వాల్మీకి రామాయణం 117 వ భాగం, అరణ్యకాండ
Posted by adminApr 27
వాల్మీకి రామాయణం 117 వ భాగం, అరణ్యకాండ
లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారిడితో తన ప్రార్ధన నివేదించాడు. అప్పుడా ముని కుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా ” నేను ఎప్పటినుంచో సీతారాములని, లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు, రాముడు రాగానే నా దెగ్గరికి తీసుకురాకుండా, నా దెగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు, వెంటనే వెళ్ళి సీతరాములని ప్రవేశపెట్టు ” అని అగస్త్యుడు అన్నాడు.
అప్పుడు సీతారామలక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి గదిలోకి వెళుతుండగా కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, వాయువు మొదలైనవారి స్థానములు ఉన్నాయి. ఆ స్థానములలో వారు కూర్చొని అగస్త్యుడిని ఆరాధన చేసి వెళుతుంటారు. అప్పుడు అగస్త్యుడు కోటిసూర్యుల తేజస్సుతో ఆ గదినుండి బయటకి వచ్చారు.
ఏవం ఉక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్య వర్చసం |
జగ్రాహ ఆపతత్ తస్య పాదౌ చ రఘునందన ||
అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః |
సీతయా సహ వైదేహ్యా తదా రామః స లక్ష్మణః ||
సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు.
అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి, తాను అగ్నికార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి, రాముడిని కూర్చోమన్నారు. కొంతసేపటికి బయటకి వచ్చిన అగస్త్యుడు ” నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలుసా రామా?, అగ్నికార్యం జెరిగేటప్పుడు అతిథి వస్తే, ముందు అగ్నికార్యాన్ని పూర్తిచెయ్యాలి, తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించనివాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు.
రామా! నువ్వు లోకములన్నిటిని పాలించగల రాజువి, ఇవ్వాళ మాకు ప్రియమైన అతిధిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను ” అని రాముడికి వానప్రస్థులకి పెట్టె బోజనాన్ని పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణు ధనుస్సుని, బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు.
” స్వామీ! మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము ” అని రాముడు అడుగగా, ” నిన్ను నేను నాతోపాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను, కాని నా తపఃశక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను, నీ కోరిక ఏమిటో నాకు అర్ధమయ్యింది. అందుకని రామా! ఇక్కడికి దెగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ, నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో ” అన్నారు.