వాల్మీకి రామాయణం 123 వ భాగం, అరణ్యకాండ
Posted by adminMay 3
వాల్మీకి రామాయణం 123 వ భాగం, అరణ్యకాండ
అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |
అరణ్యం విచరామి ఇదం ఏకా సర్వ భయంకరా ||
రావణో నామ మే భ్రాతా యది తే శ్రోత్రం ఆగతః |
వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రం ఆగతః ||
అప్పుడు శూర్పణఖ ” నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు, ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు, అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చెయ్యగలిగే ఖర దూషణులు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్కపెట్టను, నాకు అపారమైన బలం ఉంది, స్వేచ్ఛావిహారం చేస్తుంటాను, ఇవ్వాళ నిన్ను చూశాక, నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు ” అని సీతమ్మ వైపు చూసి ” ఈవిడెవరు, ఇంత అసహ్యంగా ఉంది. ఈవిడా నీ భార్య, ఈవిడ నీకు తగినది కాదు, నేను నీకు తగినదానిని. నువ్వు నన్ను స్వీకరిస్తే, ముందు ఈమెని, తరువాత నీ తమ్ముడిని తినేస్తాను, అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించచ్చు” అనింది.
విశేషమైన కామమును పురుషునియందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరిచి, నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే, ఆమె మనస్సు ఖేదపడుతుంది. ఒక ఆడదాని మనస్సుని బాధపెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక, కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని, చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు ” నాకు వివాహం అయ్యిపోయిందమ్మ, నా భార్య మీద నాక చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను. రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్నివిధాల నాలా ఉన్న, తేజస్సు కలిగిన, చాలాకాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే, ఆయనకి భార్యగా ఉండు ” అన్నాడు.