వాల్మీకి రామాయణం 111 వ భాగం, అరణ్యకాండ

సీతమ్మ ఇచ్చిన కోదండాలని ధరించిన రామలక్ష్మణులు, సీతమ్మతో కలిసి బయలుదేరారు. ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా అనింది ” నేను పెద్దల దెగ్గర విన్నాను, ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చెయ్యాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను అన్నారు కదా. కాని మనిషికి కామము చేత మూడు దుర్గుణములు కలుగుతాయి, అందులో మొదటిది అసత్యము పలకడం, మీరు ఎన్నడూ అసత్యము చెప్పరు, ఇక ముందు కూడా అసత్యము చెప్పరని నాకు తెలుసు. ఇక రెండవది పరస్త్రీ వాంఛ, నేను మీ భార్యని, నాకు తెలుసు మీరు ఎన్నడూ పర స్త్రీని అటువంటి భావనతో చూడరని. మూడవది ఏంటంటే…..

తృతీయం యద్ ఇదం రౌద్రం పర ప్రాణ అభిహింసనం |

ఏ కారణము లేకుండా, అవతలి వారితో వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టడం. కాని ఆ మూడవ దోషం ఇవ్వాళ మీయందు నాకు కనబడుతోంది. మీరు నిన్న తాపసుల ఆశ్రమాలకి వెళ్ళారు, అప్పుడా తాపసులు తమని హింసిస్తున్న రాక్షసుల నుంచి రక్షించమని కోరారు. అప్పుడు మీరు ఏమన్నారు, ఇకనుంచి నా పౌరుషం చూడండి నా తమ్ముడి పౌరుషం చూడండి అని, తాపసులని హింసించే రాక్షసులని ఇకనుంచి సంహరిస్తానని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీకు, రాక్షసులకి ప్రత్యక్ష వైరం ఏదన్నా ఉందా? రాక్షసులు మీకేదన్నా అపకారం చేశారా? ఆ రాక్షసులు మీకేదన్నా అపకారం చేస్తే, మీరు క్షత్రియులు కనుక వాళ్ళని సంహరించండి, కాని ఇప్పుడు మీరు ఒక తాపసిలాగ ఈ అరణ్యాలలో తిరుగుతున్నారు. అలాంటి మీరు ఆ తాపసులకి రాక్షసులను సంహరిస్తానని ఒక రాజులాగ ఎలా ప్రతిజ్ఞ చేశారు. అందువలన కామజనితమైన ఆ మూడవ దోషము మిమ్మల్ని ఆవహించింది. కాబట్టి నాకు ఈ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు. కాలుతున్న అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువులని ఎలా మెల్లగా ఆవహించి కాల్చుకుపోతుందో, అలా మీకు కలిగిన ఈ దోషము వలన, క్రమక్రమంగా మృగాలని, రాక్షసులని చంపుదామని మీరు కోదండం పట్టుకొని తిరుగుతారు. అప్పడు మీకు, రాక్షసులకి మధ్య నిష్కారణంగా శతృత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందువలన దండకారణ్యానికి వెళ్ళడమనేది వ్యక్తిగతంగా నాకు ఆనందదాయకం కాదు. నేను చెప్పిన ఈ మాటలకి ఆధారం ఏమిటి అంటారేమో, ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి…….