వాల్మీకి రామాయణం 121 వ భాగం, అరణ్యకాండ
Posted by adminMay 1
వాల్మీకి రామాయణం 121 వ భాగం, అరణ్యకాండ
కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది, అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చెయ్యడానికి బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు ” అన్నయ్యా! నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలొ మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చెయ్యడానికి భయమేస్తుంది, సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు. అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది.
నవ ఆగ్రయణ పూజాభిర్ అభ్యర్చ్య పితృ దేవతాః |
ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి, కనుక అందరూ తమ పితృదేవతలకి నవాగ్రయణ పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి, పాడిపంట చేతికిరావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడున్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్ళకుండా, ఒడ్డున కూర్చొని, ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఉత్తమ క్షత్రియవంశంలో పుట్టి, ప్రగల్భాలు పలికి, యుద్ధంరంగం వైపు చూసి, యుద్ధానికి వెళ్ళకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు. అన్నయ్యా! నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది, అదేంటంటే……సాధారణంగా మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి, మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు, భరతుడు చాలా మంచివాడు, భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు, మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా, ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి ” అన్నాడు.
” లక్ష్మణా! నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు, నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా. మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు. అమ్మని అలా నిందించడం తప్పు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు, భరతుడి గురించి మాట్లాడు, నేను పరమ సంతోషిస్తాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను, చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతొ మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకి వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ” అని రాముడన్నాడు.