వాల్మీకి రామాయణం 149 వ భాగం, అరణ్యకాండ
Posted by adminMay 29
వాల్మీకి రామాయణం 149 వ భాగం, అరణ్యకాండ
రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ ” రావణా! నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహా సముద్రాన్ని, పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో, అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహంలాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప, నీవంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో, నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దెగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో, నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత అజ్ఞానో, పెద్ద రాయిని మెడకి చుట్టుకుని సముద్రాన్ని ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, సూర్య చంద్రులని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకువెళదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుగ్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో, రాముడికి నీకు అంత తేడా ఉంది ” అని అనింది.
అప్పుడా రావణుడు ” నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని, ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి, ఆ కుబేరుడిని లంకా పట్టణం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళి ఉత్తర దిక్కుకి వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కాని కోపం వచ్చి కనుబొమ్మలని ముడేస్తే, ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి, రాజ్యం లేక, అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి. నా దెగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు నీ అదృష్టం, నా కన్ను నీ మీద పడింది, నన్ను నువ్వు పొందు ” అని గర్వంగా అన్నాడు.