వాల్మీకి రామాయణం 115 వ భాగం, అరణ్యకాండ
Posted by adminApr 25
వాల్మీకి రామాయణం 115 వ భాగం, అరణ్యకాండ
అప్పుడు రాముడు ” అయ్యా! 10 సంవత్సరాలలో తాపసుల ఆశ్రమాలన్నిటినీ చూశాను. మీరు మళ్ళి రమ్మన్నారని వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడెక్కడొ ఉందని విన్నాను, కాని ఈ అరణ్యం చాలా విశాలంగా ఉండడం వలన ఆయన ఆశ్రమం ఎక్కడుందో తెలియడం లేదు, అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దయచేసి మీరు నాకు సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించాలని అనుకుంటున్నాను ” అని అన్నాడు.
అప్పుడా సుతీక్ష్ణుడు ” రామ! ఈ మాటే నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడినుంచి 4 యోజనముల దూరం దక్షిణంగా వెళితే అగస్త్య భ్రాత(అంటె అగస్త్యుని తమ్ముడు అని అర్ధం, ఈయన పేరుని వాల్మీకి మహర్షి రామాయణంలొ ఎక్కడా ప్రస్తావించలేదు. రఘు అనే మహారాజు పుట్టిన వంశంలో జన్మించిన రాముడిని రాఘవుడు అని పిలిచినట్టు, అగస్త్యుడి తమ్ముడు కనుక ఆయనని అగస్త్య భ్రాత అని పిలిచేవారు) ఆశ్రమం కనబడుతుంది. నువ్వు అక్కడ ఒక రాత్రి పడుకో. మరునాడు ఉదయం అక్కడనుంచి బయలుదేరి వెళితే, నీకు ఒక పెద్ద చెట్ల గుంపు కనబడుతోంది. అక్కడినుంచి ముందుకి వెళితే నీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది. అక్కడ బోలెడన్ని పిప్పల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది. నువ్వు తప్పకుండా ఆ ఆశ్రమాన్ని సందర్శించు ” అన్నాడు.
సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడి దెగ్గర ఆశీర్వాదం తీసుకొని ముందుకి బయలుదేరారు. వారు అగస్త్య భ్రాత మహర్షి ఆశ్రమానికి చాలా దెగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! ఈ ఆశ్రమాన్ని అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే…………..పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనబడ్డ బ్రాహ్మణుల దెగ్గరికి వెళ్ళి, ‘ అయ్యా, రేపు మా తండ్రిగారి ఆబ్దికము, తద్దినం పెట్టాలి కనుక మీరు భోక్తగా రండి ‘ అనేవారు. అప్పుడా ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి, ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు( త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రిగారికి పెట్టె తద్దిన భోజనంలో మాంసం వండేవారు, ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు). ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తరువాత హస్తోదకం వేసి ‘ వాతాపి! రా……..’ అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు.
ఇలా చాలాకాలం, చాలా మందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి, అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి ‘వాతాపి! రా…..’ అన్నాడు.
కుతో నిష్క్రమితుం శక్తిర్ మయా జీర్ణస్య రక్షసః |
భ్రాతుః తే మేష రూపస్య గతస్య యమ సాదనం ||
” నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా ” అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు.
ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా ” అని రాముడు అన్నాడు.