ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు
Posted by adminNov 21
ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు
(పోతనామాత్యుడు.)
🏵
👉చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ !
–
భావము
హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి
పంపిస్తూ అంటున్నాడు-
“బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు.
మరి చదివితే ఏమవుతుంది?
మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది.
అందువల్ల అందరూ చదువుకోవాలి.
నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి
చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.
🏵🏵🏵🏵
👉చదివితి ధర్మార్ధ ముఖ్య శస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ !!
–
భావము:
“నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం,
అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి,
అన్ని చదువులలోని సారమూ, రహస్యమూ సంపూర్ణంగా గ్రహించాను.
మరల చదువు చెప్పటానికి చండామార్కులు ప్రహ్లాదుని తీసుకెళ్ళారు.
ఇప్పుడు మీ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు అని
చూపటానికి ఆ రాక్షసరాజు వద్దకు పర్రహ్లాదుని తీసుకొచ్చారు.
నువ్వుచదువుకున్నది ఏమిటో చెప్పమని అడిగిన తండ్రి
హిరణ్యకశిపునకు, పుత్రరత్నం ప్రహ్లాదుడు చెప్తున్న
సమాధానందలోనిది ఈ పద్యం
🏵🏵🏵🏵
👉మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు బోవునే మదనములకు !
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ సనునె తరంగిణులకు !
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల సేరునే కుటజములకు !
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక
మ్మరుగునే సాంద్ర నీహారములకు !
–
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మే రీతి నితరంబు చేర నేర్చు
వినుత గుణ శీల మాటలు వేయు నేల !!
–
భావము:
సుగుణాలతో సంచరించే ఓ గురూత్తమా!
మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే
తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా?
రాజహంస స్వచ్చమైన ఆకాశగంగా నదీ తరంగాలపై
విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా?
తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన
కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా?
చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది
కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా?
చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన
పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో
మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది.
వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన
నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”
🏵🏵🏵🏵
👉కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
–
దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి
భావము:
నాన్న గారు!
కమలా వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే
అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు;
శ్రీపతి అయిన విష్ణుదేవుని స్త్రోత్రము చేస్తేనే నాలుక అనుటకు
అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు;
దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు;
ఇతరమైన చూపులకు విలువ లేదు;
ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది
మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు విలువ లేదు;
విష్ణు కథలు వినే చెవులే చెవులు;
మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే
చిత్త మనవలెను;
పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి
మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు.
పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి;
లేకపోతే అది సద్భుద్ధి కాదు;
ఆ దేవుళ్లకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము;
చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు
చదువు మాత్రమే సరైన చదువు;
భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు;
విష్ణుమూర్తిని సేవించమని చెప్పే తండ్రే తండ్రి కాని
ఇతరులు తండ్రులా? కాదు;
నాన్నగారు! దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు,
చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి?
సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే.
లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే.
ప్రతి రోజూ,ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే.
ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే.
అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి
సార్థకత లేదు.
🏵🏵🏵🏵
👉ఇందు గలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి జూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే !!
–
భావము:
ఓ హిరణ్యకశిప మహారాజా!
శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు;
ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు
. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల
అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం
అన్నది లేదు;
అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా.
రాక్షసరాజా!
🏵🏵🏵🏵