వాల్మీకి రామాయణం 147 వ భాగం, అరణ్యకాండ

అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి, రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజక(సాధువు) వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి, అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చెయ్యకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది.

అలా ఆ రావణుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళి ” నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని, పద్మం వంటి ముఖంతో, పద్మములవంటి చేతులతో, పద్మాలలాంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యదేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా. నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి……….” అంటూ సీతమ్మని కేశములనుండి పాదముల వరకూ ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణన చేశాడు. అలాగే ” చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు, నువ్వు నా మనస్సుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీవంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో ఇది చాలా క్రూరమృగాలు ఉండే అరణ్యం, ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు, నువ్వు తొందరగా ఇక్కడినుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి, అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి ” అన్నాడు. ( ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దెగ్గరికి వచ్చి, ఆమె అందాన్ని పొగుడుతూ, తనని తాను పొగుడుకుంటూ, ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్ళలాగ ఆనాడు రావణుడు మాట్లాడాడు.)  

కాని సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన, రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కాని ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో, అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి అర్ఘ్య పాద్యములు ఇచ్చింది.