వాల్మీకి రామాయణం 125 వ భాగం, అరణ్యకాండ

అప్పుడా శూర్పణఖ ఇలా చెప్పింది ” ఇక్కడికి దెగ్గరలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, నార చీరలు కట్టుకున్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు, దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు, వాళ్ళ పేర్లు రామ లక్ష్మణులు, వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాలో, రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు, అంత అందంగా ఉన్నారు, వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటున్నారు. కాని వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది, ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేసారు. అన్నయ్యా! నాకు ఒక్కటే కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని సంహరించాలి. ఆయనలో నుంచి నురగతోటి, బుడగలతోటి వేడి నెత్తురు బయటకి వస్తుంటే, ఆ నెత్తురుని నా దోసిళ్ళతో పట్టుకొని తాగాలని ఉంది, కనుక నా కోరిక తీరుస్తావా ” అనింది.

“అయ్యయ్యో, నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా, తప్పకుండా తీరుస్తాను ” అని ఖరుడు అన్నాడు.

తరువాత 14 మంది సైన్యాధిపతులని పిలిచి ” మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి, శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. అక్కడ మీరు రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి, మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది ” అన్నాడు.

తాపసులైన ఆ రామలక్ష్మణులని చంపడం చాలా తేలికని భావించి ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు శూర్పణఖ వాళ్ళకి రామ లక్ష్మణులని చూపించింది. వెంటనే ఈ 14 మంది శూలాలు, కత్తులు, పరిఘలు మొదలైన ఆయుధాలని పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగుతీసారు. అప్పుడు రాముడు ” లక్ష్మణా! నువ్వు సీతమ్మ పక్కన నిలబడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను ” అన్నాడు.

ఇంద్రుడి చేతినుండి వజ్రాయుధం విడువబడినట్టు, రాముడు బాణములను తన ధనుస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు వదిలిన ఆ బాణాలు వాళ్ళ గుండెలకి ఉన్న కవచాలని పగలగొట్టి, వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి. ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ, నెత్తురోడుతూ నేల మీద పడి మరణించారు.

ఇదంతా చూసిన శూర్పణఖ మళ్ళి వెళ్ళి ఖరుడి దెగ్గర పడింది. ఇప్పుడే కదా 14 మందిని పంపించాను, మళ్ళి ఏమయ్యిందని ఇలా పడిపోయావు, అని ఖరుడు అడిగాడు. అప్పుడా శూర్పణఖ ” పంపించావులేవయ్య 14 మందిని రామలక్ష్మణులని చంపమని, వాళ్ళని రాముడు ఒక్క క్షణంలో చంపేసాడు. రాముడు మహావీరుడు. నిజంగా నీకు రాముడిని ఎదురించే శక్తి ఉంటె నీ దెగ్గరున్న కింకరులని పంపించడం కాదు, నువ్వే స్వయంగా బయలుదేరు. నువ్వు వచ్చి దండకారణ్యంలో రాక్షసులకి కంటకంగా ఉన్న ఆ రాముడిని సంహరించు. నువ్వు రాముడిని చంపడానికి వెళ్ళకపోతే, నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలని వదిలేస్తాను. అస్తమానం నా దెగ్గరికి వచ్చి, నేను వాడిని వీడిని చంపాను అంటావేంటి, అవన్నీ ఒట్టిదే, నువ్వు శూరుడివి కాదు. రాముడు మహావీరుడని చెప్పాను కదా, వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో ” అనింది.