వాల్మీకి రామాయణం 141 వ భాగం, అరణ్యకాండ

అప్పుడు మారీచుడు ” రాజు తప్పు త్రోవలో నడుస్తుంటే, మంత్రులైన వారు చుట్టూ చేరి నిగ్రహించాలి, అలా నిగ్రహించని మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాజ్యపాలన నిర్వహిస్తున్నవాడిని పాశములతో పట్టే స్థితిలో మంత్రులు లేకపోతే, ఆ మంత్రులకి మరణశిక్ష విధించాలి. రాజె ధర్మం, రాజె జయం, రాజు వల్లనే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిననాడు లోకంలో రక్షణ ఉండదు, ఆ రాజుని ఆశ్రయించిన వారెవరూ బ్రతకరు.

స్వామినా ప్రతికూలేన ప్రజాః తీక్ష్ణేన రావణ |
రక్ష్యమాణా న వర్ధంతే మేషా గోమాయునా యథా ||
రాజన్నవాడు ప్రజల వెనకాల ఎలా ఉండాలంటే, కొడుకుల వెనక తండ్రిలా ఉండాలి. అలా ఉండనివాడు ఆవుల వెనకాల వచ్చిన నక్కలాంటి వాడు. అలాంటివాడి వలన ఆ ప్రజలకి భద్రత ఉండదు. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న ఆ రాజ్యంతో పాటు, ఆ రాక్షసులూ నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని తెలిసి, రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరికివాడివని, యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువువి కనుక, నా కొనప్రాణం వరకూ నువ్వు చెప్పిన పనిని చెయ్యడానికి ప్రయత్నిస్తాను, కాని సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే, నా పని అయిపోయినట్టే. రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను, ఆ తరువాత సీతమ్మని తెచ్చి, నువ్వు సకల బంధుపరివారంతో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నానో, అప్పుడే నా ప్రాణాలు పోయాయి, ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ, ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడంలేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను, పద ” అని అన్నాడు.