వాల్మీకి రామాయణం 124 వ భాగం, అరణ్యకాండ

అప్పుడా శూర్పణఖ లక్ష్మణుడి దెగ్గరికి వెళ్ళి ” నీకు తగినటువంటి భార్యని నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనూ అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు, నేనూ అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరమూ సంతోషంగా కాలం గడుపుదాము, నన్ను స్వీకరించు ” అనింది.

అప్పుడు లక్ష్మణుడు ” నేనే ఓ దాసుడిని, మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు. నీలాంటి అందగత్తెని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయిన మా వదినతో ఎలా ఉంటాడు. ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు, అందుకని మా అన్నగారినే అడుగు ” అని పరిహాసం ఆడాడు.

లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకొన్న శూర్పణఖ సీతమ్మని చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది. శూర్పణఖ అలా మీద పడబోతుంటే భయపడిపోయిన జింకలా సీతమ్మ వెనక్కి వెళ్ళింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” చూశావ లక్ష్మణా! ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతని చంపేద్దామని అనుకొంది. తాను అందగత్తెని అన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక, కాళ్ళు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కనుక, అందం అంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక, ఆమె ముక్కు, చెవులు కోసెయ్యి ” అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ యొక్క ముక్కు, చెవులని కోసేసాడు. కోసేయబడ్డ ముక్కు, చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగార్లైన ఖర దూషణులు దెగ్గరికి వెళ్ళి కిందపడింది. అప్పుడు ఖరుడు ” ఇదేమిటి ఇలా ముక్కు, చెవులు కోయించుకున్నావు. తన పక్కన నిశబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోళ్ళతో గీరినవాడు ఎవడు, నిన్ను ముట్టుకున్న వాడు ఎవడు. వాడు ఈ పృథ్విలో ఎక్కడున్నా బతకడు. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటకి తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడు ఎక్కడున్నాడు ” అని అడిగాడు.