వాల్మీకి రామాయణం 113 వ భాగం, అరణ్యకాండ

సీతమ్మ పలికిన పలుకులకి రాముడు ఇలా సమాధానం చెప్పాడు ” సీతా! రాక్షసులు తమని బాధపెడుతుంటే ఆ ఋషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు.
తే చ ఆర్తా దణ్డకారణ్యే మునయః సంశిత వ్రతాః |
మాం సీతే స్వయం ఆగమ్య శరణ్యాః శరణం గతాః ||
నేనేమి వాళ్ళని అడగలేదు, వాళ్ళంతట వాళ్ళే వచ్చి నన్ను శరణాగతి చేశారు. అప్పుడు నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా. నేను క్షత్రియుడని కనుక వాళ్ళకి కష్టం వస్తే, ఆ కష్టాన్ని నేను తెలుసుకొని రాక్షస సంహారం చేసి తాపసులు తపస్సు చేసుకునేటట్టు నేను చూడాలి. మీకు కష్టం ఉందా అని నేను వాళ్ళని అడగలేదు, నా అంతట నేను రాక్షస సంహారం చెయ్యలేదు. నేను ఇవేమీ చెయ్యలేదు, వాళ్ళు నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశారు, అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. అలా చెయ్యడం క్షాత్ర ధర్మమే. ఒకసారి నేను ఎవరినన్నా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే, నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళని రక్షించి తీరుతాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి అవసరమైతే నిన్ను విడిచిపెట్టేస్తాను, లక్ష్మణుడిని విడిచిపెట్టేస్తాను, ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అంతేకాని ఎట్టి పరిస్థితులలోను మాట తప్పను. ప్రతిజ్ఞ చేశాను కనుక రాక్షస సంహారం చేసి తీరుతాను సీతా ” అని రాముడు అన్నాడు.

ఈ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందపడి ” మీరు ఎలా నిర్ణయిస్తే అలానే జెరుగుతుంది” అనింది. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, చివరన లక్ష్మణుడు నడుచుకుంటూ ఆ అరణ్యంలో వెళుతూ ఒక్కొక్క తాపస ఆశ్రమాన్ని చూస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక చిత్రమైన పెద్ద సరస్సు కనబడింది. ఆ సరస్సులోనుంచి సంగీతం వినబడుతోంది, నృత్యం యొక్క ధ్వని వినబడుతోంది, పాటలు వినబడుతున్నాయి. ఆ సరస్సు నుండి వస్తున్న ఆ శబ్దములను విన్న రాముడు ఆశ్చర్యపోయి, తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత్ అనే మునిని పిలిచి ” ఈ సరోవరం నుంచి ఇవన్నీ వినబడుతున్నాయి, ఏంటి సంగతి ” అని అడిగారు.