దసత్వ స్వరూపము. మన వూహలకు అందనిదా రూపము.
వారి పాదములు – పొర్కమల పాదము.🙏

అరే అయితే మనముసేవించుకోనేలేమే! మరి ఆశ్రయించేదెలా?

ఆ బెంగయే అక్కరలేదు. అర్చ్యాతిరుమేనిలో ,మనకు ,ఆ తిరు పాదములు సాక్షాత్కరిస్తున్నాయి కదా!

ఆళ్వార్ ఒక పాసురములో పాడుతారు “ “ఆర్ ఎనక్కునిన్పాదమే శరణాగ తందొழிన్దాయ్” తన చరణములను శరణముగా యిచ్చిన దేవాధినాథ పెరుమాళ్ వానమామలైలో మనకొరకు వేంచేపుచేసివున్నారుగా! “ తాళ్గళాయిరత్తాయ్” -అని విశ్వరూపదర్శనములో కనిపించునట్లుకాక , సుతి మెత్తని పాద పద్మ ద్వయముతో మనకు సాక్షాత్కరిస్తున్నారు.

ఎలా మనకు హృద్యముగా అనిపిస్తే అలా సేవించుకొనే వీలుగా , “ నిన్రు, ఇరుందు , కిడందు, ! “ అంతేనా! “ మణ్ తావియ ఈశనై “ పాదములను చాచి ,త్రిభువనములను కొలిచిన కోలములో , ఎన్ని క్షేత్రములలో వేంచేసివున్నారు? కాంచీపురములో “ 🌷ఉలగళంద పెరుమాళ్. 🌷
తిరుక్కోవలూరులో “ 🌷తిరువిక్రమ పెరుమాళ్🌷
శీర్గాழிలో తావి అళందుండిరుక్కర పెరుమాళ్ – 🌷తాడాళన్🌷తిరుపాదములతోనే -ఏలుకొంటున్న , పరిపాలిస్తున్న స్వామి 🙏
అలాంటి స్వామి పాదములను శరణన్న ,ఆయనెంత సులభుడవుతాడో తెలుసా!

తిరుమழிశై ఆళ్వార్ – ఆరావముద పెరుమాళై” నడన్ద కాల్గళ్ నోన్దవో- నడుఙ్గఙ్ఞాలమేనమాయ్ !ఇడంద మెయ్కులుంగ వో !విలంగుమాల్ వరై చ్చురం! కడన్ద కాల్ పరన్ద కావిక్కరై కుడైందెయుళ్!
కిడంద  వారు ఎழுన్దిరున్దుపేశు !
వాழிకేశనే” అని
“ఏన్ పళ్ళి క్కొండీరయ్యా”- ఎందుకు శయనించావయ్యా? లేచి పలుకవేమి ? అని అడిగితే —- ఆ భక్తవత్సలుడు ఆళ్వారే తనకు పిరాన్ – ఏలువాడనిఎంచి , వారి పాశమునకు బంధీఅయిపోయి ఆనందమును అనుభవించు ఆళ్వారుగా తానుమారి , తిరుమழிశై  పిరాన్ ఆఙ్ఞమేరకు లేచి సమాధానము చెప్పబోయారట! అయ్యయ్యో! పరమాత్మను నేనులేవమనడమేమిటి , వారులేచుటేమిటని “ పదరి” తపించిపోయి , వద్దు స్వామి వద్దు అలానే వుండండి అని అంటే, స్వామి ఉత్తానశయనములో వుండిపోయారుట. ఈ భంగిమలోనూ స్వామి పాదసేవ మనకు లభిస్తుంది. 🌷పాండవదూతగా – 🌷తన సౌలభ్యమునుచాటుతూ పరమపదములోలా ఒకపాదము .మడిచి, ఒకటి చాచి — సేవ .
🌷రంగని శయనకోలసేవ 🌷
కలియుగనాథుడిగా 🌷వేంకటేశ్వరునిగా 🌷నిలబడి సేవ !
ఇలా తన చరణకమలములను మనకొసంగిన స్వామిని చేరి” అడిక్కీழ் అమర్న్దు , పుగుందు!” అంతే మనము చేయవలసినది.
ఆ తిరుకమలపాదములను ఆశ్రయించడానికి దానిమీద ప్రేమ ఎలా కలిగేట్లు చేసుకోవాలో నేర్పుతున్నారు – పెరియాళ్వారు!
పాదములను అణువణువును అనుభవిస్తూ!
👣🌹🌸🌹🌸🌹👣🌹👣🌹👣🌹
నిన్న మనము పాదములను అనుభవించాము. నేడు రెండవ పాసురములో పాదపువ్రేళ్ళను ఆ వ్రేళ్ళకుగల నఖములను అనుభవిస్తున్నారు!

ఒద్దికగా అన్నీ ఏ ఏ సాముద్రిక లక్షణములతో ఏ ఏ పరిమాణములో వుండాలో అలా అమరి వున్నాయిట కన్నయ్యవి. అందుకనే 🌷ఒత్తిట్టిరుందవా కాణీరే 🌷—- 🙏అని పాడారు. ఏమిటి కాణీరే— అదే కాలికున్న ఒద్దికైన  పది వ్రేళ్ళు దానిమీదున్న నఖములు, వాటి అందమును వర్ణిస్తున్నారు! కళ్ళు మూసుకొని మనము కన్నయ్య తిరుపాదములను వాటి వ్రేలు గోళ్ళను అనుభవిద్దాము. కన్నయ్య అరిపాదము తామరలా ఎఱ్ఱగా వుంటుందికదా! పై పాదము నీలమణిలా తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. వాటినుంచి తామర రేకులలా పది వేళ్ళు అందంగా సాగి వుంటాయి, అంచులు కొసలు ఎఱ్ఱగా పైన నీలిరంగుతో ! వాటి పైన వజ్రములా వెలిగే నఖములు!
యశోద కన్నయ్య ఒక్కొక్క వ్రేలికి ఆభరణములు తొడగవలెనని ఆశ పడినదిట. ఆడపిల్లదా , మగపిల్లవాడిదా అనే వ్యత్యాసమును చూడదుట యశోద! కన్నయ్యకు తగినట్లుగ సౌకర్యముగ అందంగా వుండాలి అంతే!
దానికని ఏరి ఏరి , బొటనవేలికి , కనకము, ప్రక్కవేలికి ముత్యము, తరువాత మాణిక్యము, తరువాత పగడము – ఇలా – గోకులపు నాయకుడి బిడ్డకదూ! అందుకని నవరత్న మాలలో ఎలా పొందికగా మణి తరువాత ఒక మణి పేరుస్తారో- అలా యశోద అందమైన ఆభరణములను పేర్చి కన్నయ్యకు తొడిగిందిట. అది చూసేందుకే ఒక జ్యోతి శిఖలా తేజోమయమై కనిపిస్తుంది కదా! శ్రీరంగనాథుడుకి – నంబెరుమాళ్ కు వజ్రకవచ సేవనాడు , మాణిక్య పాదుకలు సమర్పిస్తారు. వారి పాదమునకు ఒద్దికగా నీలమణులు , మాణిక్యములు ,వజ్రములు ముత్యములతో , నీలి వ్రేలిమధ్యలో ఎఱ్ఱని మాణిక్య బిళ్ళ – బొటనవేలికీ మధ్యవేలుకూ మధ్యలో , ఎంత ద్దగద్దగాయమానంగా మనచూపులు ఆ పాదములనుండి మరలిరానని మారాం చేసేంత అందంగా వుంటుందో! అది అనుభవైకవేద్యమే!
అలా, అంతకంటే మిన్నగా అనీ – అనవచ్చేమో, యశోదపిరాట్టి కన్నయ్యకాలికి నగలను తొడిగిందిట!
కన్నయ్య పాదాలే అందము. ఆ అందమునకు వన్నెతెచ్చు ఆభరణములు! మణి వణ్ణన్ పాదములుకదా అవి. ఆమాణిక్యాలు మణివణ్ణన్ అందానికి తేజస్సు చేకూర్చాయా ,లేక ఆ మణివణ్ణన్ తిరుపాద తేజస్సువల్ల ,ఆ మాణిక్యాలు మెరుస్తున్నాయా? బదులులేని ప్రశ్న ఇది. కాదు కాదు శుద్దసత్వసంపన్నుడైన మణివణ్ణన్ తేజస్సుచేతనే ,ఆ ఆభరణాలకు వన్నె వచ్చింది! “ ముడిచ్చోదియాయ్ ఒన్ ముఖచ్చోది వళర్న్దదువో ! అడిచ్చోది నీ నిన్న తామరైయాయ్ అలర్న్దదువో !
— అని ఆళ్వార్ పాడినట్లు ఒక జ్యోతితో ఇంకొకజ్యోతి పోటీ పడుతూ అంత ఒక తేజోమయ స్వరూపముగా కానవచ్చిందిట.
పరాశర భట్టర్ తన వరదరాజ స్థవములో వరదరాజుని అందాలను వర్ణిస్తూ—-
పద్యాస్యద్యాంగుళిషు వరద!ప్రాన్తత కాంతిసిన్దోః!!
వీచీ వీథీ ముభవ యీష్వంభసాం లమ్బితాసు!!
విన్దన్నిన్దుః ప్రతి ఫలనజాం సమ్పదం కిమ్పదంతే!!
ఛాయాఛద్మా నఖ వితతితాం లమ్భిత శ్శుమిభితస్సన్!!

ఈ వేళ్ళు ఎంత అందంగా వున్నాయంటే- కాంతి స్సింధోః వీచి! సముద్రము- ఆ సముద్రమునుంచి తరంగాలుతరంగాలుగా పరుగున వస్తుంది. కాంతిఅనేసాగరములోనుంచి తేజస్సు అలలుఅలలుగా బయటకు వస్తోంది. అలాగే పరమాత్మ తిరుపాదమనే సముద్రములోంచి ,ఒక్కోవేలు, ఒక్కోఅలలా ,బయటికి వస్తోంది. ఆకడలిఅలలో ఆకాశపు చంద్రుడు  ప్రతిబింబించాడుట, తేజోమయముగా! తిరుపాదకడలి- వ్రేళ్ళను అలలు- దానిపై నఖములనొప్పుచూ చంద్రుని ప్రతిబింబము! ఆహా పరమాత్మ పాదములఅందము వర్ణనాతీతమైనదికదా! ఆ ఊహే ఎంత అద్భుతమైన చిత్రమును మన మనోఫలకముపై దిద్దుతున్నది.
ఆచంద్రుడూ , శివుని ముడిలోనున్నామే ఒకసారి కృష్ణపరమాత్మ( వరదరాజుని) పాదపద్మములలో నుండి చూద్దాము- అని సంబరపడి అయిదు అయిదు పది వ్రేళ్ళ ల్లోనూ చేరీ , ఆ ఆనందముతో తన తేజస్సును పెంచుకొన్నాడుట! పావనమయ్యాడుట! ఎంత అందమైన భావన🙏
ఈ భావనను మించిన వాస్తవము పరమాత్మ పాదపద్మముల వ్రేలు , నఖముల , అందాలు!
ఆ అందానికి పరవశించిన యశోద తోటి గోపికలను “ ఒణ్ణుదలీర్ వన్దు కాణీరే “ – అని పిలుస్తోంది . నుదల్- అంటే- నుదురు. అందమైన నుదురు గలవారా -అని ! అంటే ఆ నుదదుటధరించిన కుంకుమరాగముతో మంగళకరముగా నున్నవారా— అని. అలా నిర్మలమైన మనస్సుగలవారగుటచే వారిలో సాత్వికగుణము అధికరించి , పరమాత్మ అనుభవములో నిండుగ మునిగిపోగలవారని పెరియాళ్వార్ ఉద్దేశ్యము గాబోలు!

నమ్మాళ్వార్ , కాశినవేన్దన్ పెరుమాళ్ అడిక్కీழ்పాడిన పాసురములో “ ఎన్ అగం కழிయాదే- అన్నట్లుగా- మన అహంకారము తొలగి పరమాత్మ పాదసన్నిధిచేరి శరణువేడాలి. “ తాయార్—- పూశిపిడిక్కుం మెల్లడి — ఆ ఎఱ్ఱని పాదకమలములకు కైంకర్యము చేసుకోవాలనే కోరిక పెరగాలి. “ కూవికొళ్ళుం కాలం కురుగాదో” – నన్ను నీ దరికి చేర్చుకొనే సమయ విలంబనము తగ్గి , నీ పాదసేవాకైంకర్యము  లభించే భాగ్యము దక్కదా అని – మనము ఆళ్వార్లలా పరితపించాలి. దానికి పీఠికగా పరమాత్మ తిరువడిని అనుభవించి,మ దిలో ధారణ చేసుకో గలగాలి. అదియే పెరియాళ్వార్ హృదయము. 🙏

పెరియాళ్వార్ తిరువడిగళే శరణం 🙏
రామానుజ దాసి 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏