వాల్మీకి రామాయణం 127 వ భాగం, అరణ్యకాండ

తస్మాత్ గృహీత్వా వైదేహీం శర పాణిః ధనుర్ ధరః |
గుహాం ఆశ్రయ శైలస్య దుర్గాం పాదప సంకులాం ||
అందుకని లక్ష్మణా నువ్వు వెంటనే ధనుర్బాణములని పట్టుకొని, సీతని తీసుకొని, ఎవరు చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో ‘సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో’ అనే మాటలు చెప్పమాకు. నువ్వు యుద్ధం చెయ్యలేవు అని కాదు, నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు, కాని వీళ్ళతో యుద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం లేడు. నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో ” అన్నాడు.

అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే, ఆనాడు పినాకిని అనే ధనుస్సుని పట్టుకొని దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు.

ఆశ్రమానికి వచ్చిన ఖరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు, రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతునప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి, ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు.

రాముడు ఒక్కసారి తన ధనుస్సుని తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయబాణ తూణీరంలొ నుంచి బాణం తీశాడో, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనుస్సుకి సంధించాడో, ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు, అంత వేగంగా బాణ ప్రయోగం చేశాడు. రాముడు ఒక్కడు నేల మీద నుంచి యుద్ధం చేస్తుంటే, దారుణంగా 14,000 మంది రాక్షసులు రథాలలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు, మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి, పర్వతాలు ప్రకంపించాయి, వన దేవతలు వనాన్ని విడిచి పారిపోయారు, క్రూరమృగాలు దిక్కులు పట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకి ఏనుగుల తొండాలు తెగిపోయాయి, గుర్రాల కాళ్ళు రాలిపోయాయి, రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి, కొందరికి భుజాలు, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏక కాలంలో 13 బాణాలని వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా ఆ 14,000 మంది రాక్షసులని రాముడు ఒక్కడే సంహరించాడు.