వాల్మీకి రామాయణం 101 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminApr 11
వాల్మీకి రామాయణం 101 వ భాగం, అయోధ్య కాండ
తరువాత రాముడి దెగ్గరికి అక్కడ ఉండేటటువంటి తాపసులంతా వచ్చి ” ఇక్కడ దెగ్గరలో ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నావని తెలిసి, నీ మీద ఏ క్షణానైనా దండయాత్ర చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే వాడు మమ్మల్ని రోజూ కష్టపెడుతున్నాడు, అందుకని మేము ఇక్కడ ఉండకుండా, దూరంగా వేరొక వనానికి వెళ్ళిపోతున్నాము. కావున నువ్వు కూడా మాతో వస్తావా ” అని అడిగారు.
ఇక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చారు, ఇక్కడే ఉంటె నాకు వాళ్ళు బాగా జ్ఞాపకం వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన సైన్యములోని జంతువులన్నీ మలమూత్రాలని విసర్జించడం వలన ఈ ప్రదేశం సౌచాన్ని కోల్పోయింది, అని రాముడు తన మనస్సులో అనుకొని, సీతా లక్ష్మణులతో కలిసి ఆ తాపసులతో బయలుదేరాడు.
అలా కొంత దూరం ప్రయాణించాక వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి ” నా భార్య పేరు అనసూయ( కర్దమ ప్రజాపతి – దేవహుతిల కుమార్తె). ఆమె చాలా వృద్ధురాలు, ఆవిడ ఒకసారి దేవతల కోసం 10 రాత్రులని కలిపి ఒక రాత్రి చేసింది, దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే, ఎండిపోయిన గంగా నదిని తన తపఃశక్తితో ప్రవహించేటట్టు చేసింది, ప్రజలందరికి అన్నం పెట్టింది, ఆమె పదివేల సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేసింది, సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. రామ! సీతమ్మని ఒకసారి అనసూయ చూస్తుంది, కనుక ఆమె దెగ్గరికి ఒకసారి పంపించు ” అని అన్నాడు.
తన దెగ్గరికి వచ్చిన సీతమ్మని తన వొళ్ళో కూర్చోపెట్టుకుని అనసూయ ఇలా అనింది ” సీతా! నువ్వు మహా పతివ్రతవని, భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు, హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు, కాని స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను, నీ అభిప్రాయం కూడా చెప్పు ” అని అడిగింది.
అప్పుడు సీతమ్మ ” నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు, పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు, అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాట చెప్పింది, అరణ్యాలకి బయలుదేరేముందు కూడా కౌసల్య ఈ మాట చెప్పింది. కాని నా అదృష్టం ఏంటంటే, అమ్మ, నాన్న, సోదరులు, గురువు ఎలా ప్రేమిస్తారో, నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలిసున్నవాడు, జితేంద్రియుడు. ఇటువంటి భర్త లభిస్తే, అతనిని ప్రేమించడంలో గొప్ప ఏముందమ్మ ” అనింది.
సీతమ్మ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ ” సీతా! నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ నలగవు, కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాడవు, అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు, ఇవి నువ్వు పెట్టుకుంటే, నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహా విష్ణువుని సంతోషపెట్టినట్టు, నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు ” అనింది.
అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని, అత్రికి, అనసూయకి నమస్కారం చేసి రాముడి దెగ్గరికి వెళ్ళింది. రాముడు సీతని చూసి ” సీతా! ఎవ్వరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు ” అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు.