వాల్మీకి రామాయణం 130 వ భాగం, అరణ్యకాండ
Posted by adminMay 10
వాల్మీకి రామాయణం 130 వ భాగం, అరణ్యకాండ
రాముడు ఖర దూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు ” అసలు ఆ రాముడు ఎవరు, దండకారణ్యంలో ఎందుకున్నాడు, వారితో ఉన్న ఆ స్త్రీ పేరేమి, అసలు 14,000 రాక్షసులని రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు. నాకు కారణం చెప్పు ” అన్నాడు.
అప్పుడు అకంపనుడు ” రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, దశరథుడి కుమారుడు, విశేషమైన తేజస్సు కలిగినవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, రాముడికి బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు, ఆయన రాముడికి కుడిభుజం లాంటివాడు, సర్వకాలములయందు రాముడిని కాపాడుకోవడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి ప్రవేశించాడు. తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధలని రాముడికి చెప్పుకుంటె, మీకు శత్రువులైన రాక్షసులు నాకూ శత్రువులే కనుక వారిని సంహరిస్తాను అని ఆ ఋషులకి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఆ రాముడు తన బాణముల చేత ఈ భూమిని కృంగేటట్టు చెయ్యగలడు, కృంగిపోతున్న భూమిని నిలబడేటట్టు చెయ్యగలడు, సముద్రాలని క్షోభింప చెయ్యగలడు, పర్వతాలని కదపగలడు ” అని అకంపనుడు విశేషంగా రాముడి పరాక్రమాన్ని వర్ణించాడు.
” అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరిస్తాను ” అని రావణాసురుడు అన్నాడు.
అప్పుడు అకంపనుడు ” మీరు తొందరపడి వెళ్ళవద్దు, ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఆయన ముందు మీరు నిలబడలేరు. రాముడిని సంహరించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది, రాముడి భార్య అయిన సీత చాలా అందంగా ఉంటుంది. ఆ సీతతో అందంలో సమానమైన వాళ్ళు గంధర్వలులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, రాక్షసులలో కాని, మనుష్యులలో కాని లేరు. అందుకని రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతని పోగొట్టుకున్న రాముడు తనంతటతానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో ” అన్నాడు.