వాల్మీకి రామాయణం 105 వ భాగం, అరణ్యకాండ

అప్పుడా విరాధుడు ” నేను జవుడు అనే ఆయన కుమారుడిని, మా అమ్మ పేరు శతహ్రద, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను ” అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండగా, రామ లక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేశారు. అప్పుడా విరాధుడు ఆవులించేసరికి ఆ బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వాళ్ళు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధపెట్టారు. ఆగ్రహించిన విరాధుడు రాముడి మీదకి తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణముల చేత ఆ శూలాన్ని గాలిలోనే ముక్కలు చేశాడు.

అప్పుడా విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులనిద్దరినీ పట్టుకొని, తన భుజాల మీద వేసుకొని అరణ్యంలోకి వెళ్ళాడు. ఇది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేశాడు, లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కిందపడ్డాడు. కిందపడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టారు, పైకి కిందకి పడేసారు, అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతిపెట్టాల్సిందే అని, రాముడు లక్ష్మణుడితో, ఏనుగుని పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్య తవ్వమని, ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యం అంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వేసాడు.

అప్పుడా విరాధుడు ” నేను తపస్సు చేత బ్రహ్మగారి వరం పొందాను, అందువలన నన్ను అస్త్ర-శస్త్రములు ఏమి చెయ్యలేవు. నాకు ఇప్పుడు అర్ధమయ్యింది, నువ్వు కౌసల్య కుమారుడవైన రాముడివి, నీ భార్య వైదేహి, నీ తమ్ముడు లక్ష్మణుడు అని. నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గంధర్వుడిని. కాని, నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామము వలన కుబేరుడి సభకి వెళ్ళలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాపవిమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు దశరథుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో, ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్ళి స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు శాపవిమోచనం చెప్పాడు. కాబట్టి నన్ను ఈ గోతిలో పుడ్చేసి సంహరించండి. ఇక్కడినుంచి ఒకటిన్నర యోజనముల దూరం వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి, నీకు మంచి జెరుగుతుంది ” అని విరాధుడు రాముడితో అన్నాడు.

తరువాత రామలక్ష్మణులు ఆ విరాధుడిని ఆ గోతిలో వేసి, మట్టితో పుడ్చేసి, శరభంగ ముని ఆశ్రమానికి వెళ్ళారు.