*రాముడి యొక్క ధర్మాచరణ*
Posted by adminNov 21
*రాముడి యొక్క ధర్మాచరణ*
🙏🏻జై శ్రీమన్నారాయణ🙏🏻
ధర్మాచరణ గురించి రామాయణం లో వాల్మీకి రెండు గుణాలు చెప్పారు. ఒకటి: “ధృతి” రెండు: “నియమం”. శ్రీరాముడు అడవులకి వెళ్ళే ముందు తల్లి కౌసల్యకి నమస్కరించాడు. ఆమె “ధర్మ మార్గం లో నడువు” – అని ఉపదేశించలేదు. రాముడు ధర్మావతారం. ఆయన స్వభావం ధర్మరక్షణ. “ధర్మంచర” అని ఆయనకొకరు చెప్ప బని లేదని తల్లికి తెలుసు. అందుకని ఆమె ఇలా ఆశీర్వదించింది. “నీవు ధృతి (ధైర్యం), నియమాలతో ఏ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నావో, ఆ ధర్మమే నిన్ను రక్షించు గాక!” ప్రతీ భారతీయునికి రాముని శీలమే ఆదర్శం. రామనామమే మహామంత్రం. మనలను నేడు పీడిస్తున్న అన్ని జబ్బులకి అదే మందు.
ధర్మ మార్గమే నిజమైన భక్తి యని రాముఁడు
నమ్మాడు . ధర్మమే మనకూ , మన కుటుంబాలకు , మన సమాజానికి , హితకారియై ఈశ్వరానుగ్రహాన్నిస్తుంది . థర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని తప్పకుండా రక్షిస్తుంది. అందుకే రాముడికి సీతకంటే కూడా , ధర్మం అంటేనే ఇష్టం. ఇదే థర్మాన్ని
పాటిస్తే మనమూ దేవునిపట్ల నిజమైన
భక్తి కలిగియున్నవారమవుతాము.
శ్రీరాముఁడు ధర్మ నిష్టా గరిష్టుడు. ఏ కాలంలో నైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా , ధర్మలుబ్ధము కాకూడదు, .అని రాముఁడు విశ్వశిస్తాడు. దానికి ఉదాహరణ ఒకటి.
శ్రీరాముఁడు వనవాసంలో యుండఁగా , భరత, శత్రుఘ్నుల వల్ల తన పితృ వియోగ వార్త
తెలుసుకుని , చింతాక్రాంతుడై విలపించి ,
తనకు విహిత కర్మ అయినటువంటి పితృకర్మ
ఆచరణకొరకు , ఆపద్ధర్మముగా అక్కడ వన
వాసములో లభించినటువంటి కంద మూలా దులతో , గతించిన తన తండ్రి దశరథుడికి ,
శ్రాద్దము ఆచరించి , మందాకినీ నది వద్ద
పితృదేవులకు ఉదక తర్పణాలు ఇచ్చి , పితృ
దేవతలకు సద్గతి కలుగచేశాడు.
సుపంధానంతు గచ్ఛంతం :-
రామాయణంలోని అరణ్యకాండ మనకు
ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. సీతా వియోగంలో ఉన్న శ్రీరాముఁడు ఆమె కోసం
వెతుకుతూ , నదులను , చెట్లను, పుట్టలను ,
కొండలను , గుట్టలను, లేళ్లను , కుందేళ్ళను ,
ఇలా కనిపించిన చరాచర జీవరాశి నంతటిని
సీత గురించి ప్రశ్నిస్తాడు. ఆయనస్థితిని చూసి
తట్టుకోలేక , లేళ్ళు యధాశక్తి ప్రయత్నించి ,
ఆయనకు రావణ దుర్మార్గాన్ని గురించి సూచించాయట. పర్ణశాలవైపు చూడటం,
ఆపై దక్షిణంగా పరిగెత్తడం, ఆగి ఆకాశంవైపు
చూసి కంటనీరు పెట్టడం ,ఇలా చేస్తున్నాయట.
ఇది గమనించిన రాముడికి పర్ణశాలలో ఉన్న
సీతను , ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోయి ,
ఆకాశమార్గంలో దక్షిణదిశగా ప్రయాణించాడని
అర్థమైందిట . ఈ స్థితిని వర్ణిస్తున్న వాల్మీకి
శ్లోకం , దీనస్థితిలో పడిన ప్రతి సత్పురుషునికి
ఒక ఓదార్పు నిస్తుంది..
” సుపంధానంతు గచ్ఛన్తం
తిర్య o చొపి సహాయతే
కుపంధానంతు గచ్ఛన్తం
సోదరోపి విముంచతి “
అంటే మంచి మార్గంలో పయనిస్తున్న వ్యక్తులకు , పశుపక్ష్యాదులు కూడా సాయం
చేస్తాయట . అందుకే రామునికి లేళ్లు, జటాయువు, సంపాతి , వానరులు కూడా
సాయం చేశారు . దుర్మార్గంలో నడిచే వ్యక్తిని ,
సోదరుఁడు కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాడుట.
రావణుని విషయంలో సరిగ్గా అదే జరిగింది .
ఇదే వాల్మీకి మహర్షి అరణ్యకాండలో , మానవాళికి , చెప్పిన మహాపదేశం. రామాయణ కాలానికే కాదు , ఏ కాలానికైనా
ఏ పరిస్తితుల్లోనైనా వర్తించే మాటలివి .
అందుకే కొండలున్నంతవరకు , నదులు ప్రవహిస్తున్నంత కాలమూ , రామాయణం
ఉంటుందని , సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉద్ఘాటించిన నగ్నసత్యం.
🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻