వాల్మీకి రామాయణం 119 వ భాగం, అరణ్యకాండ
Posted by adminApr 29
వాల్మీకి రామాయణం 119 వ భాగం, అరణ్యకాండ
రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, జటాయువు పంచవటిని చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి, కావలసినంత నీరు దొరికేటటువంటి, దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి, దేవతారాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సంవృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి, అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు ” అన్నాడు.
పరవాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియతాం ఇతి మాం వద ||
అప్పుడు లక్ష్మణుడు ” స్వామీ! నన్ను నిర్మించమని చెప్తావేంటి, నిర్మించేవాడిని నేను కాదు. నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి, నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణా! ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే, రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి, రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు ” అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ” లక్ష్మణా! ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బావుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో, ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది, దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి, ఆ పర్వత చెరియల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలు, కారణ్డవములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి, ఈ ప్రాంతం చాలా అందంగా, పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై అలరాడుతోంది. అగస్త్యుడు మనన్ని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది, అందుకని లక్ష్మణా, నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు ” అన్నాడు.