వాల్మీకి రామాయణం 144 వ భాగం, అరణ్యకాండ

జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ, మందలలో కలిసిపోతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతున్నాడు, కాని రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. సరే అని రాముడు అక్కడిదాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతర్ధానమయిపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా, మృగాల యొక్క మందలో చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఆ మృగం మళ్ళి కనపడింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకొని, ఒక త్రాచుపాములాంటి బాణాన్ని కొదండానికి సంధించి, బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడా మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా ” హా! సీత, హా! లక్ష్మణా ” అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులోనుంచి నీరు బయటకి వస్తే ఎలా ఉంటుందో, అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటకి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు.

ఆ దృశ్యాన్ని చూశిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకువచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకువచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కాదా అని బెంగపెట్టుకొని, అక్కడున్నటువంటి రెండు మృగాలని సంహరించి, వాటి మాంసాన్ని తీసుకొని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఇంతలో మారీచుడు అన్నటువంటి ‘ హా! సీత, హా! లక్ష్మణా ‘ అనే కేక సీతమ్మ చెవినపడింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి ” చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. ‘ హా! సీత, హా! లక్ష్మణా’ అని ఒక పెద్ద కేక వేశారు. బలిష్టమైన ఎద్దుని సింహం లాగుకొని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో, ఇవ్వాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు. నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు ” అని అనింది.

అప్పుడు లక్ష్మణుడు ” వదినా! నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు ” అని అన్నాడు.