వాల్మీకి రామాయణం 146 వ భాగం, అరణ్యకాండ

అప్పుడు సీతమ్మ ” నాకు అర్ధమయ్యిందిరా మహా పాపి! కృరాత్ముడా! నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ద్రువపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు, నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కాని నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇందీవరశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా, రాముడు ప్రాణాపాయంలో ఉంటె నువ్వు నా దెగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక, నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ” అనింది.

అప్పుడు లక్ష్మణుడు ” ఎంత ప్రమాదం తెచ్చావు వదిన ఇవ్వాళ. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది ” అని అన్నాక రెండుచేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని ” వదినా! నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు, కాని నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకి ఏమి చెప్పుకొని జవాబు చెప్పను. నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు, భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు చెబితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినవి, పెద్దదానివి, అనడానికి నీకు అర్హత ఉంది. కాని నన్ను ఇన్నిమాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు.

వదిన నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక, ఓ వనదేవతలార! మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వెళ్ళడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించెదరుగాక. వదినా! నేను రాముడి దెగ్గరికి వెళుతున్నాను, నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను ” అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ ” అమ్మా! నేను మళ్ళి తిరిగొచ్చి, మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే, మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా….” అన్నాడు.

అప్పుడు సీతమ్మ ” పాపిష్ఠివాడ, నువ్వు ఇంకా వెళ్ళకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకొని అయినా చనిపోతాను. కదులుతావ కదలవా ” అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది.

అప్పుడా లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు.