వాల్మీకి రామాయణం 135 వ భాగం, అరణ్యకాండ
Posted by adminMay 15
వాల్మీకి రామాయణం 135 వ భాగం, అరణ్యకాండ
శూర్పణఖ మాటలు విన్న రావణుడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక చూసి ” ఇక మీరు బయలుదేరండి ” అన్నాడు. అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర మార్గం మీదుగా పయనమయ్యాడు. అలా వెళుతుండగా ఆయనకి ఒక పెద్ద వట వృక్షం కనబడింది.(తన తల్లి అయిన వినతకి దాస్య విముక్తి చెయ్యడానికని, గరుక్మంతుడు అమృతం తేవడానికి బయలుదేరేముందు తన తండ్రి అయిన కశ్యపుడిని అడిగాడు, నేను ప్రయాణం చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని. అప్పుడా కశ్యపుడు ” నువ్వు హిమాలయ పర్వతాలకి దెగ్గరగా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనబడుతుంది, ఆ సరోవరం ఒడ్డున రెండు గజకచ్ఛపాలు కొట్టుకుంటూ ఉంటాయి. అవి ఒక తాబేలు ఒక ఏనుగు. పూర్వకాలంలో, ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు మరణించిన కొంత కాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి, ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా అవ్వమని, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందం 3 యోజనములు ఉంటుంది. ఆ ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడువు ఉంటుంది. ఏనుగు తాబేలుని బయటకి లాగాలని చూస్తుంటుంది, తాబేలేమో ఏనుగుని నీళ్ళల్లోకి లాగెయ్యాలని చూస్తుంది, అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండడంలేదు. కనుక ఆకలి వేస్తే ఆ రెండిటినీ తినేసెయ్యి ” అని కశ్యప ప్రజాపతి అన్నాడు. గరుక్మంతుడు సరే అని బయలుదేరాడు, అలా వెళుతూ వెళుతూ ఆ ఏనుగుని, తాబేలుని చూశాడు. ఆ రెండింటినీ తన కాలి గోళ్ళతో పైకి ఎత్తి, న్యగ్రోధం అనే మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండిటినీ పెట్టాడు. ఆ గజకచ్ఛపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా, గరుక్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మని పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. తరువాత ఆ గజకచ్ఛపాలని ఒక పర్వతం మీద పెట్టుకొని తినేశాడు. ఆ తరువాత ఇంద్రుడి దెగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతని దాస్యం నుండి విముక్తురాలిని చేశాడు. ఆనాడు గరుక్మంతుడు ఆ గజకచ్ఛపాలని పెట్టినది ఈ వృక్షం మీదనే). రావణుడు ఆ న్యగ్రోధం అనే వృక్షాన్ని చూసి, కిందకి దిగి చుట్టూత చూసేసరికి, ఆయనకి ఒక తాపస ఆశ్రమం కనబడింది.