వాల్మీకి రామాయణం 148 వ భాగం, అరణ్యకాండ
Posted by adminMay 28
వాల్మీకి రామాయణం 148 వ భాగం, అరణ్యకాండ
సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోడానికి సిధ్దపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది అని వాల్మీకి మహర్షి అన్నారు.
అప్పుడా సీతమ్మ ” నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని. రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని పెళ్ళి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటిని అనుభవించాను( సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది). కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు.
మమ భర్తా మహాతేజా వయసా పంచ వింశకః ||
అష్టా దశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||
అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరాలు, రాముడికి 25 సంవత్సరాలు ” అని చెప్పి ” ఓ బ్రాహ్మణుడా! నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నీ గోత్రం ఏమిటి, నువ్వు ఎవరు ” అని అడిగింది.
అప్పుడా రావణుడు ” సీత! నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు, అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దెగ్గరి నుంచీ, ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడంలేదు, అందుకని నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే, నిన్ను పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే, 5000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు, సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను ” అన్నాడు.