వాల్మీకి రామాయణం 134 వ భాగం, అరణ్యకాండ

దీర్ఘబాహుః విశాలాక్షః చీర కృష్ణ అజిన అంబరః |
కందర్ప సమ రూపః చ రామో దశరథ ఆత్మజః ||
అప్పుడా శూర్పణఖ ” రాముడు పెద్ద పెద్ద చేతులతో, విశాలమైన కన్నులతో, మునులలాగ నార చీర, కృష్ణాజినం వేసుకొని, మన్మధుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్టు ధనుస్సుని పట్టుకొని, నారాచ బాణములను సంధిస్తే, అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహా సర్పాలలాగ ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసులని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు, కాని రాముడు బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురిచూసి వదిలాడో నేను చూడలేదు. కాని రాక్షసుల తలకాయలు టకటక తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణ ప్రయోగం చేస్తాడు. రాముడితో గుణములయందు, తేజస్సుయందు సమానమైనవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు.

రామస్య దక్షిణే బాహుః నిత్యం ప్రాణో బహిః చరః |

ఆ లక్ష్మణుడు రాముడికి కుడి భుజంలా, బయట తిరుగుతున్న ప్రాణంలా సర్వకాలములయందు రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత, ఆమె పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. విశాలమైన నేత్రములు కలిగి ఉంటుంది. నిరంతరం రాముడిని అపారమైన ప్రేమతో సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లటి జుట్టుతో ఉంటుంది, అందమైన ముక్కుతో, అందమైన స్వరూపంతో ఉంటుంది, ఎంతో కాంతివంతంగా ఉంటుంది, ఆవిడ సాక్షాత్తు ఇంకొక శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారంలా ఆవిడ శరీరం ఉంటుంది, ఎర్రటి రక్తం లోపలినుంచి కనబడుతున్నటువంటి తెల్లటి గోళ్ళతో ఉంటుంది, పద్మంలాంటి ముఖంతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకి, యక్షులకి, కిన్నెరులకి, దానవులకి చెందినదికాదు, ఆమె నరకాంత. కాని ఈ భూమండలంలో నేను ఇప్పటివరకూ అటువంటి సౌందర్యరాశిని చూడలేదు. సీత ఎవరిని గాఢలింగనం చేసుకుంటుందో, ఎవడు సీతకి భర్త అని అనిపించుకుంటాడో, వాడే మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు, వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు.

నాకు ఆ సీతని చూడగానే, ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే, ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అన్నయ్యా. నువ్వు కాని సీతని చూస్తే, మన్మధ బాణాలకి వసుడవయిపోతావు. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటె, ఇంక ఆలోచించకుండ వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముడిని సంహరించు ” అనింది.