వాల్మీకి రామాయణం 112 వ భాగం, అరణ్యకాండ

పూర్వకాలంలో అరణ్యంలో ఒక మహానుభావుడు మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని పాడుచేద్దామని, ఇంద్రుడు ఒక యోధుడి వేషాన్ని ధరించి, ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఆయన దెగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘ అయ్యా! నేను ఆపదలో ఉన్నాను, నేను సైనికుడిని అని తెలిసి కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు. అలా తెలియకుండా ఉండాలంటే నాదెగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు. కనుక నేను మళ్ళి వచ్చి తీసుకునేదాక ఈ ఖడ్గాన్ని మీ దెగ్గర ఉంచండి’ అని, ఆ యోధుడి వేషంలో ఉన్న ఇంద్రుడు చెప్పి  వెళ్ళిపోయాడు. ఆ ఋషి కూడా సరే అన్నాడు.

మళ్ళి ఆ యోధుడు వచ్చి ఖడ్గాన్ని అడిగినప్పుడు ఇవ్వకపోతే మాట తప్పినవాడిని అవుతానని, ఆ ఋషి తాను కూర్చునే దర్భాసనం కిందనే ఆ ఖడ్గాన్ని పెట్టుకున్నాడు. తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక, ఊరకనే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడడం కష్టమవుతోందని, ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు ఆ ఋషి. అలా ఖడ్గం మీద చెయ్యి వేసి తపస్సు చెయ్యడం వలన ఆ ఋషిలో రజోగుణం ప్రకోపించి, ఖడ్గాన్ని పట్టుకొని తిరగడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ ఖడ్గంతో అడవిలోని చెట్లని, కొమ్మలని నరకాలనిపించింది, తరువాత మృగాలని చంపాలనిపించింది, తరువాత దారిదొంగతనాలు చెయ్యాలనిపించింది, తరువాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చెయ్యాలనిపించింది. రామ! ఇంద్రుడు ఏమి చెయ్యలేదు, కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు, కాని ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచిపెట్టేసాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కోదండం, బాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు. ఆశ్రమం కట్టుకొని 14 సంవత్సరాలు తపస్సు చేసుకుంటే, మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటి ప్రతిజ్ఞలు చెయ్యండి, ఈ కోదండం, బాణాలు పట్టుకోండి. కాని ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు?

మీరు నాతో ఒక మాట అనొచ్చు, ‘ నేను రాజుని కాకపోవచ్చు, కాని నేను ఒక క్షత్రియుడిని, అందుకని నేను కోదండాన్ని పట్టుకోవడంలో తప్పులేదు’ అని. మిమల్ని ఎవరైనా ఆర్తితో రక్షించమని పిలిస్తే, వారిని మీరు రక్షించండి, తప్పులేదు. అంతేకాని, ఎక్కడో ఋషులని ఎవరో రాక్షసులు ఇబ్బందిపెడుతున్నారని, రాక్షసులందరినీ చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చెయ్యడం నాకు నచ్చలేదు. నేను స్త్రీని కదా, ఒకవేళ నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు చెప్పనేమో. మీ తమ్ముడితో ఆలోచించి, ఒక మంచి నిర్ణయానికి రండి ” అని సీతమ్మ రాముడితో అనింది.