వాల్మీకి రామాయణం 102 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminApr 12
వాల్మీకి రామాయణం 102 వ భాగం, అయోధ్య కాండ
తరువాత అనసూయ సీతమ్మని తన దెగ్గర కూర్చోపెట్టుకొని ” నీ పెళ్లి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉంది, నాకు నీ కళ్యాణం గురించి చెప్పు” అనింది.
అప్పుడు సీతమ్మ ” జనక మహారాజు భూమిని దున్నుతుంటే, నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీతా అని పిలిచారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. నాకు యుక్త వయస్సు వచ్చాక, శివ ధనుస్సుని ఎత్తినవాడికి నన్ను ఇస్తానన్నారు. అప్పుడు రాముడు శివ ధనుర్భంగం చేశాడు. వెంటనే మా తండ్రి నాకు ఒక వరమాల ఇచ్చి, నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి, నీళ్ళు పోద్దామని జలకలశం తీసుకొచ్చి చెయ్యి పెట్టబోయాడు. కాని రాముడు, నేను క్షత్రియుడని కనుక శివ ధనుస్సుని విరిచాను, నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే, మీరు
కన్యని ఇచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగినదో కాదో, నా తండ్రిగారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకి కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్థాంగిని అయ్యాను ” అని సీతమ్మ చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది.
తరువాత వారు, మేము ఆశ్రమం నిర్మించుకుంటాము, ఎటువెళ్ళమంటారు అని అత్రి మహర్షిని అడుగగా, ఆయన ” ఇక్కడ రాక్షసులు, క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి. ఋషులు పళ్ళు తెచ్చుకునే దారి ఒకటి ఉంది, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆ దారిలోవెళ్ళండి ” అని, ఆ దారిని చూపించారు. అప్పుడు అత్రి మహర్షి దెగ్గర, అనసూయ దెగ్గర ఆశీర్వాదం తీసుకొని, సీతారామలక్ష్మణులు ఆ దారిలొ తమ ప్రయాణాన్ని సాగించారు.
మేఘాలలోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో, అలా సీతాలక్ష్మణులతో రాముడు వెళ్ళాడు.