వాల్మీకి రామాయణం 138 వ భాగం, అరణ్యకాండ

జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం |
యత్ ఇచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియం ||
నీకు రాజ్యం ఉంది, నిన్ను కామించన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే, రాముడి పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. నీకు ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకో, నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి, బంగారు కుండలాలు పెట్టుకొని, వర గర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటివాడు యాగం చేస్తుంటే, నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుంచి రాముడిని, లక్ష్మణుడిని తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యాగం చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకొని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో, అప్పుడు నాకంత పొగరుండేది.

అజాత వ్యంజనః శ్రీమాన్ బాలః శ్యామః శుభేక్షణః |
ఏక వస్త్ర ధరో ధన్వీ శిఖీ కనక మాలయా ||
నేను కిందకి చూసేసరికి, మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు సరిగ్గా రాని, పద్మములవంటి కన్నులున్న, ఒక్క వస్త్రం కట్టుకుని, చేతిలో కోదండం పట్టుకొని, పిలక పెట్టుకొని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది, వీడా నన్ను చంపేవాడు అని, నువ్వు ఇప్పుడు ఎలా అనుకున్నావో నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను. బాలచంద్రుడివంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగ గుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటినుంచి నాకు రాముడన్నా, రామబాణం అన్నా హడల్.