వాల్మీకి రామాయణం 137 వ భాగం, అరణ్యకాండ

ఈ మాటలు విన్న మహాత్ముడైన మారీచుడు, దేవతలు కనురెప్ప వెయ్యకుండా ఎలా నిలుచుంటారో అలా నిలుచుండిపోయాడు. శవం నిలబడితే ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు. తరువాత ఆయన అన్నాడు…..

సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః |
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ||
” రావణా! మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కాని వాళ్ళు మనన్ని అభ్యున్నతి వైపుకి నడిపించేటట్టుగా మాట్లాడేవారు కాదు. కొంతమంది మాట్లాడితే అప్రియంగా మాట్లాడినట్టు ఉంటుంది, కాని ఆ మాటలలో అవతలివారి అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మనకి మంచి చెప్పేవాడు దొరకడు, ఒకవేళ అలాంటివాడు దొరికినా వినేవాడు దొరకడు. నీకు ఎవరో గూఢచారులు చెబితే రాముడి గురించి విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్షకట్టి నీ ప్రాణములు తియ్యాలని చూస్తున్నాడు. అందుకని నీకు అన్నీ అసత్యములు చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహా ధర్మాత్ముడు, మహేంద్రుడికి, వరుణుడికి ఎటువంటి పరాక్రమము ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమము ఉంది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా, తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కొసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానము వస్తుంది, సీతమ్మ మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికని, రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికని భూమిమీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు, నీతోపాటుగా లంకా పట్టణం నశించిపోతుంది, రాక్షసులందరూ భూమిమీద పడి నశించిపోతారు. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు, ఆ మాటలు విని అన్నీ నీకు తెలుసనుకొని ఆ మాటలు ఇంకొకరికి చెబుతున్నావు. నువ్వు రాజువి, ఇంత చపలబుద్ధితో ఉండకూడదు.

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః |
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవః ||
ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒకచోట పోసి, దానికి ప్రాణం పోస్తే, ఆయనే రాముడు. సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. రాముడు ఈ లోకములన్నిటికి రాజు. అటువంటి రాముడి జోలికి వెళితే నువ్వు నాశనమయిపోతావు. నీకు తెలియక సీతమ్మని తీసుకొస్తాను అంటున్నావు, ఆమె బూది కప్పిన నిప్పు, తన తేజస్సుతో తనని రక్షించుకోగలదు. ఆమె కారణజన్మురాలు. రాముడి యొక్క కోదండం నీడలో రక్షింపబడుతున్న సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ! ఆవిడని అపహరించడానికి నీ శక్తి సరిపోదు.