వాల్మీకి రామాయణం 104 వ భాగం, అరణ్యకాండ

అప్పుడు రాముడు వాళ్ళ ప్రార్ధనలని స్వీకరించి, వారు ఇచ్చిన అర్ఘ్య పాద్యములు తీసుకొని సంతోషంతో అక్కడినుంచి బయలుదేరాడు. అలా కొంతదూరం వెళ్ళాక ఒకచోట చీకురువాయువులనే ఈగలు రొద చేస్తూ కనబడ్డాయి (ఈ ఈగలు పులిసిపోయి పడిఉన్న రక్తాన్ని తినడానికి వస్తాయి). అయితే ఇక్కడికి దెగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో, భయంకరమైన కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని నెత్తురోడుతుండగా తన వొంటికి చుట్టుకొని, ఒక శూలాన్ని భుజానికి ధరించినవాడై, ఆ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చినవాడై, వొంటి నిండా మాంసం అంటుకున్నవాడై ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని తన వొళ్ళో కుర్చోపెట్టుకుని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు.

అధర్మ చారిణౌ పాపౌ కౌ యువాం ముని దూషకౌ |
అహం వనం ఇదం దుర్గం విరాఘో నామ రాక్షసః ||
చరామి సాయుధో నిత్యం ఋషి మాంసాని భక్షయన్ |
ఇయం నారీ వరారోహా మమ భార్యా భవిష్యతి ||
” మీరు అధర్ములు, పాపమైన జీవితం ఉన్న వాళ్ళు. ముని వేషాలు వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యని నేను తీసేసుకున్నాను. ఇకనుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది, అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపొండి. నన్ను విరాధుడు(రాధ్ అంటె ఆనందం, విరాధ్ అంటె ఆనందానికి వ్యతిరేకం) అంటారు, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినడం చాలా ఇష్టమైన పని ” అన్నాడు.  

అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” చూశావా లక్ష్మణా, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతోందో, నాకు ఎంత కష్టమొచ్చిందో చూశావా, నా కాళ్ళ ముందు పరాయివాడు నా భార్యని ఎత్తుకొని తీసుకెళ్ళి, తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు, నాకు చాలా దుఃఖంగా ఉంది ” అని, ఆ విరాధుడి వైపు చూసి ” మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా. మేము దశరథ మహారాజు పుత్రులము, మేము రామలక్ష్మణులము, మా తండ్రిగారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు ” అని రాముడు అన్నాడు.