వాల్మీకి రామాయణం 136 వ భాగం, అరణ్యకాండ

అప్పుడాయన ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా, అందులో నారచీర కట్టుకొని, జటలు వేసుకొని, నియమముతో ఆహారాన్ని తింటున్నటువంటివాడై, ఒకప్పుడు రాక్షసుడైనటువంటి మారీచుడు కనబడ్డాడు. అప్పుడా రావణాసురుడు ” ఓ మారీచా! నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నీవంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు. నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చెయ్యాలి. నీకు తెలుసు కదా, జనస్థానంలో 14,000 రాక్షసులను నియమించి మునుల యొక్క ధర్మాల్ని, యజ్ఞాలని నాశనం చెయ్యమని చెప్పాను.  నేను చెప్పిన పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడినుంచో రాముడు వచ్చి ఖరుడిని, దూషనుడిని, త్రిశిరస్కుడిని, మహాకపాలుడిని మరియు 14,000 రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనస్సుకి ఎంత బాధగా ఉందో తెలుసా. రాముడు కర్కశుడు, తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాలని జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అన్ని ప్రాణులను భయపెట్టేవాడు, దశరథుడికి అసహ్యం వేసి రాముడిని అరణ్యాలకి వెళ్ళగొట్టాడు, అందుకని నేను రాముడిని బాధపెట్టాలని అనుకుంటున్నాను. ఏ పాపం ఎరుగని పిచ్చి తల్లి నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధపెట్టిన రాముడిని బాధపెట్టడానికి ఆయన భార్య అయిన సీతని అపహరించి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని, అందుకని ఏ యుద్ధమూ చెయ్యకుండా పని జెరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడది నీకు చెబుతాను విను. నీకు సమస్త మాయలు తెలుసు కనుక, నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటిమీద వెండి చుక్కలు ఉండాలి, ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంటపడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తు, అటూ ఇటూ ఆడు. అప్పుడు సీత నిన్ను చూసి, ఆ మృగం కావాలి అని అడుగుతుంది. సీత కోరిక తీర్చడం కోసం రాముడు నీ వెనకాల వస్తాడు, అప్పుడు నువ్వు అదృశ్యమవుతూ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపో, అలా కొంత దూరం వెళ్ళాక హా! సీత, హా! లక్ష్మణా అని రాముడి కంఠంతో అరువు. రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని, రాహువు చంద్రుడిని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారిపో ” అన్నాడు.